Chiranjeevi- Surekha: చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి

22 Aug, 2022 14:38 IST|Sakshi

కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి.. అన్న మాటను మెగాస్టార్‌ చిరంజీవి తు.చ. తప్పకుండా పాటించాడు. కష్టపడి నటుడైతే సరిపోదు, స్టార్‌ హీరోగా ఎదిగి ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకోవాలి అనుకున్నాడు. స్టార్‌ హీరో ఏంటి? ఏకంగా మెగాస్టార్‌గా ఎదిగాడు. ఇండస్ట్రీ పెద్దను కాదంటూనే చిత్రపరిశ్రమలోని బరువులను, బాధ్యతలను తన భుజాన వేసుకుని మోస్తుంటాడీ గ్యాంగ్‌ లీడర్‌. లెక్కలేనన్ని సాయాలు చేసి మనసున్న మారాజుగానూ పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజు చిరు పుట్టినరోజు కావడంతో మెగా ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో సంబరాలు మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే చిరంజీవి పెళ్లి స్టోరీ కోసం ఆరా తీస్తున్నారు అభిమానులు. మరి వారిది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన వివాహమా? చదివేద్దాం..

చిరంజీవి ఓసారి తన స్నేహితుడు బి.సత్యనారాయణను అతడి పెదనాన్నగారింట్లో దింపేశాడు. వాళ్ల పెదనాన్న ఎవరో కాదు అల్లు రామలింగయ్యగారు. అప్పటికే చిరు ఆయనతో కలిసి మూడు సినిమాల్లో నటించడంతో ఇంట్లోకి వెళ్లాడు. కానీ, అప్పుడు రామలింగయ్యగారు లేరు, అయితే తన స్నేహితుడు కాఫీ తాగి వెళ్దువు అన్నాడు. లోపల కాఫీ పెట్టింది సురేఖ. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదప్పుడు. కానీ చిరంజీవి వెళ్లాక ఆ అబ్బాయి ఎవరు? అని సురేఖ ఆరా తీయగా మనవూరి పాండవులులో నటించాడని చెప్పాడు బి.నారాయణ.

తర్వాత అల్లు అరవింద్‌ తన గురించి డిస్కషన్‌ మొదలుపెట్టారు. అయితే అల్లు రామలింగయ్యగారికేమో వాళ్లమ్మాయిని కలెక్టర్‌కిచ్చి పెళ్లి చెయ్యాలనుండేదట. దాంతో కలెక్టర్‌కు ఇవ్వాలా? లేదా చిరంజీవికి ఇచ్చి పెళ్లి జరిపించాలా? అని అల్లు ఫ్యామిలీ ఆలోచనలో పడింది. సురేఖ ఎవరిని ఓకే అంటే వారితోనే పెళ్లి జరిపేద్దామని డిసైడయ్యారట. కానీ చిరంజీవి ఆంజయనేయభక్తుడు, చెడు అలవాట్లు లేవు, బాగా చదువుకున్నాడు, చాలా కష్టపడతాడు అని చాలామంది మంచి సర్టిఫికెట్‌ ఇవ్వడం, దీనికి తోడు మేకప్‌మెన్‌ జయకృష్ణ అల్లు రామలింగయ్యగారిని దగ్గరుండి కన్విన్స్‌ చేయడంతో తన పెళ్లికి మొదటి అడుగు పడిందని చిరంజీవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సుమారు పది మంది నిర్మాతల దగ్గర చిరంజీవి గురించి తెలుసుకున్నాకే అతడికి సురేఖను ఇచ్చి చేయడానికి ఓకే అన్నాడట.

కానీ అప్పుడే పెళ్లేంటని చిరంజీవి తటపటాయించినా ఆయన తండ్రి మాత్రం బలవంతంగా అతడిని పెళ్లిచూపులకు తీసుకెళ్లారు. మరోవైపు ‘మన వూరి పాండవులు’ చూసి ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు’. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్‌ను చేసుకుంది. నేనూ యాక్టర్‌ను చేసుకుంటే బాగుంటుంది అనుకుందట సురేఖ. అలా తొలిసారి కలిసినప్పుడు చూసుకోకపోయినా ఇద్దరికీ ముడిపడింది. ఫిబ్రవరిలో బ్రహ్మాండమైన ముహూర్తాలుండటంతో లగ్నపత్రిక రాసేశారు. అలా చిరంజీవి- సురేఖల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. ఈ ఆదర్శ దంపతులకు రామ్‌చరణ్‌తో పాటు శ్రీజ, సుష్మిత అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

చదవండి: వన్‌ అండ్‌ ఓన్లీ 'మెగాస్టార్‌' చిరంజీవి
‘మెగాస్టార్‌’ అంటే ఓ బ్రాండ్‌.. మరి ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?

మరిన్ని వార్తలు