తమన్నా రాకతో గ్రాఫ్‌ మారిపోయింది

8 Dec, 2020 00:02 IST|Sakshi
తమన్నా, సత్యదేవ్

– సత్యదేవ్‌

సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడంలో విడుదలై విజయం సాధించిన ‘లవ్‌ మాక్‌టైల్‌’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. నాగశేఖర్, భావనా రవి, ఎం.ఎస్‌. రెడ్డి, చినబాబు నిర్మిస్తున్నారు. నాగశేఖర్‌ దర్శకుడు. తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా సత్యదేవ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నేను హీరో అయినా, తమన్నాగారు రియల్‌ హీరో.

ఆమె ఈ సినిమాలో చేస్తున్నారని ప్రకటించినప్పటి నుండి ‘గుర్తుందా శీతాకాలం’ గ్రాఫ్‌ మారిపోయింది. ఈ సినిమాలో చేస్తున్న మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ– ‘‘లాక్‌డౌన్‌ టైమ్‌లో చాలా సినిమాలు చూశాను, ఎన్నో కథలు విన్నాను. ఈ సినిమా ఆఫర్‌ రాగానే ఎందుకో ఈ సినిమాలో నటించాలనుకున్నాను. రొమాంటిక్‌ డ్రామాలో నటించి చాలాకాలం అయింది. టాలెంటెడ్‌ హీరో సత్యదేవ్‌ ఈ సినిమాకు పర్‌ఫెక్ట్‌ హీరో’’ అన్నారు. దర్శకుడు నాగశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘కన్నడంలో నేను స్టార్‌ డైరెక్టర్‌ అయినప్పటికీ తెలుగులో ఇది నాకు మొదటి సినిమానే.

నటీనటులు, టెక్నీషియన్లు నూటికి నూరు శాతం ప్రతిభ ఉన్నవారు. ఎంతో తపనతో సినిమా చేస్తున్నారు’’ అన్నారు. ‘‘బహుశా ఈ సినిమాకు పనిచేయటం మొదలుపెట్టిన తొలి వ్యక్తి నేనే అనుకుంటున్నాను. నేను మాటలు అందించిన ‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఓ బేబి’ సినిమాల తరహాలో పెద్ద విజయం సాధిస్తుంది’’  అన్నారు మాటల రచయిత లక్ష్మీభూపాల్‌. సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీభూపాల్‌ గారు ఈ సినిమా కోసం వేసవిలో పని చేయటం ప్రారంభిస్తే, నేను వర్షాకాలంలో ప్రారంభించాను. ఈ సినిమా మంచి మ్యూజికల్‌ ఫీల్‌ గుడ్‌ మూవీగా మిగిలిపోతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చినబాబు, సంపత్‌ కుమార్, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.

మరిన్ని వార్తలు