Ghani : అతని జర్నీ నన్ను గర్వపడేలా చేస్తాయి: అల్లు అర్జున్‌

3 Apr, 2022 08:09 IST|Sakshi

‘‘చిత్రపరిశ్రమను విశాఖపట్నంలో అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోని  24 క్రాఫ్ట్స్‌కి మీరు (అల్లు అరవింద్‌) మాస్టర్‌. అల్లు రామలింగయ్యగారి పేరు మీద రాజమండ్రిలో హోమియోపతి మెడికల్‌ కాలేజీ పెట్టినట్లు వైజాగ్‌లో అల్లు రామలింగయ్యగారు, చిరంజీవిగారి పేర్లు కలిసి వచ్చేలా ఓ యాక్టింగ్‌ కాలేజీ పెట్టించాలని అరవింద్‌గారిని కోరుతున్నాను. విశాఖపట్నం సినిమా హబ్‌ కావాలంటే అరవింద్‌గారి వంటి పెద్దలు ముందుకు రావాలి. చిరంజీవిగారు ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌. ఆయన ఆశీస్సులు అందరికీ ఉంటాయి. వైజాగ్‌ సినిమా హబ్‌ అయితే లోకల్‌ టాలెంట్‌ చాలామంది వస్తారు. వైజాగ్‌లో ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రభుత్వం, ప్రజల సహకారం ఉంటుంది’’ అని ఏపీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు.

వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వైజాగ్‌లో జరిగిన ‘గని’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ఏపీ ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్‌ ధరలను పెంచింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి. ఇండియాలో కలెక్షన్స్‌ వైజ్‌గా టాప్‌లో ఉంది. ఇండియాలో రెండు బ్లాక్‌బస్టర్స్‌ మనవే. అల్లు బాబీ తన తండ్రి అల్లు అరవింద్‌ స్థాయి ప్రొడ్యూసర్‌ కావాలి. పదేళ్ల క్రితం వరుణ్‌ తేజ్‌ స్టార్‌ హీరో అవుతాడని చెప్పాను. ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ పాన్‌  ఇండియా  స్టార్‌ అవుతాడని చెబుతున్నాను. ‘పుష్ప’ సినిమాతో బన్నీ ఇండియాను షేక్‌ చేశాడు’’ అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ – ‘‘‘కేజీఎఫ్‌’ చూసినప్పుడు వరుణ్‌తో ఇలాంటి సినిమా తీయాలి కదా అనే ఫీలింగ్‌ వచ్చింది. ఏదో ఒక రోజు వరుణ్‌తో అలాంటి సినిమా చేస్తాను. కిరణ్‌ మంచి దర్శకుడు అవుతాడు. అల్లు బాబీకి సినిమా పట్ల మంచి నాలెడ్జ్‌ ఉంది. వైజాగ్‌ పై ప్రేమతో మంత్రిగారు నాకు ఇచ్చిన సలహాను తప్పకుండా తీసుకుంటా. మా నాన్నగారు పాలకొల్లులో పుట్టి సినిమాల్లోకి వెళ్లాలని మద్రాసు వెళ్లారు. అలా సినిమా పరిశ్రమలో యాభై ఏళ్లు పైన ఉన్నారు. నేను నిర్మాతగా టాలీవుడ్‌తో సరిపోదని, హిందీలో కూడా సినిమాలు తీశాను. కానీ బన్నీ ఇండియా స్టార్‌ అవ్వడమే కాకుండా ఇతర దేశాల్లోని క్రికెటర్స్‌ కూడా తగ్గేదేలే స్టెప్‌ను అనుకరించేలా చేశాడు. అల్లు పతాకాన్ని ఎక్కడికో తీసుకుని వెళ్లాడు’’ అన్నారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ – ‘‘మా అన్నయ్య అల్లు బాబీ పూర్తి స్థాయి నిర్మాత అవుతున్నందుకు సంతోషంగా ఉంది. అన్నయ్య కథ ఓకే చేస్తే మినిమమ్‌ గ్యారంటీ. మా కజిన్‌  సిస్టర్‌ వివాహం సిద్ధుతో జరిగింది. సిద్ధు ఇప్పుడు ‘గని’తో నిర్మాత అయ్యాడు. వరుణ్‌ ఎన్నుకునే కథలు, అతని జర్నీ నన్ను గర్వపడేలా చేస్తాయి’’ అన్నారు.

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ – ‘‘నేను కిరణ్‌ను నమ్మాను. ‘గని’ సినిమా చూశాక తప్పు చేయలేదనిపించింది. కల్యాణ్‌ బాబాయ్‌గారి ‘తమ్ముడు’ సినిమా చాలా ఇష్టం. తమ్ముడు అంత కాకపోయినా ఆ సినిమా అంత బాగుండాలని ప్రయత్నం చేశాం. చిరంజీవిగారి గురించి మాట్లాడకపోతే నాకు ఇన్‌ కంప్లీట్‌గా ఉంటుంది. మా పెదనాన్నగానే కాదు.. ఓ యాక్టర్‌గా కూడా ఆయన నాకు స్ఫూర్తి. నాతో పాటు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్న నాన్నగారికి (చిరంజీవిని ఉద్దేశిస్తూ..) థ్యాంక్స్‌’’ అన్నారు.

కిరణ్‌ కొర్రపాటి మాట్లాడుతూ – ‘‘గని’ త్రీ ఇయర్స్‌ కల.. కష్టం. ఒక వ్యక్తి నమ్మకం. అతనే వరుణ్‌. పవన్‌  కల్యాణ్‌గారికి ‘తమ్ముడు’ ఎలాంటి మైల్‌స్టోన్‌  అయ్యిందో.. వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో ‘గని’ అలా మైల్‌స్టోన్‌  అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమా చేసే ప్రయత్నం చేశాం’’ అన్నారు అల్లు బాబీ. ‘‘వరుణ్‌ లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా ఎలా వస్తుందని అల్లు అర్జున్‌గారు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. అల్లు అరవింద్‌గారు మంచి గైడ్‌లైన్స్‌ ఇస్తారు’’ అన్నారు సిద్ధు ముద్ద. ఏపీ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రభాకర్, ‘గని’ చిత్రబృందం పాల్గొంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు