Happy Birthday Vadivelu: కూలీ పనుల నుంచి కమెడియన్‌దాకా.. విజయ్‌కాంత్‌తో వైరం, శంకర్‌తో గొడవ! ఆ ఒక్క మీమ్‌తో దేశం దాటిన క్రేజ్‌

12 Sep, 2021 12:29 IST|Sakshi

Happy Birthday Day Vadivelu: ఆయనో కమెడియన్‌. అలాగని ఆషామాషీ నవ్వులు పంచడండోయ్‌. మూస ధోరణిలో సాగిపోతున్న సినీ కామెడీకి సరికొత్త పాఠాలు నేర్పాడాయన. ‘అసలు ఇలా కూడా కామెడీ చేయొచ్చా?’ అనే రీతిలో ఉంటుంది ఆయన స్టయిల్‌. అందుకే స్టార్‌ హీరోలకు సమానమైన ఫ్యాన్‌డమ్‌ను సంపాదించుకున్నారాయన. ఒకానోక టైంలో  ఏడాదికి పాతికదాకా సినిమాల్లో నటించిన వడివేలు.. అప్పటికప్పుడు సొంతంగా అల్లుకున్న ట్రాకులతోనే కడుపుబ్బా నవ్వించే వారంటే అతిశయోక్తి కాదు. వడివేలు తెర మీద కనిపిస్తే నవ్వుల ప్రవాహం గలగలా పారాల్సిందే.. అందుకే కోలీవుడ్‌ ఆడియొన్స్‌ ఆయన్ని ముద్దుగా వాగై పూయల్‌(వాగై ప్రవాహం) అని పిలుస్తుంటారు.

వడివేలు  61వ పుట్టినరోజు ఇవాళ..
వాగై నది మధురై గుండా ప్రవహిస్తుంటుంది. ఆ నది ఒడ్డునే ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబంలో సెప్టెంబర్‌ 12, 1960న పుట్టారు వడివేలు(కుమారవడివేలు నటరాజన్‌). అసలు చదువే అబ్బని వడివేలు.. చిన్నప్పటి నుంచి తండ్రి గ్లాస్‌ కట్టింగ్‌ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఖాళీ సమయాల్లో వీధి నాటకాలు.. అందులోనూ నవ్వులు పంచే పాత్రలతో అలరించడం చేసేవాడు. అలా దర్శకుడు టీ రాజేందర్‌ కంటపడడంతో .. ‘ఎన్‌ తంగి కళ్యాణి’లో ఓ చిన్న వేషం వేషాడు. 
రాజ్‌కిరణ్‌తో పరిచయం
వడివేలు సినీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా మొదలైంది. అవకాశాల కోసం ఆయన కనీసం ఏమాత్రం ప్రయాణం చేయలేదు. కానీ,  నటుడు రాజ్‌కిరణ్‌.. వడివేలు సినిమాల్లోకి అడుగుపెట్టడానికి కారణం అయ్యాడు.  వడివేలు తన పెళ్లి కోసం రైళ్లో వెళ్తున్న టైంలో.. నటుడు రాజ్‌కిరణ్‌తో పరిచయం అయ్యింది. ఆ సంభాషణ మధ్యలోనే వడివేలులోని నటుడిని గుర్తించి యాక్టింగ్‌ ఆఫర్‌ ఇచ్చాడు రాజ్‌ కిరణ్‌. అలా రాజ్‌ కిరణ్‌ హీరోగా నటించిన ‘ఎన్‌ రసవన్‌ మనసిలే’(1991)తో నటుడిగా మారిపోయాడు వడివేలు. ఆ తర్వాత నటుడు విజయ్‌కాంత్‌ ‘చిన్న గౌండర్‌’లో వడివేలుకు అవకాశం ఇచ్చి.. తన తర్వాతి సినిమాల్లోనూ మంచి మంచి పాత్రలు ఇచ్చి వడివేలును ప్రొత్సహించాడు.

త్రయం నవ్వులు
గౌండమణి-సెంథిల్‌-చార్లీలాంటి టాప్‌ కమెడియన్ల హవా కోలీవుడ్‌లో కొనసాగుతున్న టైంలో.. వడివేలు ఎంట్రీ ఇచ్చాడు. కమల్‌ హాసన్‌ హీరోగా వచ్చిన సింగరవేలన్‌(మన్మథుడే నా మొగుడు)లో విచిత్రమైన గెటప్‌, బట్లర్‌ ఇంగ్లీష్‌ క్యారెక్టరైజేషన్‌ వడివేలుకు విపరీతమైన క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఆపై వరుసగా కామెడీ రోల్స్‌తో కోలీవుడ్‌లో కింగ్‌ ఆఫ్‌ కామెడీ ముద్రను దక్కించుకున్నాడు. గౌండమణి-సెంథిల్‌ కాంబోతో పాటు వడివేలు పంచిన కామెడీ కోలీవుడ్‌ ఆడియొన్స్‌కు నోస్టాల్జియా అనుభూతుల్ని మిగిల్చింది.
 

తెలుగు వాళ్లకు..
తొంబై, 2000 దశకాల్లో కోలీవుడ్‌లో వడివేలు హవా నడిచింది. రజినీకాంత్‌, విజయ్‌కాంత్‌, కమల్‌ హాసన్‌, విక్రమ్‌, సూర్య, అజిత్‌, ఇలా.. దాదాపు అందరు అగ్రహీరోలతోనూ ఆయన ప్రస్థానం నడిచింది.  అలాగే ఇతర కామెడీ యాక్టర్లతోనూ ఆయన స్నేహం కొనసాగించేవాళ్లు. క్షత్రియ పుత్రుడు(తేవర్‌మగన్‌) లాంటి సీరియస్‌ సినిమాలతో పాటు ‘నవ్వండి లవ్వండి,  ప్రేమికుడు, మిస్టర్‌ రోమియో,  ప్రేమ దేశం, రక్షకుడు,  ఒకే ఒక్కడు,  చంద్రముఖి, సింగమలై,  ఆరు, ఘటికుడు, పొగరు, దేవా, అదిరింది’ లాంటి డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ఆడియొన్స్‌ను సైతం కితకితలు పెట్టించాడాయన.  తెలుగులో స్ట్రయిట్‌ సినిమా ‘ఆరో ప్రాణం’తో పలకరించాడు.
 
వివాదాలు.. 
రాజకీయాల ఎంట్రీతో వడివేలు కెరీర్‌ మసకబారడం మొదలైంది. తన కుటుంబంపై జరిగిన దాడికి బాధ్యుడ్ని చేస్తూ.. కెరీర్‌ తొలినాళ్లలో తనకు అవకాశాలిచ్చిన విజయ్‌కాంత్‌ మీదే అటెంప్ట్‌ టు మర్డర్‌ కేసుపెట్టి వివాదాలకు తెరలేపాడు వడివేలు. ఆపై విజయ్‌కాంత్‌పై ఎన్నికల్లోనూ పోటీ ప్రకటన చేశాడు. విజయ్‌కాంత్‌తో వైరం కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గించడమే కాదు.. రాజకీయంగానూ ఎలాంటి ఎదుగుదలను లేకుండా చేసింది.

ఇక ఇమ్‌సయి అరసన్‌ 23ఎం పులకేసి(హింసించే 23వ రాజు పులకేశి) సినిమాతో హీరోగానూ వడివేలు సక్సెస్‌ అందుకున్నాడు.  2018లో ఈ సినిమా సీక్వెల్‌ విషయంలో దర్శకుడు శంకర్‌(మొదటి పార్ట్‌కు నిర్మాత), దర్శకుడు చింబు దేవన్‌తో చెలరేగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. వడివేలు వల్ల కోట్ల నష్టం వాటిల్లిందని శంకర్‌, ఆపై మరికొందరు సినీ నిర్మాతల ఫిర్యాదులపై  నడిగర్‌ సంఘం వడివేలుపై కన్నెర్ర జేసి నిషేధం విధించింది. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి ఈ ఏడాదిలో(2021) ఆయన కొత్త సినిమాలను అంగీకరించినట్లు, ఇది తన సినీ పునర్జన్మగా అభివర్ణించుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. లైకా ప్రొడక్షన్స్‌లోనే ఆయన ఐదు సినిమాలు సైన్‌ చేయడం.


ప్రే ఫర్‌ నేసమణి
ఆరులో ‘రక్తం’, పొగరులో ‘కూల్‌డ్రింక్‌-ఒంటేలు’, సింగమలైలో ‘కానిస్టేబుల్‌’ కామెడీ పోర్షన్‌లు తెలుగు ఆడియొన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. సినిమాలతోనే కాదు.. మన బ్రహ్మీలాగా మీమ్స్‌తోనూ వడివేలు విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఇక 2001లో వచ్చిన ఫ్రెండ్స్‌(తెలుగులో స్నేహమంటే ఇదేరాగా రీమేక్‌) మూవీ. త్‌్్ విజయ్, సూర్య హీరోలు.  ఇందులో వడివేలు నేసమణి అనే క్యారెక్టర్‌ పోషించాడు.

ఓ సీన్‌లో ఆయన నెత్తి మీద సుత్తి పడుతుంది. రెండేళ్ల క్రితం ఈ సీన్‌ పాక్‌లోని ఓ ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా ట్రెండ్‌ కాగా.. నేసమణి పరిస్థితి ఎలా ఉందంటూ ఎంతో మంది ఆరాతీశారు. ఆయన కోలుకోవాలంటూ ‘ప్రే ఫర్‌ నేసమణి’ ట్రెండ్‌ను కొనసాగించారు. అలా చాలా ఏళ్ల తర్వాత ఆ సీన్‌ వైరల్‌ అయ్యి.. వడివేలుకు ఇంటర్నేషనల్‌ గుర్తింపు తెచ్చిపెట్టింది.

- సాక్షి, వెబ్‌స్పెషల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు