Harbhajan Singh-Geeta Basra: 'బ్రేకప్‌ చెప్పేసుకున్నారు.. కానీ పెళ్లి చేసుకున్నారు'

27 Feb, 2022 08:19 IST|Sakshi

‘ఐ లవ్‌ యూ.. నీతోనే ఉండిపోవాలనుంది’ అని చెప్పాడు అతను ఓ కాఫీ హోటల్‌లో.
‘ప్రేమ – గీమ, కలిసుండడాలు – గిలిసుండడాలు వంటివేం వద్దుకానీ.. ముందు ఫ్రెండ్స్‌గా స్టార్ట్‌ చేద్దాం జర్నీ.. తర్వాత చూద్దాం.. 
అది ఎటు తీసుకెళితే అటు వెళదాం’ అని బదులిచ్చింది ఆమె.
ఆ ప్రతిస్పందన అతనిలో ఎక్కడలేని నిరాశను పెంచింది. అయినా ఆమె అభిప్రాయాన్ని గౌరవించాడు. ఆమె నిర్ణయాన్ని పాటించాడు. 
అతను.. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌. 
ఆమె.. బాలీవుడ్‌ యాక్ట్రెస్‌ గీతా బస్రా. 

గీతా పట్ల హర్భజన్‌ ప్రేమ ఇంచుమించు లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ లాంటిదే. ‘ది ట్రైన్‌’ ఆమె మొదటి సినిమా. ఆ చిత్రం పోస్టర్‌లో ఉన్న ఆమె బొమ్మను చూసి మనసు పారేసుకున్నాడు హర్భజన్‌. ఆ క్షణం నుంచే ఆమె గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. ఈలోపు ఆ సినిమాలోని ‘వోహ్‌ అజ్‌నబీ’ అనే వీడియో సాంగ్‌ విడుదలైంది. అది చూశాక.. ఎలాగైనా ఆమెను కలవాలి అన్న ఆరాటం ఎక్కువైంది అతనికి. గీతా వివరాల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. సినిమా అభిమానే తప్ప.. బాలీవుడ్‌తో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు అతనికి. అందుకే ఆమె ఆచూకీ దొరకడం చాలా కష్టమైంది.

చివరకు అతని స్నేహితులు ఆమె ఫోన్‌నంబర్‌ సంపాదించి హర్భజన్‌కు ఇచ్చారు. అలా నంబర్‌ అందుకున్నాడో లేదో ఇలా ఆమెకు సందేశం పంపించాడు. గీతా చూడలేదు. చాన్నాళ్లు వేచున్నాడు అవతలి నుంచి సమాధానం వస్తుందేమోనని. టీ20 వరల్డ్‌ కప్‌ (2007)ను గెలిచేంత వరకు గీతా నుంచి మెసేజ్‌ రాలేదు. వచ్చిన మెసేజ్‌ కూడా హర్భజన్‌ అంతకుముందు పంపిన సందేశానికి రిప్లయ్‌ కాదు. టీ20 వరల్డ్‌ కప్‌ విజయానికి ఆమె అభినందన మెసేజ్‌. దానికే ఉబ్బితబ్బిబ్బై పోయాడు అతను. వెంటనే ఓ సందేశం పంపాడు.. ‘కలుద్దామా?’ అంటూ.  ఐపీఎల్‌ మ్యాచ్‌లకు టికెట్లూ పంపాడు. గ్యాలరీలో ఆమెను చూసుకుని గ్రౌండ్‌లో రెచ్చిపోయాడు. అతనికేమూలో ఆశ.. తన మనసుని అర్థం చేసుకొని తన చేయి పట్టుకుంటుందని. గీతా పట్టించుకోలేదు. అతని మనసు అర్థంకానట్టే ప్రవర్తించింది. 

కాఫీ డేట్‌కు ఒప్పేసుకుంది
గీతా బస్రా.. లండన్‌లో పుట్టి, పెరిగింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ముంబై చేరింది. ఆమె దృష్టి అంతా కెరీర్‌ మీదే. అందుకే హర్భజన్‌ను పట్టించుకోలేదు. అలా వన్‌ సైడెడ్‌ లవ్‌తో దాదాపు పది నెలలు ఆమె వెంట పడ్డాడు హర్భజన్‌. మొత్తానికి అతని ఆరాటాన్ని అర్థం చేసుకున్న గీతా.. ఓ రోజు కాఫీ డేట్‌కి రావడానికి ఒప్పుకుంది. కలుసుకున్న వెంటనే ఆమె అంటే తనకున్న ఇష్టాన్ని ప్రకటించేశాడు. అప్పుడే ఆమె చెప్పింది ముందు ఫ్రెండ్‌ షిప్‌ చేద్దాం అని.  

‘హర్భజన్‌ ప్రపోజ్‌ చేసిన వెంటనే నేను ‘‘ఎస్‌’’ చెప్పకపోవడానికి అతనంటే ఇష్టం లేక కాదు.. కెరీర్‌ను సీరియస్‌గా తీసుకోవడం వల్ల. నేను యాక్ట్‌ చేసిన ది ట్రైన్‌ రిలీజ్‌ అయ్యేనాటికి నాకు బాలీవుడే కాదు.. ఇండియా కూడా కొత్తే. ఆ టైమ్‌లో ప్రేమ, డేటింగ్‌లో పడిపోతే కెరీర్‌ మీద ఫోకస్‌ చేయలేం. అందుకే ముందు ఫ్రెండ్స్‌గానే ఉందాం అన్నా. కానీ ఉండలేకపోయా. అతని ప్రేమలో పడిపోయా. కుటుంబం అంటే ప్రాణం పెడతాడు. సింపుల్‌గా ఉంటాడు.. నెమ్మదస్తుడు.. ఇన్ని క్వాలిటీస్‌ ఉన్న మనిషిని ప్రేమించకుండా ఎలా ఉంటాం!’ అని చెప్పింది గీతా బస్రా ఓ ఇంటర్వ్యూలో.  

అయిదేళ్లు సాగిన ఆ స్నేహయానంలో పొరపొచ్చాలు చాలానే వచ్చాయి ఇద్దరి మధ్య. గొడవలు పడ్డారు. ‘ఇంక చాలు.. మనం ఫ్రెండ్స్‌గా కూడా ఉండలేం’ అని చెప్పుకున్నారు. బ్రేకప్‌ చేసుకున్నారు. కానీ హర్భజన్‌తో స్నేహంగా లేని కాలం ఆగిపోయినట్టుగా తోచింది గీతాకు. ఉండలేకపోయింది. అప్పుడు గ్రహించింది అది ఫ్రెండ్‌షిప్‌ కాదు.. ప్రేమ అని. అతని తోడు లేనిదే ఉండలేనని.. అతని తోడిదే జీవితమని. ఆ విషయమే హర్భజన్‌కు చెప్పింది. అతని సంతోషానికి అవధుల్లేవ్‌. ‘అయితే ఒకరికొకరం జీవితాంతం ముడిపడి ఉందాం’ అన్నాడు గీతాతో. ‘సరే’అంది ఆమె. 2015, డిసెంబర్‌లో ఈ ఇద్దరికీ పెళ్లయింది. ప్రపంచంలోని ఆనందాన్నంతా ఆస్తిగా చేసుకొని సాగిపోతోంది ఆ జంట.


∙ఎస్సార్‌

మరిన్ని వార్తలు