హీరో ధనుష్‌కు హైకోర్టులో ఊరట

2 Aug, 2022 10:45 IST|Sakshi

సాక్షి, చెన్నై: నటుడు ధనుష్‌ కథానాయకుడుగా నటించిన చిత్రం వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ). ఆ చిత్రానికి ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా, ఈ సినిమాలో పొగతాగే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై టుబాకో నియంత్రణ కమిటీ 2014లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. పొగతాగే సన్నివేశాలను ప్రచారం చేయటం చట్ట ప్రకారం నేరమని, ఈ మూవీలో అలాంటి సన్నివేశాలను పొందుపరిచారని ఆరోపించింది. ప్రభుత్వ హెచ్చరికలు పొందుపరిచలేదని ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.

దీంతో ఆరోగ్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థానిక సైదాపేట కోర్టులో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లపై పిటిషన్‌ దాఖలు చేశారు. సైదాపేట కోర్టు ధనుష్‌ ఐశ్వర్య రజనీకాంత్‌లకు ప్రత్యక్షంగా, హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఐశ్వర్య రజనీకాంత్‌ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అదేవిధంగా ధనుష్‌ కూడా హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ సోమవారం న్యాయమూర్తి సతీష్‌ కుమార్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. ధనుష్‌ తరపు న్యాయవాది విజయన్‌ సుబ్రమణియన్‌ హాజరై ధనుష్‌ సైదాపేట కోర్టుకు హాజరవడంపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి ధనుష్‌ను సైదాపెట కోర్టులో హాజరవడంపై స్టే విధిస్తూ తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.  
చదవండి: భూవివాదం కేసు.. కోర్టుకు హాజరైన రానా

మరిన్ని వార్తలు