హ్యాపీ బర్త్‌డే ‘వెన్నెల’ కిషోర్‌!

19 Sep, 2020 18:43 IST|Sakshi

అవకాశం రావాలే గానీ ‘హీరోయిజం’ ప్రదర్శిచేందుకు నటులు ఎల్లప్పుడూ ముందే ఉంటారు. కానీ కామెడీ చేయమంటే మాత్రం కాస్త వెనకడుగు వేస్తారు. ఎందుకంటే నవ్వడం ఓ భోగమైతే.. ఇతరులను కడపుబ్బా నవ్వించడం ఓ యోగం. అవును మరి.. నవరసాల్లో చిన్నాపెద్దా అందరికీ ఇష్టమైన హాస్యరసం పండించడం అంటే మాటలు కాదు. అలాంటి వరం కొందరికే లభిస్తుంది. తెలుగు చిత్రసీమలో రేలంగి, రాజబాబు, అల్లు రామలింగయ్య వంటి పాతతరం నటులు నవ్వుల రారాజులుగా ఓ వెలుగు వెలిగారు. ఇక వాళ్ల వారసులుగా బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ  వేణు మాధవ్‌, సునీల్‌ వంటి కమెడియన్లు తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. తొలిసినిమా పేరునే ఇంటిపేరులా మార్చేసుకున్న బొక్కల కిషోర్‌ కుమార్‌ అలియాస్‌ వెన్నెల కిషోర్‌ కూడా ఈ కోవకే చెందుతాడు. తనదైన డైలాగ్‌ డెలివరీ, హావభావాలు పాటు పర్ఫెక్ట్‌ కామెడీతో నవ్వులు పూయించే ఈ కామెడీ కింగ్‌ నేడు 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా కిషోర్‌ టాప్‌ 5 పెర్ఫామెన్స్‌పై ఓ లుక్కేద్దాం.

పొట్టచెక్కలయ్యేలా..
కామారెడ్డికి చెందిన బొక్కల కిషోర్‌ కుమార్‌ హైదరాబాద్‌లో చదువుకున్నాడు. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన అతడు దేవ కట్టా ‘వెన్నెల’సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఖాదర్‌ భాషాగా కిషోర్‌ పండించిన కామెడీని ఎవరూ అంతతేలికగ్గా మరచిపోలేరు. ఇలా మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు ‘వెన్నెల’ కిషోర్‌.

ఇంకోసారితో తొలి అవార్డు
ఈ సినిమాలో‘బాలా బొక్కల’ పాత్రలో జీవించి నంది అవార్డు సొంతం చేసుకున్నాడు.  రాజా, రిచా, మంజరి, రవి, సాందీప్‌ల స్నేహ బృందంలో ఒకడిగా ఉంటూ కామెడీతో పాటు అవసరమైన చోట ఎమోషన్స్‌ను కూడా చక్కగా పండించి తనలోని విభిన్న కోణాన్ని బయటపెట్టాడు. (చదవండి: విదేశీయులను పెళ్లాడిన నటీమణులు)

దూకుడు
వెన్నెల కిషోర్‌కు కమర్షియల్‌గా బిగ్‌ బ్రేక్‌ ఇచ్చిన సినిమా దూకుడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాలో బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ వంటి హాస్య నట దిగ్గజాలు ఉన్నప్పటికీ, శాస్త్రిగా తన ఉనికిని చాటుకుంటూ ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశాడు. బామ్మ విషయంలో మహేష్‌- వెన్నెల కిషోర్‌ మధ్య వచ్చే సీన్స్‌ను ఆడియన్స్‌ అంత తేలికగ్గా మరిచిపోలేరు.

భలే భలే మగాడివోయ్‌
వెన్నెల కిషోర్‌కు మరో నంది అవార్డును తెచ్చిపెట్టిన సినిమా ఇది. లక్కీ ఫ్రెండ్‌గా ప్రతిసారీ ఎవరో ఒకరి చేతిలో బుక్కయ్యే పాత్రలో, పర్ఫెక్ట్‌ టైంతో కామెడీని పండించాడు. 

బాద్‌ షా
ఈ సినిమాలో దాసుగా నటించాడు వెన్నెల కిషోర్‌. హీరోయిన్‌ జానకి(కాజల్‌) మంచితనాన్ని ఆసరాగా తీసుకుని, ఆమె ముందు వినయంగా ఉంటూనే, తన ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకునే ‘కన్నింగ్‌’ క్యారెక్టర్‌లో జీవించేశాడు. ఆ తర్వాత హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంట్రీతో కుడితిలో పడ్డ ఎలుకలా, కక్కలేక మింగలేక అతడి జట్టులో చేరే దాసు పంచిన వినోదం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

ఇక వీటితో పాటు బిందాస్‌, పిల్ల జమిందార్‌, లవ్‌లీ, జులాయి, దూసుకెళ్తా, ఎవడు, రన్‌ రాజా రన్‌, ఆగడు, సన్నాఫ్‌ సత్యమూర్తి, శ్రీమంతుడు, చి.ల.సౌ., గీత గోవిందం, అర్జున్‌ సురవరం, భీష్మ వంటి సినిమాల్లో తనదైన శైలిలో ఆకట్టుకున్న వెన్నెల కిషోర్‌.. ఇలాగే కలకాలం మనల్ని నవ్విస్తూ ఉండాలని కోరుకుంటూ ఆయనకు హ్యాపీ బర్త్‌డే చెప్పేద్దాం!!
    

మరిన్ని వార్తలు