Ghantasala: ఘంటసాల పుట్టిన రోజు: పాటకు భలే మంచిరోజు

4 Dec, 2021 11:38 IST|Sakshi

Veteran Singer Ghantasala 100th Birth Anniversary: సాక్షి, హైదరాబాద్‌: అమరగాయకుడు ఘంటసాల మాస్టారు బతికుంటే నేటికి నూరేళ్లు.  తెలుగుజాతికి అమూల్యవరంలా లభించిన ఆ మహాగాయకుడి గురించి ఎంతని రాయగలం. ఘంటసాసాల పుట్టిన రోజంటే తెలుగు పాట పుట్టిన రోజు. ఆ స్వరధార ఇప్పటికీ, ఎప్పటికీ అమృతమే. గాన గంధర్వడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు  శతజయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది సాక్షి.

1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు ఘంటసాల వెంకటేశ్వర్రావు. తండ్రి నుంచి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని గాయకుడిగా, స్వరకర్తగా తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో లెజెండ్‌గా నిలిచారు. ఘంటసాల కంఠం ఒక మంత్రదండం. నండూరి ఎంకి అయినా, పుష్పవిలామైనా, భగవద్గీత అయిన అదొక పారవశ్యం. ఘంటసాల గురించి మాట్లాడుకోవడం అంటే భలేమంచి రోజు అని పాడుకోవడమే.

తెలుగు సినిమా సంగీతాన్ని ఎవరెస్ట్  ఎత్తుకు చేర్చిన ఘనత ఘంటశాల మాస్టారుది. బెజవాడ నుంచి బ్రెజిల్‌ దాకా, పంజాబ్‌ నుంచి పారిస్‌ దాకా ఆయన ఖ్యాతి ఎరుగని వారుండరు. గేయ రచయితలు అక్షరాలకు ప్రాణం పోసేస్తే..ఆ మాటలను మల్లియల మాలికలు చేసి​ శ్రోతలను ఉర్రూతలూగించిన గళం. శిలలపై చిక్కిన శిల్పాల సరిగమలతో సమో‍్మహనం చేసిన స్వరం. ఆయన నిష్క్రమించి నాలుగు దశాబ్దాలు దాటిపోయినా సినీ సంగీతంలో ఓలలాడించిన జగదేకవీరుడాయన.


ఇరవై ఏళ్ల  నవ యవకుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అంతేకాదు పద్దెనిమిది నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు.ఆతరువాత సముద్రాల రాఘవాచార్యతో  ఏర్పడిన పరిచయం ఆయన జీవితాన్ని అద్భుత మలుపు తిప్పింది.  గాయకుడిగా పాడిన తొలి సినిమా స్వర్గసీమ, ఆ పాటకుగాను ఆయన అందుకున్న పారితోషికం 116 రూపాయలు. వేన వేల పాటలు పాడటమే కాదు, స్వరకర్తగా తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించారు. ఆయన జీవితాన్ని మలుపుతిప్పిన చిత్రం పాతాళ భైరవి. దీంతోపాటు  కీలు గుర్రం, మనదేశం, మాయాబజారు, లవకుశ, గుండమ్మ కథ, మిస్పమ్మ , రహస్యం, దేవదాసు,  షావుకారు  భక్త తుకారం, దేవుడు చేసిన మనుషులు లాంటి గొప్ప గొప్ప సినిమాలతోపాటు మరెన్నో భక్తిరస గీతాలు, పద్యాలతో తెలుగు సినీ అభిమానులను ఓలలాడించారు.  ఆయన పాటలు  గురించి మాట్లాడుకోడమంటే ఆకాశంలో చుక్కలు ఏరుకోవడమే.

తెలుగు సినిమాకు ఆయన కాలం ఒక స్వర్ణయుగం. తరాలు మారినా  వేణునాదమై, అమృత వర్షపై కురిసిన ఆణిముత్యల్లాంటి ఆయన పాటలు మరో  సహస్ర కోటి సంవత్సరాలు గడిచినా నులివెచ్చగా మన హృదయాల్ని తాకుతాయి.  పాడవోయి భారతీయుడా, తెలుగు వీర లేవరా అని వెన్నుతట్టిన లేపిన ఆయన పాట విని రోమాంచితం కాని అభిమాని ఎవరుంటారు. ఈ జీవన చదరంగంలో అన్నా, నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది అన్నా,  నిన్నటి కన్నా మొన్న మిన్నగా అంటూ విరహ వీణలను మోగించినా ఆయనకే చెల్లు. జోలపాడినా, వెన్నుతట్టినా, మొట్టికాయలేసినా, భావగీతమైనా, విషాదగీతమైనా, విప్లవగీతమైనా ఘంటసాల తరువాతే ఎవరైనా. కేవలం 51 ఏళ్ల వయసులోనే ఆయనను కోల్పోవడం తెలుగు జాతి దురదృష్టం.

1974 ఫిబ్రవరి 11న  ఘంటసాల తుదిశ్వాస విడిచి పాటను దుంఖ సాగరంలో ముం‍చేశారు. 1970లో భారత రాష్ట్రపతి  వీవీ గిరి చేతుల మీదుగా నుంచి పద్మశ్రీ  పురస్కారం అందుకున్నారు. 2003లో, భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా స్టాంపు విడుదల చేసింది. తెలుగు పాట ఖ్యాతిని అజరామరం చేసిన ఆ అమరగాయకుడికి మరోసారి శతసహస్ర వందనాలు చెబుదాం.

అమరగాయకుడు  366 రోజులపాటు ఘంటసాల స్వర రాగ మహాయాగం నిర్వహిస్తున్నారు. 2021 డిసెంబరు 04 నుంచి 2022 డిసెంబరు 04 వరకు ప్రతీ  శని, ఆదివారాలలో భారత కాలమానం ప్రకారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు వర్చువల్‌గా ఈ వేడుకలు జరుగుతాయి. ప్రారంభోత్సవ ప్రత్యేక కార్యక్రమం డిసెంబరు 4 సాయంత్రం 5:30 గంటలకు మొదలవుతుంది. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శతజయంతి సంవత్సరం సందర్భంగా 366 రోజులపాటు ఘంటసాల స్వర రాగ మహాయాగం నిర్వహిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు