Gunasekhar: అందుకే ఆ హీరోలు నన్ను దూరం పెట్టలేదు!

2 Jun, 2021 05:07 IST|Sakshi

గుణశేఖర్‌ మొండి మనిషి..తాను నమ్మినదే చేస్తారు.. తీస్తారు. సినిమా అంటే ఆయనకు ప్రేమ.. పిచ్చి అని కూడా అనొచ్చు. అందుకే రిస్క్‌లు తీసుకుంటారు. ప్రస్తుత తరానికి మన కథలు చెప్పడానికి రిస్క్‌ తీసుకుంటారు. రిస్క్‌లో రిలాక్సేషన్‌ని చూసుకుంటారు. నేడు గుణశేఖర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ విశేషాలు..

కరోనా మనుషులకు దూరం పెంచింది. వేడుకలు చేసుకునే వీల్లేకుండా చేసింది. 2020, 2021 కరోనా టైమ్‌ని గురించి కొన్ని మాటలు చెబుతారా?
గుణశేఖర్‌: మనకు ఎదురైన పెద్ద సవాల్‌ కరోనా. చదువుకుంటున్నప్పుడు స్కూల్‌ గోడలపై ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని రాసి ఉన్న సూక్తులను ఎక్కువమందిమి పట్టించుకోలేదు. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం మరొకటి లేదని అందరికీ తెలిసేలా కరోనా రూపంలో ఓ పెద్ద కుదుపు వచ్చింది. నీటితో పాటు గాలిని కూడా కొనుక్కొని పీల్చుకునే స్థాయికి పడిపోయాం. పర్యావరణ సమతుల్యత, ప్రకృతిని కాపాడుకోవడం వంటివి మన తరంవారు సరిగ్గా పాటించలేదు. ఇప్పటినుంచైనా భవిష్యత్‌ తరాలకు మంచి నివాస యోగ్యమైన, చెడు ప్రభావాలు లేని పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తుపెట్టుకోవాలి.


మీ 23 ఏళ్ల కెరీర్‌ని గమనిస్తే నిదానమే ప్రధానం అన్నట్లుగా సినిమాలు చేశారు. బాలల చిత్రం ‘రామాయణం’తో కలుపుకుని జస్ట్‌ 12 సినిమాలే చేశారు.. ఈ నిదానం కరెక్టే అంటారా? 
‘రుద్రమదేవి’ తర్వాత నా దర్శకత్వంలో మరో సినిమా వచ్చి ఐదేళ్లవుతోంది. నిదానమే ప్రధానం అన్నట్లుగా నేను వెళ్లినట్లు అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో నిదానం పనికి రాదు. ఒకప్పుడు నేను ‘రామాయణం’ వంటి గొప్ప సినిమా తీశానని గత విజయాలను చెప్పుకుంటే కుదరని రోజులు ఇవి. ఇప్పుడు ట్రెండ్‌లో ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. పెద్ద పెద్ద మహానుభావుల గొప్ప సినిమాల చరిత్రే కాలగర్భంలో కనుమరుగైపోతోంది. ‘నిదానమే ప్రధానం’ అని చెప్పిన ఒకప్పటి పెద్దవారే ‘ఆలస్యం అమృతం విషం’ అని కూడా చెప్పారు. అందుకే ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ, కాస్త వేగం పెంచాల్సిన సమయం ఇది. 

ఇంత గ్యాప్‌ రావడానికి కారణం మీరు మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌ ఎన్నుకోవడమే అనుకోవచ్చా?
అది ఒక కారణం. ‘రుద్రమదేవి’ తర్వాత ‘హిరణ్య కశ్యప’ వంటి భారీ ప్రాజెక్ట్‌ మీద మూడేళ్లు పెట్టాను. ఈ కథపై ఏడాది కూర్చున్నాను. ఈ ప్రాజెక్ట్‌ కోసం కొందరు హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు మాతో టైఅప్‌ అయ్యారు. వారితో ట్రావెల్‌ అయ్యే ప్రాసెస్‌లో హాలీవుడ్‌ స్టైల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ తెలుసుకున్నాను. వారు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్‌ ప్రొడక్షన్‌లపై ఎక్కువ టైమ్‌ పెట్టి ప్రొడక్షన్‌ టైమ్‌ తగ్గించుకుంటారు. స్టోరీ బోర్డింగ్, సినిమా ఇలా ఉంటుందని ఊహించుకుని యానిమేట్రిక్స్‌ తయారీ అంతా పకడ్బందీగా చేశాం. ఇందుకోసం మూడేళ్లు టైమ్‌ పట్టింది. క్యాస్టింగ్‌ దగ్గర ఆగింది. ఒకసారి ఈ సినిమా సెట్స్‌పైకి వెళితే పది నెలల్లో షూటింగ్‌ పూర్తి చేస్తాను. ఆ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ కూడా తొందరగా పూర్తి చేయగలను. ఓ ఐదేళ్ల ప్రాజెక్ట్‌కు సంబంధించిన వర్క్‌లో నేను ఆల్రెడీ మూడేళ్లు వర్క్‌ చేసేశాను. ఈ  మూడేళ్ల వర్క్‌ వల్ల షూటింగ్‌ రోజులు తగ్గుతాయి.

కానీ, సినిమా ఆగిందని టాక్‌!
లేదు. ఇన్నేళ్ల శ్రమను ప్రేక్షకులకు చూపించాలనే ఉత్సాహంతో ఉన్నాను. కోవిడ్‌ కారణంగా కొంతకాలం హోల్డ్‌లో పెట్టాను. ‘శాకుంతలం’ పూర్తయ్యాక నా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ‘హిరణ్య కశ్యపనే’.

‘రుద్రమదేవి’ని గోన గన్నారెడ్డి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో తీయమని మిమ్మల్ని కొందరు హీరోలు, నిర్మాతలు అడిగారు. కానీ మీరు రుద్రమదేవినే తీశారు. మరి.. వారితో మీ స్నేహం ఎలా ఉంది?
కొందరు హీరోలు, మేకర్స్‌ గోన గన్నారెడ్డి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సినిమా తీయాలన్నట్లుగా అన్నారు. రుద్రమదేవి ఓ మహిళ కథ. అందుకే గోన గన్నారెడ్డి పాయింటాఫ్‌ వ్యూలో ‘రుద్రమదేవి’ కథను చెప్పాలని నేను అనుకోలేదు. ‘రుద్రమ దేవి’ కథలో గోన గన్నారెడ్డి వస్తాడు కానీ... గోన గన్నారెడ్డి కథలో రుద్రమదేవి రారు అన్నది నా వాదన. ఆమె కథనే చూపించాలని మొండిగా కూర్చున్నాను. అలాగే ‘రుద్రమదేవి’ వంటి పవర్‌ఫుల్‌ లేడీ సినిమాను సపోర్ట్‌ చేయాలని అల్లు అర్జున్‌ వచ్చి గోన గన్నారెడ్డి పాత్రను పోషించి తన సంస్కారాన్ని చాటుకున్నారు. ఇక గోన గన్నారెడ్డి చుట్టూ తీయాలని కోరినవాళ్లు నేను తీయలేదు కదా అని నన్ను తప్పుగా అనుకోలేదు. మా స్నేహబంధం అలానే ఉంది. అయినా స్టార్‌ హీరోలు చెప్పినట్లు వెళితే ఇంకా గొప్ప విజయం రావచ్చేమో? చాలా సందర్భాల్లో హీరోలు ఇచ్చిన ఓ సెన్సిబుల్‌ ఐడియాతో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ప్రాజెక్టులు నిలబడిన సందర్భాలున్నాయి. అందువల్ల మనం కూడా వేరేవాళ్లని తప్పుబట్టాల్సిన పని లేదు. 


చిరంజీవికి ‘చూడాలని ఉంది’ వంటి హిట్, ‘మృగరాజు’ వంటి ఫ్లాప్‌ ఇచ్చారు. మహేశ్‌బాబుకి ‘ఒక్కడు, అర్జున్‌’ వంటి హిట్స్, ‘సైనికుడు’ వంటి ఫ్లాప్‌ ఇచ్చారు. ఓ ఫ్లాప్‌ తర్వాత హీరోలు.. దర్శకులను దూరం పెట్టాలనుకుంటారా?
అందరి గురించి చెప్పలేను. నాతో చేసిన హీరోల గురించి చెప్పగలను. ఇక్కడ హిట్, ఫ్లాప్‌ గురించి కాదు. కొందరు సెన్సిబుల్‌ హీరోలు డైరెక్టర్‌ లోపం ఉందనుకున్నప్పుడు దగ్గరికి రానివ్వరు. కానీ ఎఫర్ట్‌లో లోపం లేదు.. ఫలితంలోనే ఎక్కడో తేడా కొట్టిందంటే మాత్రం మళ్లీ ఆ దర్శకుడితో సినిమా చేయడానికి ముందుకొస్తారు. ఉదాహరణకు ‘వరుడు’ మంచి కథ. నన్ను ఆ హీరో (అల్లు అర్జున్‌) నమ్మారు. కథలో కొన్ని వాణిజ్య అంశాలు జోడించడం వల్ల ప్రేక్షకులకు సరిగ్గా చేరువ కాలేదు. కానీ నా ఎఫర్ట్‌లో లోపం లేదని నమ్మిన అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డి పాత్ర చేశారు. నా కథ, ఆలోచనలో తప్పు ఉండొచ్చేమో కానీ నా ఎఫర్ట్‌లో కాదు.. ఎఫర్ట్‌లో లోపం లేనప్పుడు ఏ హీరో మనల్ని దూరం పెట్టరు. నా ప్రయత్నలోపం ఉండదని తెలుసు కాబట్టి ఆ హీరోలు నన్ను దూరం పెట్టలేదు. అలాగని మరోసారి మళ్లీ మనం తప్పుడు కథ తీసుకెళ్లకూడదు. ఇప్పుడు నేను ఓ కథ అనుకుని, చిరంజీవిగారికి చెప్పాలని ఫోన్‌ చేస్తే, రమ్మని ఆహ్వానిస్తారు. గుణ చెప్పిన కథను ఇప్పుడేం వింటాం? అని నా గురించి హీరోలు అనుకునే పరిస్థితి లేదు. ఆ నమ్మకాన్ని నేను కాపాడుకోగలిగా.  


మైథాలజీ (శకుంతల–దుష్యంతుడి ప్రేమకథతో ‘శాకుంతలం’ తీస్తున్నారు) సినిమాలకు ఖర్చు ఎక్కువ, సమయం ఎక్కువ. రిస్క్‌ కదా?
(నవ్వుతూ) నాకు రిస్క్‌లో రిలాక్సేషన్‌ ఉంటుంది. ఎందుకంటే నా ప్లానింగ్‌ అంత బాగుంటుంది. ‘రుద్రమదేవి’ సాధించిన విజయం వల్ల మళ్లీ అలాంటి సినిమాలు ప్లాన్‌  చేయగలుగుతున్నాను. హాలీవుడ్‌ సంస్థ మార్వెల్‌ సృష్టించిన అవెంజర్స్‌ లాంటి సూపర్‌ హీరో సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కానీ అష్టదిక్పాలకులకు మించిన అవెంజర్స్‌ ఎవరున్నారు చెప్పండి. మన భారతదేశంలో పురాణాలు, ఇతిహాసాలు, ఫ్రీడమ్‌ ఫైటర్స్‌... ఇలా మన దగ్గరే ఎన్నో కథలు ఉన్నాయి. ఓ హాలీవుడ్‌ వ్యక్తి మహాత్మా గాంధీ గురించి సినిమా తీశాక అరే.. మనం ఎందుకు తీయలేదని అప్పుడు ఆలోచిస్తాం. మన రామాయణం, మహాభారత గాథలను వేరే వారు వచ్చి తీసే దుస్థితి రాకూడదనుకుంటాను. మనమే ఎందుకు తీయకూడదన్నదే నా అభిమతం. ఇలాంటి సినిమాలకు బడ్జెట్‌ ఎక్కువ, టైమ్‌ ఎక్కువ సహజం. కానీ మన కథలు చూపించామనే తృప్తి కచ్చితంగా ఉంటుంది.

‘శాకుంతలం’ లీడ్‌ రోల్‌కి ముందు సమంతనే అనుకున్నారా? లేక ఎవరినైనా..?
సమంతని నీలిమ సజెస్ట్‌ చేసింది. ‘రంగస్థలం’లో  ఆమె ఒదిగిపోయిన తీరు చూసి, కరెక్ట్‌గా సరిపోతారని నేనూ అనుకున్నాను. కథ విని ఆమె ఎగ్జయిట్‌æఅయ్యారు. కానీ ఈ పాత్రకు మెంటల్‌గా, ఫిజికల్‌గా సిద్ధపడటానికి కొంచెం టైమ్‌ కావాలని  రెండు నెలలు ఈ పాత్రకు తగ్గ ఎఫర్ట్‌ పెట్టారామె.


మీ అమ్మాయి నీలిమ ‘శాకుంతలం’ని నిర్మించడం గురించి...
ఓ మూడు కథలు చెబితే, తను ‘శాకుంతలం’ని సెలక్ట్‌ చేసింది. అంటే.. ఈ తరంవారు కూడా మైథాలజీలను ఇష్టపడుతున్నారనే కదా. ఈ సినిమా ప్రకటించగానే.. ‘దిల్‌’ రాజుగారు ‘నాకు కథ నచ్చితే ఫైనాన్షియల్‌గా మీపై ఒత్తిడి లేకుండా చూసుకుంటాను’ అన్నారు. ఆయనకు, శిరీష్‌కు కథ చెప్పాను. వారికి నచ్చడంతో ‘డబ్బులు గురించి మరచిపోండి.. మీ అమ్మాయే నిర్మాతగా మీకు నచ్చినట్లు తీయండి’ అన్నారు. మొదటి షెడ్యూల్‌లోనే 60శాతం చిత్రీకరణ పూర్తి చేశాను. కరోనా సమయంలో నీలిమ యూనిట్‌ అంతా మెడికల్‌ కేర్‌ తీసుకుంటూ షూటింగ్‌ జరిగేలా చూసుకుంది. షూటింగ్‌ ఆపితే నష్టమే. సమంత కూడా షెడ్యూల్‌ని ఆపొద్దు.. మీరు అనుకున్న ప్రకారమే పూర్తి చేయండని సపోర్ట్‌ చేశారు.

ప్రతాపరుద్రడు మెయిన్‌ పాత్రలో ఓ సినిమా చేయాలనుకున్నారు.. 
100శాతం ఉంటుంది. ‘రుద్రమదేవి’ పోస్ట్‌ ప్రొడ„ý న్‌ సమయంలోనే ప్రతాపరుద్రుడు కథని పూర్తి చేశాను.
 

– డి.జి. భవాని

మరిన్ని వార్తలు