సెట్‌.. రీసెట్‌!

22 May, 2021 00:45 IST|Sakshi

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో వెంకట్‌ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లు. కోల్‌కత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ చాలా రోజుల పాటు కోల్‌కత్తాలో జరిగింది. అక్కడ ఎన్నికల నేపథ్యంలో షూటింగ్‌కు అంతరాయం కలగడంతో హైదరాబాద్‌ వచ్చేసింది యూనిట్‌. పైగా లాక్‌డౌన్‌తో కోల్‌కత్తా వెళ్లి షూటింగ్‌ చేసే పరిస్థితులు లేవు. దీంతో ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్లా ప్రత్యేకంగా ఆరున్నర కోట్లతో కోల్‌కత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులతో సెట్‌ నిర్మించారు. లాక్‌డౌన్‌ ముందు వరకూ ఈ సెట్‌లో కొద్ది రోజులు షూటింగ్‌ కూడా జరిగింది. అయితే హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ సెట్‌ దెబ్బతింది. ఇప్పుడు సెట్‌ని పునర్నిర్మించాలంటే దాదాపు రెండు కోట్ల ఖర్చు అవుతుందట. ఇంకొన్ని రోజుల పాటు ఈ సెట్‌లో చిత్రీకరణ జరగాల్సిన నేపథ్యంలో వేరే దారిలేక సెట్‌ని రీసెట్‌ చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు