త్వరలో పెళ్లి !.. అంతలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు

28 May, 2022 09:52 IST|Sakshi

ప్రముఖ హాలీవుడ్ నటుడు రే లియోటా (రేమండ్‌ అలెన్‌ లియోటా) మే 26న డొమినికన్‌ రిపబ్లిక్‌లో నిద్రలోనే కన్నుమూశారు. 67 ఏళ్ల రే లియోటా 'డేంజరస్‌ వాటర్స్‌' షూటింగ్‌ లొకేషన్‌లో మరణించినట్లు ఆయన ప్రచారకర్త జెన్నిఫర్‌ అలెన్‌ అధికారికంగా ప్రకటించారు.  మార్టిన్‌ స్కోర్సెస్‌ డైరెక్ట్‌ చేసిన గుడ్‌ ఫెల్లాస్‌ సినిమాతో మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌గా రే గుర్తింపు పొందారు. 1990లో వచ్చిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలో మాబ్‌స్టర్‌ హెన్రీ హిల్‌ పాత్రలో అద్భుతమైన నటన కనబర్చాడు. ఈ మూవీకి అనేక క్యాటగిరీల్లో ఆస్కార్‌ లభించింది. ఆయన మృతితో సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు రణ్‌వీర్‌ సింగ్, అర్జున్‌ కపూర్‌ తదితరులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. 

రే లియోటా కాప్‌ ల్యాండ్‌ (1992), హన్నిబాల్‌ (2001), జాన్‌ క్యూ (2002), ఐడెంటిటీ (2003), కిల్లింగ్‌ మి సాఫ్ట్‌లీ (2012), మ్యారేజ్ స్టోరీ (2019), ది మెనీ సెయింట్స్‌ ఆఫ్‌ నెవార్క్‌ (2021) చిత్రాలలో నటించి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా మైఖేల్‌ రుడాల్ఫ్‌ రచించిన 'షేడ్స్‌ ఆఫ్‌ బ్లూ: 30 ఇయర్స్‌ ఆఫ్‌ (అన్‌) ఎథికల్‌ పోలీసింగ్‌' నవల ఆధారంగా తెరకెక్కిన షేడ్స్‌ ఆఫ్‌ బ్లూ (2016-18) క్రైమ్‌ డ్రామా టెలివిజన్‌ సిరీస్‌లో కూడా నటించాడు. రే లియోటాకు ఒక కుమార్తె కర్సెన్‌ లియోటా ఉండగా, తనకు కాబోయే భార్య (ఫియాన్సీ) జాసీ నిట్టోలోను వివాహం చేసుకోవాలనుకున్నట్లు సమాచారం.

చదవండి: 'డెడ్‌' అని సమంత పోస్ట్‌.. ఆ వెంటనే డిలీట్‌

మరిన్ని వార్తలు