రెమి‌డెసివిర్‌ అడిగిన దర్శకుడు: ఊహించని స్పందన

20 Apr, 2021 17:31 IST|Sakshi

దర్శకుడు హన్సల్‌ మెహతా కుమారుడికి కరోనా

రెమి‌డెసివిర్‌‌ మందు దొరకక ఇబ్బందులు 

సోషల్‌ మీడియాలో అనూహ్య స్పందన

సాక్షి, ముంబై: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు మామూలుగా లేవు. ఒకవైపు రోజురోజుకు రికార్డు స్తాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి మరోవైపు కోవిడ్-19 రోగులకు ఆసుపత్రులలో మందుల కొరత, సరిపడినన్ని బెడ్లు లేక, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో లేక దేశవ్యాప్తంగా  అనేకమంది రోగులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అటు రాజకీయవేత్తల నుంచి ఇటు సామాన్యుల దాకా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిఇలా ఉంటే కరోనా చికిత్సలో కీలకమైన రెమి‌డెసివిర్‌‌ ఔషధం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌​ దర్శకుడు హన్సాల్ మెహతా కరోనా బారిన పడిన తన కుమారుడి చికిత్సకోసం రెమి‌డెసివిర్‌ మందు దొరకడం లేదని సాయం చేయాలంటూ  సోషల్‌ మీడియాలో వేడుకోవడం  పరిస్థితికి అద్దం పడుతోంది.  అయితే ఈ పోస్ట్‌కు ఆయన అభిమానులు, ఇతర నెటిజనుల నుంచి అపూర్వ స్పందన రావడం విశేషం. పలువురు నెటిజన్లు ఈ ఔషధం లభ్యత తదితర వివరాలతో మెహతాకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.  (ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు కరోనా: పరిస్థితి విషమం)

‘కోవిడ్‌తో బాధపడుతున్న నా కుమారుడు పల్లవ కోసం రెమి‌డెసివిర్‌ ఔషధం కావాలి. ఎక్కడ దొరుకుతుంది..సాయం చేయగలరు’ అంటూ  ట్వీట్‌ చేశారు. ముంబైలోని అంధేరి ఈస్ట్‌లోని క్రిటికేర్ హాస్పిటల్‌లో ఉన్నాడని పేర్కొన్నారు. దీంతో నెటిజనుల నుంచి అనూహ్య స్పందన లభించింది. కేవలం ఒక గంట వ్యవధిలో దర్శకుడికి కావలసిన మెడిసిన్‌ లభించింది. దీంతో తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పల్లవకు సాయం చేయడానికి ఇంతమంది నుంచి అద్భుత స్పందన రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మీ ప్రేమకు చాలా ధన్యవాదాలు. పల్లవకోసం ప్రే చేయండి అంటూ పాత ట్వీట్‌ను తొలగించారు..

కాగా, భారతదేశంలో కోవిడ్-19 పరిస్థితి పాకిస్తాన్‌ కంటే మెరుగ్గా ఉందా లేదా అధ్వాన్నంగా ఉందా అంటూ హన్సల్ మెహతా ట్విటర్‌లో వ్యంగ్యంగా అడగడం వివాదాన్ని రేపింది. పాకిస్తాన్‌లో బావుందని భావిస్తే శాశ్వతంగా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ కొంతమంది ఘాటుగా స్పందించారు. ఏకంగా ఒక నెటిజన్‌ దుబాయ్ ద్వారా పాకిస్తాన్‌కు వన్-వే టికెట్‌ను కూడా పంపారు.

మరిన్ని వార్తలు