అలాంటి ఐటమ్‌ సాంగ్‌ అయితే చేస్తా!

15 Nov, 2022 03:44 IST|Sakshi
గెహ్నా సిప్పీ

– గెహ్నా సిప్పీ  

‘‘ఓ కాలేజ్‌ గర్ల్, మాస్‌ అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ ‘గాలోడు’. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు హీరోయిన్‌ గెహ్నా సిప్పీ. ‘సుడిగాలి’ సుధీర్‌ హీరోగా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాలోడు’. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గెహ్నా సిప్పీ మాట్లాడుతూ– ‘‘నేను ముంబైలో పుట్టి పెరిగాను.

నా ఫొటోలు, వీడియోలు చూసి, ‘గాలోడు’కి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో క్యూట్‌ కాలేజ్‌ గర్ల్‌గా కనిపిస్తాను. సెట్‌లో అందరూ తెలుగులోనే మాట్లాడేవారు. అందుకే నాకు తెలుగు డైలాగ్స్‌ చెప్పడం ఈజీగా అనిపించింది.. అయితే నా పాత్రకి నేను డబ్బింగ్‌ చెప్పలేదు. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్, సంగీతం అంటే చాలా ఇష్టం. డీసెంట్‌గా ఉండే ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తాను. హీరోల్లో రామ్‌చరణ్, నాగచైతన్య, ధనుష్‌గార్లు చాలా ఇష్టం. శేఖర్‌ కమ్ముల గారితో సినిమా చేయాలని ఉంది. సుకుమార్‌గారంటే ఇష్టం. నా తర్వాతి చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు.  

మరిన్ని వార్తలు