మనసున్న నేత కేసీఆర్: కాదంబరి కిరణ్‌

24 Nov, 2020 17:05 IST|Sakshi

కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ సినిమా ఇండస్ట్రీని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు.. మనసున్న నేత కేసీఆర్ అన్నారు నటుడు, ‘మనం సైతం’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్‌. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఆయన మాట్లాడారు. ‘మనం సైతం’ తరఫున కేసీఆర్‌కి, టీఆర్‌ఎస్‌కి‌ సపోర్టు చేస్తున్నాను అన్నారు. పేదవారికి సాయం చేసేందుకు తాను ఎప్పుడు వెళ్లిన కేటీఆర్, సంతోష్ కుమార్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సపోర్ట్ చేస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌ ఇండస్ట్రీకి కేటాయించబోయే 1500 ఎకరాల ఫిల్మ్ సిటీలో కొంతవరకు పేద కార్మికుల కోసం స్థలం ఇవ్వాలని కోరుకొంటున్నాను అన్నారు. (చదవండి: టాలీవుడ్‌కు వరాల జల్లు; కేసీఆర్‌కు చిరు కృతజ్ఞతలు)

థియేటర్ల రీ ఓపెనింగ్‌.. కేసీఆర్‌కు ధన్యవాదాలు
థియేటర్లు రీఓపెనింగ్‌ చేసుకునేలా జీవో ఇవ్వడంతో పాటు సినీ ఇండస్ట్రీకి లాభం చేకూర్చేలా పలు నిర్ణయాలు ప్రకటించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీ తరపున తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. చిన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇచ్చినందుకు.. థియేటర్లు ఇష్టప్రకారం షోలు పెంచుకునేందుకు.. సినిమా టికెట్ల ధరను 50 రూపాయల నుంచి 250 రూపాయల వరకు నిర్ణయించుకునేందుకు నిర్మాతలకు అధికారం ఇచ్చినందుకు.. సినీ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చినందుకు తెలుగు సినీ నిర్మాతల మండలి నుంచి ప్రెసిడెంట్ సి.కల్యాణ్, సెక్రటరీలు పసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల.. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడేందుకు తీవ్రంగా కృషి చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జునకు కృతజ్జతలు తెలిపారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇతర డిపార్ట్‌మెంట్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు