కథ విని ఆశ్చర్యపోయాను

25 Aug, 2022 04:19 IST|Sakshi
హెబ్బా, రాధామోహన్, అశోక్‌ తేజ్, సాయి రోనక్‌

హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ  ప్రధాన పాత్రల్లో అశోక్‌ తేజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్‌’. దర్శకుడు సంపత్‌ నంది అందించిన కథ, స్క్రీన్‌ ప్లేతో కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో హెబ్బా పటేల్‌ మాట్లాడుతూ – ‘‘సంపత్‌ నందిగారు చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను. నా కెరీర్‌లో నేను చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. సవాల్‌గా తీసుకుని చేశాను.

నటిగా ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను’’ అన్నారు. ‘‘ఓదెల రైల్వేస్టేషన్‌’ క్రైమ్‌ థ్రిల్లర్‌. 50 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినా కోవిడ్‌ వల్ల రిలీజ్‌ కాస్త ఆలస్యమైంది’’ అన్నారు రాధామోహన్‌. ‘‘నాకు దర్శకుడిగా చాన్స్‌ ఇచ్చిన సంపత్‌ నందిగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వస్తుంది’’ అన్నారు అశోక్‌ తేజ్‌. ‘‘ఈ సినిమా కథ విన్నపుడు థ్రిల్‌ అయ్యాను. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది’’ అన్నారు వశిష్ఠ సింహ. ‘‘ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్‌ పాత్రలు చేసిన నేను ఇందులో సీరియస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చేశాను’’ అన్నారు సాయి రోనక్‌. ఈ కార్యక్రమంలో ‘ఆహా’ ప్రతినిధి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు