Gandhi Jayanti 2021: జాతిపిత గొప్పదనం తెలిపే చిత్రాలివే..

2 Oct, 2021 12:21 IST|Sakshi

భారత దేశం గర్వించదగిన మహనీయులలో మహాత్మా గాంధీ ఒకరు. భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్య్రం అందించడం కోసం చేసిన పోరాటానికి గాంధీజీ ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు.. యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అందుకే ఆయన మహాత్ముడు అయ్యారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జాతిపితను మరోసారి స్మరించుకుంటూ.. గాంధీజీ జీవిత చరిత్ర ఆధారంగా, ఆయన సాగించిన స్వాతంత్య్ర పోరాట పటిమ ఆధారంగా తెరకెక్కిన చిత్రాలపై ఓ ఇక్కడ ఓ లుక్కేయండి.

1)  గాంధీ (1982) 
బ్రిటీష్ ఫిలిం మేకర్ రిచర్డ్ అటెన్ బర్గ్ తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ’. 1982 లో విడుదలైన ఈ సినిమాలో బ్రిటీష్ యాక్టర్ బెన్ కింగ్‌స్లే మహాత్మా గాంధీ పాత్రలో నటించాడు. బ్రిటీష్ పాలనకు బాపూజీ ఎలా చరమగీతం పాడారనేది ఇందులో చూపించారు. సినిమా తెరకెక్కించిన తీరు ఆస్కార్ అవార్డుకు సైతం ఎన్నికైంది . బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ లాంటి కేటగిరీలు అన్నీ కలిపి గాంధీ మూవీకి మొత్తం 8 ఆస్కార్ అవార్డులు వరించడం విశేషం.

2) ‘ది మేకింగ్ ఆఫ్ మహాత్మ’ (1996) 
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే సాధారణ పౌరుడు దేశం గర్వించేలా ‘మహాత్మా గాంధీ’ ఎలా అయ్యారనే అంశంతో ‘ది మేకింగ్ ఆఫ్ మహా​త్మ’ సినిమా తెరకెక్కింది. దక్షిణాఫ్రికాలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం నుంచి కసితో స్ఫూర్తిని పొందిన గాంధీ.. భారత్‌కి తిరిగొచ్చి స్వాతంత్య్ర ఉద్యమానికి ఎలా నాయకత్వం వహించారు?.. బ్రిటిషర్లను దేశం నుంచి ఎలా తరిమి కొట్టారనే అంశాలను ఈ మూవీలో చూపించారు.

3) హే రామ్ (2000)
కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హే రామ్’. ఈ మూవీ గాంధీ హత్యోదంతంపై ఫోకస్ చేస్తూ తెరకెక్కించారు. గాంధీ హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే కోణంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.

4) గాంధీ మై ఫాదర్ (2007)
ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ మై ఫాదర్’. ఈ మూవీ గాంధీలోని మరో కోణాన్ని చూపించింది. యావత్ జాతికి జాతి పితగా నిలిచిన గాంధీ తన సొంత కుమారుడి చేత మాత్రం ఒక మంచి తండ్రి అనిపించుకోలేకపోయారనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శన్ జరివాలా, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో నిజ జీవితంలో గాంధీకి, ఆయన వారసుడు హీరాలాల్‌కి మధ్య దూరం విధానం గురించి తెరకెక్కించారు. గాంధీ హత్య తర్వాత కొద్ది రోజులకే అత్యంత పేదిరకంతో హీరాలాల్ చనిపోయినట్టు ఈ చిత్రంలో చూపించారు. బాలీవుడ్‌ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాను నిర్మించారు.

5)‘మహాత్మ’ (2009)
శ్రీకాంత్‌ హీరోగా, భావన హీరోయిన్‌గా కృష్ణవంశీ తెలుగులో తెరకెక్కించిన చిత్రం ‘మహాత్మా’. ఈ మూవీలో రౌడీగా ఉన్న కథనాయకుడు గాంధీజీ ప్రేరణతో ఎలా మారాడు అనేది ఈ సినిమా వృత్తాంతం. హింసే సమస్యలకు మార్గం అనుకునే హీరోను బాపూజీ అహింస సిద్ధాంతంతో హీరోయిన్‌ ఎలా మార్చింది.. అతడు మారిన తర్వాత ఎదుర్కొన్న పరిణామాలను ఇందులో చక్కగా చూపించారు. 

6) లగేరహో మున్నా భాయ్ (2010) 
ఈ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఈతరం ఆడియెన్స్ చూసిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఇది ఒకటి. పైగా ఇదే సినిమాను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి  శంకర్ దాదా జిందాబాద్ అనే టైటిల్‌తో రీమేక్ అయి భారీ విజయాన్ని అందుకుంది. గాంధీగిరితో ఏదైనా సాధించొచ్చనే స్టోరీలైన్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇవే కాకుండా ఇంకా మరెన్నో చిత్రాలు గాంధీజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కాయి. బాపూజీ జీవితంలో అందరికీ తెలిసిన విషయాల నుంచి ఎవరికీ తెలియని కోణాల వరకు వివిధ రకాల అంశాలను ఆ సినిమాల్లో చూపించారు.

మరిన్ని వార్తలు