Gargi Movie Review: ఊహించని క్లైమాక్స్‌.. గొప్ప సందేశం

15 Jul, 2022 09:58 IST|Sakshi
Rating:  

టైటిల్‌: గార్గి
నటీనటులు : సాయి పల్లవి, కాళి వెంకట్‌, కలైమామణి శరవణన్‌, ఆర్‌.ఎస్‌ ఐశ్వర్యలక్ష్మి, జయప్రకాశ్‌ తదితరులు 
నిర్మాత: రవిచంద్రన్, రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ రామచంద్రన్ 
రచన,దర్శకత్వం: గౌతమ్ రామచంద్రన్ 
సంగీతం : గోవింద్ వసంత
సమర్పణ: రానా దగ్గుబాటి(తెలుగులో)
విడుదల తేది: జులై 15, 2022

వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చున్నారు నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి. ఇటీవల విరాట పర్వం చిత్రంతో అలరించిన ఆమె తాజాగా ‘గార్గి’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  తమిళ్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు రానా దగ్గుబాటి  రిలీజ్‌ చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. భారీ అంచన మధ్య ఈ శుక్రవారం (జులై 15) విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
గార్గి(సాయి పల్లవి) ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. ఆమె తండ్రి బ్రహ్మానందం(ఆర్‌.ఎస్‌ శివాజీ) హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. ఓ రోజు బ్రహానందం పనిచేసే అపార్ట్‌మెంట్‌లో ఓ చిన్నారిపై అత్యాచారం జరుగుతుంది. ఈ గ్యాంగ్‌ రేప్‌ కేసులో బ్రహ్మానందం అరెస్ట్‌ అవుతారు. తన తండ్రి ఎలాంటి తప్పు చేయడని బలంగా నమ్మిన గార్గి..అతన్ని నిర్ధోషిగా బయటకు తీసుకొచ్చేందుకు ​న్యాయ పోరాటానికి దిగుతుంది. తండ్రి తరపున వాదించడానికి ఏ లాయర్‌ ముందుకు రాని సమక్షంలో  జునియర్‌ లాయర్‌ గిరీశం(కాళీ వెంకట్‌) గార్గికి మద్దతుగా నిలుస్తాడు. బ్రహ్మానందం తరపున వాదించడానికి ముందుకొస్తాడు. ఆ సమయంలో గార్గి ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? సమాజం ఆమెను, ఆమె కుటుంబాన్ని ఎలా చూసింది? బ్రహ్మానందాన్ని బయటకు తీసుకొచ్చేందుకు లాయర్‌ గిరీశం చేసిన ప్రయత్నం ఏంటి? చివరకు తన తండ్రిని గార్గి నిర్ధొషిగా బయటకు తీసుకొచ్చిందా? లేదా? అనేదే మిగతా కథ. 

ఎలా ఉదంటంటే.. 
‘ఆడ పిల్లగా పుట్టావు కదా..ప్రతి రోజు యుద్దమే’ గార్గి సినిమా ఎండింగ్‌లో ఓ యువతి చిన్నారికి చెప్పే మాట ఇది. ఇది అక్షర సత్యం. ఆడపిల్ల ప్రతి రోజు తన ఉనికి కోసం సమాజంతో యుద్దం చేయాల్సిందే. సొంతింట్లో సోదరుడు, మామ, చిన్నాన, పెదనాన్న చివరకు కన్న తండ్రిని కూడా అనుమానించాల్సిన దుస్థుతి. ఇక స్కూళ్లు, ఆఫీసులు.. ఇతర పని ప్రదేశాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదు. ఒక్కోసారి.. మంచి వాళ్లు అనుకుంటే వారే తమ వికృత చేష్టలతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

కేవలం మహిళలు, యువతుల పైనే కాదు వృద్ధులు, చిన్న పిల్లలపై కూడా అత్యాచారానికి ఒడిగడుతున్నారు. అలాంటి ఘటనల్లో బాధిత కుటుంబంతో పాటు నిందితుల కుటుంబ సభ్యులు కూడా పడే మానసిక క్షోభ ఎలా ఉంటుందనేది ‘గార్గి’ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు గౌతమ్ రామచంద్రన్.

ఇలాంటి కేసుల్లో బాధితులు మాత్రమే కాదు నిందితుల కుటుంబ సభ్యులు కూడా సమాజం నుంచి ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటారు? ఇలాంటి వారి పట్ల మీడియా ఎలా వ్యవహరిస్తుంది? అనే అంశాన్ని తెరపై చూపించడం ‘గార్గి’స్పెషల్‌. ఎటువంటి అశ్లీలత లేకుండా సున్నితమైన అంశాలను అతి సున్నినితంగా డీల్‌ చేస్తూ.. మంచి సందేశాన్ని అందించాడు దర్శకుడు గౌతమ్‌ రామచంద్రన్‌. అత్యాచార కేసులో అరెస్ట్‌ అయిన తండ్రిని నిర్ధొషిగా బయటకు తీసుకొచ్చేందకు ఓ కూతురు పడుతున్న కష్టాన్ని చూపిస్తూనే..మరో పక్క అత్యాచారినికి గురైన చిన్నారి తండ్రి పడే బాధ, మానసిక క్షోభని ప్రేక్షకులను హృదయాలను హత్తుకునేలా తెరపై చూపించాడు. అలాగే కోర్టుకు కావల్సినవి ఆధారాలు..వాటిని కూడా లాజిక్‌ మిస్ కాకుండా చూపించాడు.

అనవసరపు సన్నివేశాలను జోడించకుండా...సినిమా స్టార్టింగ్‌లోనే నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. స్కూల్‌ టీచర్‌గా సాయి పల్లవిని పరిచయం చేసి.. వెంటనే అత్యాచారం.. తండ్రి అరెస్ట్‌.. కోర్టు సీన్స్‌..ఇలా కథను పరుగులు పెట్టించాడు. అయితే ఇదే స్పీడ్‌ని సినిమా ఎండింగ్‌ వరకు కొనసాగించలేకపోయాడు. కోర్టు సీన్స్‌ కూడా అంతగా రక్తి కట్టించవు. అయితే జడ్జిగా ట్రాన్స్‌జెండర్‌ని తీసుకోవడం.. ఆమెతో ‘ఆడవాళ్లకు నొప్పి ఎక్కడ ఉంటుందో.. మగాళ్లకు ఎక్కడ పొగరు ఉంటుందో నాకే బాగా తెలుసు’లాంటి డైలాగ్స్‌ చెప్పించడం ఆకట్టుకుంటుంది. ఇక ఇలాంటి సంఘటనలో మీడియా చూపించే అత్యూత్సాహం, దాని వల్ల బాధితులు, నిందితుల కుటుంబాలకు ఎదురయ్యే సమస్యలను కూడా తెరపై అద్భుతంగా చూపించాడు. ‘ఇష్టమొచ్చింది చెప్పడం న్యూస్‌ కాదు.. జరిగింది చెప్పడం న్యూస్‌’అని సాయిపల్లవి చెప్పే డైలాగ్‌ ఆలోచింపజేస్తుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌ అయితే ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.

Gargi Movie Rating

ఎవరెలా చేశారంటే..
సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటి మాదిరే గార్గి పాత్రలో ఒదిగిపోయింది. గార్గిగా సాయి పల్లవిని తప్ప మరొకరిని ఊహించకోని రీతిలో ఆమె నటన ఉంటుంది. అయితే ఇలాంటి పాత్రల్లో నటించడం సాయి పల్లవికి కొత్తేమి కాదు. తెలుగులో వచ్చిన చాలా సినిమాల్లో ఆమె ఈ తరహా పాత్రలను పోషించారు. అయితే తమిళ్‌లో ఆమె ఇలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. తమిళ ప్రేక్షకులు కొత్త సాయిపల్లవిని తెరపై చూస్తారు. గార్గి తండ్రి బ్రహ్మానందంగా ఆర్‌.ఎస్‌ శివాజీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. లాయర్‌ గిరీశం పాత్రలో కాళీ వెంకట్‌ బాగా నటించాడు. తన అమాయకత్వంతో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు.

అత్యాచారినికి గురైన బాలిక తండ్రిగా కలైమామణి శరవణన్‌ తనదైన నటనతో కంటతడి పెట్టించాడు. జయప్రకాశ్‌, ఐశ్యర్యలక్ష్మీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం గోవింద్ వసంత నేపథ్య సంగీతం. సినిమా భావాన్ని ప్రేక్షకులను చేరవేయడంతో నేపథ్య సంగీతం బాగా ఉపయోగపడింది. కొన్ని సన్నివేశాలకు తనదైన బీజీఎంతో ప్రాణం పోశాడు. ఎడిటింగ్‌ బాగుంది. సినిమాటోగ్రఫి పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

గార్గి చిన్న చిత్రమే అయినా.. సందేశం మాత్రం చాలా పెద్దది. చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో గార్గి ఒకటని చెప్పొచ్చు.  

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3.5/5)
మరిన్ని వార్తలు