ఆర్‌ఆర్‌ఆర్‌, కశ్మీర్‌ఫైల్స్‌ కాదు.. ఆస్కార్‌ బరిలో గుజరాతీ ఫిల్మ్‌ 'ఛెల్లో షో'

21 Sep, 2022 00:26 IST|Sakshi

ఆస్కార్‌ అవార్డుల సందడి మొదలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుకలకు ‘బెస్ట్‌ ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ (అంతర్జాతీయ ఉత్తమ చిత్రం) విభాగంలో నామినేషన్‌  ఎంట్రీ పోటీ కోసం మన దేశం తరఫున గుజరాతీ మూవీ ‘ఛెల్లో షో’ (ఇంగ్లీష్‌లో ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’) ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్‌ ఫెడరేషన్‌  ఆఫ్‌ ఇండియా మంగళవారం ప్రకటించింది. పాన్‌  నలిన్‌  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భవిన్‌  రాబరి, భవేష్‌ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్‌  రావల్‌ ప్రధాన పాత్రధారులు. 

ఈ చిత్రకథ విషయానికి వస్తే... గుజరాత్‌లోని సౌరాష్ట్రలో గల చలాలా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల సమయ్‌ (భవిన్‌  రాబరి) సినిమా ప్రొజెక్టర్‌ టెక్నీషియన్‌ ఫజల్‌ (భవేష్‌ శ్రీమాలి)ని మచ్చిక చేసుకుని,  సినిమా హాల్‌ ప్రొజెక్షన్‌ బూత్‌లోకి ప్రవేశిస్తాడు. అలా వేసవిలో చాలా సినిమాలు చూస్తాడు. ఆ తర్వాత అతనే సొంతంగా ఓ ప్రొజెక్షన్‌ని తయారు చేయాలనుకుంటాడు. సినిమా అతని జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందనే కథతో ఈ చిత్రం సాగుతుంది. చిత్రదర్శకుడు నలిన్‌  నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ‘‘ఛెల్లో షో’పై నమ్మకం ఉంచి, మా చిత్రాన్ని ఆస్కార్‌కు ఎంపిక చేసినందుకు ఫిల్మ్‌ ఫెడరేషన్‌  ఆఫ్‌ ఇండియాకు  ధన్యవాదాలు. ఇప్పుడు నేను మళ్లీ ఊపిరి తీసుకోగలుగుతున్నాను. అలాగే సినిమా అనేది వినోదాన్ని, స్పూర్తిని, విజ్ఞానాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను’’ అని ట్వీట్‌ చేశారు దర్శకుడు పాన్‌  నలిన్‌ . ఈ సంగతలా ఉంచితే.. బెస్ట్‌ ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని ఎంపిక చేయకపోవడంపట్ల సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శిస్తూ, ట్వీట్లు చేశారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని చిత్రబృందం ఆస్కార్‌ నామినేషన్‌ ఎంట్రీకి పంపించిందా? లేదా అనే విషయంపై స్పష్టత లేదు. 

మరిన్ని వార్తలు