Gauri Sawant: ఆమె పాత్రను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు: గౌరీ సావంత్

7 Oct, 2022 20:46 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నటి సుష్మితా సేన్‌ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తోంది. 'తాలి' అనే వెబ్‌సిరీస్‌ కోసం ఆమె ప్రముఖ ట్రాన్స్‌జెండర్‌ యాక్టివిస్ట్‌ గౌరీ సావంత్‌ పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల కాగా.. ఇందులో ఆమె ఆకుపచ్చని చీరలో నుదిటిపై ఎర్రటి తిలకంతో బోల్డ్‌లుక్‌లో కనిపించింది. ఆమె పాత్రపై నెగెటివ్ కామెంట్లు రావడంతో తాజాగా గౌరీ సావంత్ స్పందించింది. ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్న ఆమె నిర్ణయాన్ని సోషల్ మీడియాలో కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఈ విషయంలో సుస్మితా సేన్‌కు మద్దతుగా నిలిచింది. నిజమైన ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తే బాగుంటుందన్న నెటిజన్లు కామెంట్లను  ఆమె తప్పబట్టింది.   

గౌరీ సావంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మాత అఫీఫా నదియాడ్‌వాలా సయ్యద్, సుస్మితా సేన్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మేము అసలైన స్త్రీలం… ఇప్పుడు మీరు ఇందులో నా పాత్రను పోషించబోతున్నారు. ఇది సమాజంలో మీకు గొప్ప గౌరవాన్నిఇస్తుంది. మీ ధైర్యానికి సెల్యూట్.' అంటూ సుస్మితా సేన్‌ను కొనియాడింది. ఈ పోస్ట్‌పై సుస్మితా సేన్ స్పందిస్తూ.. 'నువ్వు స్వచ్ఛమైన శక్తివి గౌరీ!!! నీవు శక్తివంతమైన ఉదాహరణగా ఉన్నందుకు ధన్యవాదాలు! మిమ్మల్ని, మీ సమాజాన్ని ఎల్లప్పుడు గౌరవిస్తాం.' అంటూ రాసుకొచ్చింది. 

మరాఠీ చిత్రనిర్మాత రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్న వెబ్‌ సిరీస్ 'తాలీ'. ఇందులో గౌరీ జీవిత ప్రయాణం, పోరాటాలను ఆరు ఎపిసోడ్‌లుగా తెరకెక్కిస్తున్నారు. సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌, మినీ ఫిల్మ్స్‌ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. కాగా గౌరీ సావంత్‌ ముంబైకి చెందిన ట్రాన్స్‌జెండర్‌ యాక్టివిస్ట్‌. గణేష్‌గా పుట్టి ఆ తర్వాత లింగమార్పిడి చేయించుకున్న గౌరీ సావంత్‌ 2013లో ట్రాన్స్‌జెండర్స్‌ని కూడా పురుషులు, మహిళలు లాగే ఓ ప్రత్యేక కేటగిరి కల్పించాలని పిటిషన్‌ దాఖలు చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్స్‌ని థర్డ్‌జెండర్‌గా గుర్తిస్తూ 2014లో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

A post shared by Shreegauri Sawant (@shreegaurisawant)

మరిన్ని వార్తలు