గ్లామర్‌ పాత్రలు రావడం లేదు: ‘శశి’ హీరోయిన్‌

14 Mar, 2021 01:04 IST|Sakshi

‘‘శశి’ చిత్రనిర్మాతలు మొదట నాకు ఫోన్‌ చేసి కథ వినమన్నారు. ఆ తర్వాత దర్శకుడు శ్రీనివాస్‌ వచ్చి మూడు గంటలు ‘శశి’ కథ చెప్పారు. కథ వినగానే చాలా థ్రిల్‌ అయ్యి నటించేందుకు ఒప్పుకున్నాను’’ అని హీరోయిన్‌ సురభి అన్నారు. ఆది సాయికుమార్‌ హీరోగా శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆర్‌.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా సురభి విలేకరులతో మాట్లాడుతూ -‘‘శశి’ రెగ్యులర్‌ ప్రేమకథా చిత్రం కాదు. అన్ని రకాల అంశాలున్న ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. తల్లితండ్రులు, కూతురు మధ్య ఉన్న ప్రేమను ఈ చిత్రంలో బాగా చూపించారు. నిజ జీవితంలోనూ నా తల్లితండ్రులకు నేనొక్కదాన్నే కావడంతో శశి పాత్రకు బాగా కనెక్ట్‌ అయ్యాను. కూతురు పట్ల ఓ తండ్రి ఎంత రక్షణగా, బాధ్యతగా ఉంటాడన్నది ఆకట్టుకుంటుంది. నా తండ్రి పాత్రలో రాజీవ్‌ కనకాలబాగా నటించారు.

ఈ సినిమాలో ఆది పాత్ర రగ్డ్‌గా ఉంటుంది. తన పాత్రలో రెండు వేరియేషన్స్‌ ఉంటాయి. నేను కూడా రెండు వేరియేషన్స్‌లో నటించడం కొత్తగా అనిపించింది. గ్లామర్‌ రోల్స్‌ చేయడానికి అభ్యంతరం లేదు. ‘ఓటర్‌’ సినిమాలో నాది గ్లామర్‌ పాత్రే. ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది. ‘శశి’ సినిమా విడుదల తర్వాత నాకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయనుకుంటున్నాను. తమిళంలో చేస్తుండడం వల్ల తెలుగులో ఎక్కువగా చేయలేకపోయా. తెలుగులో కొన్ని కథలు వింటున్నా. తమిళంలో 3 సినిమాలు చేస్తున్నాను. కన్నడ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఎంట్రీ ఇస్తున్నా. గోల్డెన్‌ స్టార్‌ గణేష్‌తో నటిస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు