తనికెళ్ళ భరణి.. వెరీమచ్​ ఫ్రెండ్లీ మరి!

14 Jul, 2021 10:13 IST|Sakshi

వెబ్‌డెస్క్‌: సంప్రదాయాన్ని ఎవరైనా నిలబెడుతున్నారంటే చాలూ ‘నమస్తే అన్నా..’ వాళ్ల కోసం ఎంత దూరమైన వెళ్తాడు ఆయన. బహుశా సినీ రంగంలో ఇంత సాహితీ యావ ఉన్న నటుడు మరోకరు లేరేమో!. ఈ తోట రాముడు... పరమశివుడినే ‘ఏరా’ అంటూ జిగిరీ దోస్తుగా సంభోధిస్తుంటాడు. అదేమంటే... గది గంతే అంటాడు. ఆ ముక్కంటి ప్రియ భక్తుడైనందుకేమో.. ఈ భరణి కూడా వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!.
 
కళాధరణి ఈ సాహితీ భరణి
1954, జులై 14న సికింద్రాబాద్​లో పుట్టాడు తనికెళ్ళ భరణి. నటుడికన్నా ముందు ఆయన ఒక మంచి రచయిత.. సాహితీవేత్త. నటుడిగా బిజీ అయ్యాక మాట మాట్లాడితే ‘కలం మడిచి జేబులో పెట్టేశాన’ని అంటుంటాడు. కానీ ఆ కలానికి సాగటమే తప్ప ఆగటం తెలీదు. పద్యాలు అలవోకగా చెప్పే ఆయన కవితా ధార... మాటలతో ఆయన ఆడుకునే తీరు.. చూస్తే ఎవరైనా ఆయన వీరాభిమానిగా అయిపోవటం ఖాయం.  

‘‘కదలిపోతోంది... భావన వదిలి పోతోంది.
వెళ్లలేక వెళ్లలేక ఒదిగిపోతోంది.
ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను.
కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను.
కవితలను రాసి రాసి అలసిపోయాను.
అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది.
తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి.
బాధలో నా భావనలను చెదరగొట్టాను.
వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయాయి.
భావనలు వెళ్లిపోయాయి
నన్ను వదిలి వెళ్లిపోయాయి’’..
. అని ఆయన చెప్తుంటే ‘వాహ్ వా... వాహ్ వా...’ అనకుండా ఉండలేం మరి!

గురువు రాళ్లపల్లి లేకుంటేనా..
డెబ్భై దశకం మధ్యలో తనికెళ్ల భరణి సరదాగా నాటకాలు వేస్తుండేవాడు. ఆ టైంలోనే నటుడు రాళ్లపల్లి పరిచయం అయ్యారు. భరణిలోని రచనా పటిమను గుర్తించి ప్రోత్సహించాడు రాళ్లపల్లి.  అలా నాటకాలకు డైలాగులు రాయడం మొదలుపెట్టాడు. అటుపై థియేటర్​ ఆర్ట్స్​లో డిప్లోమా చేశాడు. గురువు రాళ్లపల్లి ప్రోత్సాహంతో చెన్నైకి చేరి సినిమా డైలాగుల రచయితగా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఆనాడు రాళ్లపల్లి లేకుంటే.. ఈనాడు తనికెళ్ళ భరణి ఇలా మన ముందు ఉండేవాడు కాదేమో. ఇలాంటి వ్యక్తిని తెలుగు ప్రజానీకానికి అందించిన రాళ్లపల్లికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలి. లేకుంటే చెడు సావాసాలతో ఈ సాహితి పిపాసి జైలుకు పోయేవాడేమో! 

శివుడంటే ప్రాణం
తెలంగాణా యాసలో ఇంత చక్కటి శివస్తుతిని పలికించగలగడం భరణి ఇస్టయిల్​. నిషాని వాడిలా శివుడిని పూజిస్తూ ఆయన చెప్పిన పద్యాలు శభాష్ శంకరా. శివుడి లయలో ఈ ప్రపంచపు అన్ని కోణలని తాకతూ అభినవ భక్త కన్నప్పలా ఆయన వర్ణించిన తీరు సామాన్యుడికి సైతం అర్థమయ్యే భాషలో రచించిన తనికెళ్లకు సలాం కొట్టక ఉండలేం. సర్వం శివమయం జగత్  అనే శివ ఫిలాసఫీని సింపుల్ గా చెప్పగలిగిన సాహితివేత్త తనికెళ్ల భరణి. ‘చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్... చిటికెడు బూడిద పోస్తే బస్... వట్టి పుణ్యానికి మోక్షమిస్తవు గదా శబ్బాష్‌రా శంకరా...’ అన్నాడు. అది వింటే శివుడు కూడా భరణి భుజంపై చేయి వేసి హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడేమో!   

నైజాం అభిమానం
యాదగిరి, భువనగిరి అంటూ పేర్లు పెడుతూ కమెడియన్లకు, విలన్లకు తెలంగాణ యాసను అంటగట్టి గేలి చేస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం కావడం మనం చూశాం.. చూస్తున్నాం.  కానీ, నైజాం భాషను, తెలంగాణ యాసను ఎలా పలకాలో తెలియకనే సినిమాల్లో వ్యంగ్యంగా వాడుతున్నారనేది భరణి అభిప్రాయం. ‘‘సినీ పరిశ్రమలోని ఏ వ్యక్తికీ తెలంగాణ భాషపై కోపంగానీ, దాన్ని అవమానించాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదు. ఉచ్ఛరించే విధానం తెలీకనే కామెడీ కోసం ఆ భాషను వాడేసుకుంటున్నారని’’ ఆయన చెప్తుంటారు. అంతేకాదు ఓ హీరోయిన్ ను పూర్తి స్థాయి తెలంగాణలో మాట్లాడించాలన్న ఉద్దేశంతోనే విజయశాంతితో మొండిమొగుడు-పెంకి పెళ్లాం చిత్రాన్ని తీసినట్లు ఆయన చెప్తుంటారు.

గతి మార్చింది ‘శివ’నేనా?
దొరబాబు, పాతసామాన్లోడు, నానాజీ, తోటరాముడు, మాణిక్యంగాడు, చేపలక్రిష్ణగాడు.. ఇట్లా 800 సినిమాలకు నటనతో అలరించాడు తనికెళ్ల భరణి. ప్రారంభంలో కామెడీ వేషాలు వేసిన ఆయన.. ‘శివ’తో నానాజీ పాత్రతో విలన్​గా ఓ మెట్టు పైకి ఎక్కాడు. ఇది కూడా శివుడి ఆజ్ఞ ఏమో!.. అప్పటి నుంచి విలన్​ క్యారెక్టర్​లలో భరణి నటన కొనసాగింది. అటుపై కమెడియన్​గా, సపోర్టింగ్​ రోల్స్​, కమెడియన్​ విలన్​గా.. 2000 సంవత్సరం తర్వాత తండ్రి, బాబాయ్​ లాంటి హుందా క్యారెక్టర్లతో అలరిస్తోంది భరణి నటన. అన్నట్లు దర్శకత్వ కోణంతో ఆయన అందించిన ‘మిథునం’.. తెలుగు ప్రేక్షకులకు మాంచి అనుభూతిని కూడా పంచింది.
 

మరిన్ని వార్తలు