Bollywood: ప్రస్తుతం బాలీవుడ్‌ కన్ను ఈ ట్రయాలజీపైనేనా?

19 Oct, 2022 08:38 IST|Sakshi

ఫ్రాంచైజీ, రీమేక్స్, బయోపిక్స్‌ ట్రెండ్‌ల తర్వాత బాలీవుడ్‌ ప్రస్తుతం ట్రయాలజీ (ఒకే కథను మూడు భాగాలుగా) ట్రై చేస్తోంది. అరడజను ట్రయాలజీ ఫిలింస్‌ వెండితెరపైకి రానున్నాయి. ఆ ‘ట్రైయాలజీ’ చిత్రాల వివరాల్లోకి వెళితే...

బ్రహ్మాస్త్రం
ఐదేళ్లుగా సినీ లవర్స్‌ ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీ గురించి వింటూనే ఉన్నారు. రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా, అమితాబ్‌ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్‌ కీలక పాత్రల్లో ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీలోని తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ రూపొందింది. అయాన్‌  ముఖర్జీ దర్శకత్వంలో కరణ్‌ జోహార్‌ నిర్మించిన ఈ సినిమా దక్షిణాది వెర్షన్‌కు  రాజమౌళి సమర్పకులుగా ఉండటం విశేషం. ఈ ఏడాది సెప్టెంబరు 9న ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ రెండు, మూడు భాగాలపై ఫోకస్‌ పెట్టారు మేకర్స్‌. రెండో భాగంలోని ప్రధాన పాత్రల కోసం హృతిక్‌రోషన్‌ , రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకోనె పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. 

ఇతిహాసాల ఆధారంగా...!
ట్రయాలజీ ఫిలింస్‌ తీసేంత స్కోప్‌ రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు ఉంది. ఆల్రెడీ బాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు నితీష్‌ తివారి, రవి ఉడయార్‌లు కలిసి రామాయణం ఆధారంగా ఓ ట్రయాలజీని ప్లాన్‌  చేశారు. అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్‌ మల్హోత్రా వంటి అగ్ర నిర్మాతలు ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌  వర్క్స్‌ జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్రధారులుగా మహేశ్‌బాబు, రామ్‌చరణ్, హృతిక్‌ రోషన్, దీపికా పదుకోన్‌ వంటి స్టార్ల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా హిందీలో ఓ ట్రయాలజీ రూపుదిద్దుకోనుంది.

‘ది ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ’ అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు. విక్కీ కౌశల్‌ టైటిల్‌ రోల్‌ చేయనున్న ఈ చిత్రానికి అదిత్య థార్‌ దర్శకత్వం వహిస్తారు. అలాగే ‘మహాభారతం’ ఆధారంగా సింగపూర్‌కు చెందిన కృష్ణ ఉదయశంకర్‌ రాసిన ‘ది ఆర్యావతార క్రానికల్స్‌’ (గోవింద, కౌరవ, కురుక్షేత్ర) పుస్తకం హక్కులను సోనమ్‌ కపూర్‌ దక్కించు కున్నారు. ‘ది ఆర్యావతార క్రానికల్స్‌’ను ట్రయాలజీగా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సోనమ్‌ పేర్కొన్నారు. ఇంకా ‘మహాభారతం’ ఆధారంగా ఓ సినిమా చేయాలన్నది తన డ్రీమ్‌ అని దర్శకుడు రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ కూడా ట్రయాలజీనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

కొత్త నాగిని
వెండితెరపై నాగిని అనగానే హిందీలో శ్రీదేవి, రీనా రాయ్, రేఖ గుర్తుకు వస్తారు. ఈ జాబితాలో హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ పేరు చేరనుంది. ‘నాగిని’ ట్రయాలజీలో నటించేందుకు శ్రద్ధా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. విశాల్‌ ఫురియా దర్శకత్వంలో ఈ ట్రయాలజీని నిఖిల్‌ ద్వివేది నిర్మించనున్నారు. 

ఛత్రపతి
మహావీరుడు ఛత్రపతి శివాజీ జీవితంతో ఓ ట్రయాలజీని నిర్మించనున్నట్లు నటుడు, నిర్మాత రితేష్‌ దేశ్‌ముఖ్‌ రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఈ ట్రయాలజీని తెరకెక్కించేందుకు మరాఠీ దర్శకులు ‘సైరట్‌’ ఫేమ్‌ నాగరాజ్‌ మంజులే, రవీంద్ర జాదవ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి.  

శక్తిమాన్‌
ఇక బుల్లితెర, వెండితెర సూపర్‌ హీరోస్‌లలో శక్తిమాన్‌కు ఆడియన్స్‌లో సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సూపర్‌ హీరో క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే దిశలో ఇప్పటికే పలువురు నిర్మాతలు సినిమాలు తీశారు. తాజాగా అగ్ర నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్‌ ఇంటర్‌నేషనల్‌ ‘శక్తిమాన్‌’ టైటిల్‌తో ఓ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. ట్రయాలజీగా రూపొందించేందుకు ప్రీ ప్రొడక్షన్‌  వర్క్స్‌ జరుగుతున్నాయని, టైటిల్‌ రోల్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇవే కాదు.. మూడు భాగాల చిత్రాలు మరికొన్ని తెరపైకి వచ్చే చాన్స్‌ ఉంది.

మరిన్ని వార్తలు