Kamal Haasan: సినిమాలో సంపాదించింది సినిమాకే పెట్టాడు.. దటీజ్‌ కమల్‌

6 Nov, 2022 04:08 IST|Sakshi

నవంబర్‌ 7న  కమల్‌హాసన్‌ జన్మదినం

టీనేజ్‌లో ఇంట్లో నుంచి గెంటేస్తే పట్టుదలగా బార్బర్‌ షాపులో పని చేశాడు కమల్‌హాసన్‌. గ్రూప్‌ డాన్సర్‌గా అవస్థలు పడ్డాడు. నటన నేర్చుకోవడానికి కె. బాలచందర్‌ చేతిలో చెంపదెబ్బలు తిన్నాడు. కాని సహించి భరించి ప్రయాణం కట్టేవాడే విజేత అవుతాడు. కమల్‌హాసన్‌ జీవితం, అతని లక్ష్యసిద్ధి ఏ తరానికైనా ఆదర్శమే. ఫ్యామిలీ అంతా విపరీతంగా మెచ్చే  ఈ విశ్వ కథానాయకుడు ఇప్పటికీ హీరో. ఎప్పటికీ హీరో.

‘మీ పక్కన కాస్తంత చోటివ్వండి’ అంటాడు కమల్‌హాసన్‌ ‘సాగర సంగమం’లో జయప్రదతో ఫొటోకోసం నిలబడుతూ. ఆ ఫొటోలో అతను పడడు. కాని భారతీయ సినిమా రంగంలో అతని చోటును నేటికీ కదిల్చేవాళ్లు లేరు. అతని పక్కన చోటు కోసం పాకులాడని వారు లేరు. ‘స్టార్‌’ లేదా ‘యాక్టర్‌’ రెండు ముద్రలుంటాయి ఇండస్ట్రీలో. కాని యాక్టర్‌గా ఉంటూ స్టార్‌ అయినవాడు కమల్‌హాసన్‌. తెర అంటే ఏమిటి? నటనకు వీలు కల్పించేది. నటించాల్సినది.

నటన లేకుండా తెర మీద వెలగడం అంటే పులి గాండ్రించకుండా ఉండటమే. కమల్‌ గాండ్రించే పులి. పాత్రలను వేటాడే పులి కూడా. ఇండస్ట్రీలో బాల నటులుగా ప్రవేశించినవారికి శాపం ఉంటుంది. యవ్వనంలో రాణించలేని శాపం. దానికి కారణం బాల నటులుగా ప్రవేశించాక చదువు సరిగ్గా నడవదు. అప్పటికే కెమెరా కాటేసి ఉంటుంది. ఏవేవో మెరుపు కలలు. కాని బాల్యంలో ఉన్న ముఖం వయసు పెరిగాక అంత ముద్దు రాకపోవచ్చు.

బాల్యంలో ఉన్న ఈజ్‌ యవ్వనంలో మొద్దుబారవచ్చు. చాలా తక్కువ మందే చిన్నప్పుడు నటించి ఆ తర్వాత పెద్దయ్యాక కూడా స్టార్లు అయ్యారు. నటీమణుల్లో శ్రీదేవి. నటుల్లో కమల్‌హాసన్‌. నటన అతనిలో జన్మతః ఉంది. నటులు ఏం చేయాలో అతనికి తెలుసు. ‘సొమ్మొకడిది సోకొకడిది’ సినిమాలో ‘ఆ పొన్న నీడలో ఈ కన్నెవాడలో ఉన్నా’ అనే పాట ఉంటుంది. ఆ పాటను తీసింది కొబ్బరి చెట్ల మధ్య. అందుకే కమల్‌ మొదటి లైన్‌ పాడుతూ కొబ్బరి చెట్ల వైపు చూస్తూ ఇవి పొన్న చెట్లు కావే అన్నట్టుగా చూసి పాట కొనసాగిస్తాడు. న్యుయాన్సెస్‌ అంటారు దీనిని. కళ అంటేనే అది.

‘సాగర సంగమం’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాక కె. విశ్వనాథ్‌ ‘స్వాతిముత్యం’ తీశారు. ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ’ పాట చిత్రీకరణ. అంత మంచి దర్శకుడు విశ్వనాథ్‌ కూడా ‘ఈ పాటకు మంచి స్టెప్స్‌ కంపోజ్‌ చేద్దాం’ అన్నారట పాత్ర ఔచిత్యం మరిచి. అప్పుడు కమల్‌ ‘సార్‌... ఈ పాటకు నేను డాన్స్‌ చేయను. ఎందుకంటే వీడు బాలు కాదు. శివయ్య. వీడికి డాన్సు రాదు’ అన్నారట. అదీ కమల్‌. ఆ తర్వాత ఆ పాటలో శివయ్య అను కమల్‌ వేసిన వచ్చీ రాని స్టెప్స్‌ను లోకం మురిసిపోయి చూసింది. కమల్‌ చార్లీ చాప్లిన్‌ను చూసి నటన మెరుగుపర్చుకున్నాడు. ‘డాన్స్‌మాస్టర్‌’లో స్వయంగా చాప్లిన్‌ పాత్ర చేశాడు. ఆ తర్వాత రాబిన్‌ విలియమ్స్‌ నటనతో కూడా ప్రభావితం అయ్యాడు.

మంచి నటుడు బ్లాటింగ్‌ పేపర్‌ లాంటి వాడు. ఒక్క బొట్టు మంచి దొరికినా పీల్చేసుకుంటాడు. ‘గాడ్‌ఫాదర్‌’ను మోడల్‌గా పెట్టుకుని మణిరత్నం ‘నాయకుడు’ తీశాడు. గాడ్‌ఫాదర్‌లో మార్లెన్‌ బ్రాండో చేసింది గొప్పదే. ‘నాయకుడు’లో కమల్‌ చేసింది కూడా గొప్పే.  కొడుకు చనిపోయినప్పుడు తండ్రి దుఃఖాన్ని ఒక్కో నటుడు ఒక్కోలా చేస్తాడు. కమల్‌ చేసింది ఒక సిలబస్‌.

కమల్‌ చేసిన అతి ముఖ్యమైన పని ఆహార్యం గురించి శ్రద్ధ పెట్టడం. ఆహార్యం, దేహభాష ఒక పాత్రలో నటుణ్ణి నశింపచేసి పాత్రను సజీవం చేస్తుంది. ప్రతి సినిమాలో ఒకేలా ఉంటూ ఒకే నటన చేస్తూ నటుల్లా వెలిగే వారు ఉన్నారు నేటికీ. కాని కమల్‌ పాత్రను బట్టి మారుతాడు. అతని శరీర కదలికా మారుతుంది. ఆధునిక మేకప్‌లు రాని రోజుల్లోనే ‘సత్యమే శివం’ వంటి సినిమాల్లో ఆయన ఆహార్యం అద్భుతం.

కమల్‌ తమిళంతో సమానంగా తెలుగులో కూడా సూపర్‌స్టార్‌. తెలుగులోనే నేరుగా సినిమాలు చేశాడు. ‘మరో చరిత్ర’, ‘ఇది కథ కాదు’, ‘ఆకలి రాజ్యం’ కొన్ని. ఒక గొప్ప నటుడు ఎవడయ్యా అంటే కామెడీ చేయగలిగినవాడు. సీరియస్‌ నటుడైన దిలీప్‌ కుమార్‌ కామిక్‌ టైమింగ్‌ అద్భుతం. అమితాబ్‌ కామెడీకి తిరుగు లేదు. కమల్‌ కామెడీ చేసి ‘పుష్పక విమానం’, ‘మైఖేల్‌ మదన కామరాజు’, ‘ముంబై ఎక్స్‌ప్రెస్‌’, ‘తెనాలి’... లిస్టు పెద్దది.

ఒక గొప్ప హీరో తన దర్జాకు తగిన కోస్టార్‌ను పెట్టుకుంటాడు. కాని కమెడియన్‌ అయిన కోవై సరళతో ‘సతీ లీలావతి’ చేసి హిట్‌ కొట్టాడు కమల్‌. సినిమాలో సంపాదించింది సినిమాకే పెట్టాడు కమల్‌. నిర్మాతగా దర్శకుడుగా హిట్స్‌ ఫ్లాప్స్‌ ఇచ్చాడు. లాభపడ్డాడు. నష్టపోయాడు. కాని హీరోగానే ఉన్నాడు. హీరోగానే ఉండటానికి ఎంత ప్రొఫెషనల్‌గా, క్రియేటివ్‌గా ఉండాలో పరిశ్రమకు చూపించాడు. 67 ఏళ్ల వయసులో ‘విక్రమ్‌’ వంటి హిట్‌ ఇచ్చాడు. స్టార్లు పుడతారు. గిడతారు. కాని నటులు శాశ్వతం. కమల్‌ శాశ్వత నటుడు. హ్యాపీ బర్త్‌డే.(నవంబర్‌ 7న కమల్‌హాసన్‌ బర్త్‌డే)

మరిన్ని వార్తలు