Heat Movie: ‘హీట్’ మూవీ రివ్యూ

5 May, 2023 12:00 IST|Sakshi
Rating:  

టైటిల్‌: హీట్‌
నటీనటులు: వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి, మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్ తదితరులు
నిర్మాతలు: ఎం.ఆర్.వర్మ, సంజోష్
దర్శకత్వం:  ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ
సంగీతం : గౌతమ్ రవిరామ్
సినిమాటోగ్రఫీ : రోహిత్ బాచు
విడుదల తేది: మే 5, 2023

ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు వస్తుంటాయి. అయితే అందులో సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లకు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడూ ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లను తెరకెక్కించడం అంత సులభం ఏమీ కాదు. కానీ సరైన కథ, గ్రిప్పింగ్ కథనం ఉంటే సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు హీట్ అనే సినిమా ఆ జానర్‌లో ప్రేక్షకులను మెప్పించేందుకు నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

హీట్ మూవీ కథేంటంటే..
అభిజిత్ (వర్దన్ గుర్రాల), సిరిల్ (మోహన్ సాయి)లిద్దరూ చిన్నతనం నుంచి ఫ్రెండ్స్‌. ఈ ఇద్దరూ కంపెనీ భాగస్వామ్యులుగానూ సక్సెస్ అవుతారు. ఈ క్రమంలో ఓ ప్రాజెక్ట్ విషయంలో స్టీఫెన్ అనే వ్యక్తితో ఇబ్బంది కలుగుతుంది. అదే సమయంలో సిరిల్ తాను ప్రేమించిన ఆరాధ్య (అంబికా వాణి)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కులంతార పెళ్లి కావడంతో ఆరాధ్య కుటుంబ సభ్యులు రగిలిపోతారు. ఆరాధ్య అన్న రుద్ర ఎలాగైనా సరే వారిని చంపాలని అనుకుంటాడు. తదనంతరం సిరిల్, ఆరాధ్యలు కనిపించకుండా పోతారు. వారిని మాయం చేసింది ఎవరు? సిరిల్‌ను ఘోరంగా చంపింది? తన ఫ్రెండ్‌ సిరిల్ కోసం అభి చేసిన ప్రయత్నాలు ఏంటి? అసలు ఈ కథలో మైఖెల్ పాత్ర ఏంటి? చివరకు అభి తన సమస్యల నుంచి బయటపడ్డాడా? అన్నది కథ.

ఎలా ఉందంటే..
హీట్ మూవీ అంతా కూడా ఒకే రాత్రిలో జరుగుతుంది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సమస్యలు మొదలై.. తెల్లారే సరికల్లా కథ సుఖాంతం అవుతుంది. ఈ మధ్యలో ఏం జరిగిందనే దాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. మరీ అంత గ్రిప్పింగ్‌గా కాకపోయినా.. పర్వాలేదనిపిస్తాడు. అయితే ఇలాంటి కథలకు ఉండే కామన్ పాయింట్ అందరికీ తెలిసిందే. సైకో శాడిస్ట్ కిల్లర్ ఎవరు? ఎందుకు ఆ పనులు చేస్తున్నాడు.. వరుసగా హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనేది అంత ఆసక్తికరంగా చెప్పినట్టుగా అనిపించదు.

ఫస్టాఫ్‌లో వరుసగా హత్యలు జరుగుతుండటం, తన ఫ్రెండ్స్‌ను కాపాడుకునేందుకు హీరో కారులో అక్కడికీ ఇక్కడికీ పరుగులు పెట్టడం, సైకో బెదిరింపులు, హ్యాకింగ్‌లు వీటితోనే సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో సినిమా కాస్త స్లో అయినట్టుగా అనిపిస్తుంది. కానీ అప్పటికే ఈ సైకో కిల్లర్ ఎవరు.. అనేది ప్రేక్షకులకు ఓ అంచనా వస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. ఎమోషన్స్‌ను ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో దర్శకులు కొంత సఫలమైనట్టుగా కనిపిస్తుంది. 

ఎవరెలా చేశారంటే..
వర్దన్ గుర్రాల అభి పాత్రలో మెప్పిస్తాడు. ఎమోషన్స్ క్యారీ చేయడంలో సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది. చివర్లో ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఓకే అనిపిస్తాడు. సిరిల్ పాత్ర నిడివి తక్కువే అయినా ఆకట్టుకుంటాడు. మైఖెల్ తన విలనిజంతో ఆకట్టుకుంటాడు. హీరోయిన్లు ఎమోషనల్ కారెక్టర్లతో పర్వాలేదనిపిస్తారు. స్నేహా ఖుషి, అంబికా వాణిలు కనిపించినంత సేపు ఆకట్టుకుంటారు. ఇక విలన్‌గా సైకో మైఖెల్ పాత్రధారి కూడా ఓకే అనిపిస్తాడు. ఇలా అన్ని పాత్రలు నటీనటులు తమ వంతు న్యాయం చేశారు.

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాలో పాటలు తక్కువే. సినిమా ఫ్లోకి అడ్డుపడతాయని పాటలను కూడా అంతగా పెట్టలేదనిపిస్తుంది. ఇక ఆర్ఆర్ మాత్రం సినిమా ఆసాంతం వినిపిస్తూనే ఉంటుంది. సీన్లను బాగానే ఎలివేట్ చేస్తుంది. నైట్ విజన్ షాట్స్ బాగుంటాయి. ఈ సినిమా అంతా ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. ఆ మూడ్‌ను కెమెరామెన్ తెరపైన చూపించాడు. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా అనిపిస్తాయి.

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు