Biopic Movies: మహిళలపై బయోపిక్స్‌.. తారల విశేషాలు

28 Sep, 2022 09:50 IST|Sakshi

బాలీవుడ్‌లో కొంతకాలంగా బయోపిక్‌ ట్రెండ్‌ బాగా నడుస్తోంది. అయితే ఈ ట్రెండ్‌ పట్ల హీరోయిన్స్‌ కూడా మొగ్గు చూపుతుండటం విశేషం. ఇటీవల ‘సైనా’, ‘తలైవి’, ‘గంగూభాయి కతియావాడి’, ‘శభాష్‌ మిథూ’ వంటి బయోపిక్స్‌ తెరపైకి వచ్చాయి. తాజాగా మరికొందరు మహిళల బయోపిక్‌లు రూపొందుతున్నాయి. అందులో నటించే తారలు, ఇతర విశేషాలపై ఓ లుక్కేద్దాం... 

భారతదేశ దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో రూపొందుతున్న సినిమా ‘ఎమర్జెన్సీ’. ప్రధానంగా ఎమర్జెన్సీ టైమ్‌లో 1975-1977లో జరిగిన సంఘటనలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ మూవీలో ఇందిరాగాంధీ పాత్రలో నటించడంతో పాటు, డైరెక్షన్‌ చేస్తున్నారు కంగనా రనౌత్‌. అనుపమ్‌ ఖేర్, మిలింద్‌ సోమన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ఘాటింగ్‌ మొదలైంది. అలాగే ‘దంగల్‌’ ఫేమ్‌ ఫాతిమా సనా షేక్‌ కూడా వెండితెరపై ఇందిరా గాంధీగా కనిపించనున్నారు. మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో దివంగత ఫీల్డ్‌ మార్షల్‌ సామ్‌ మానెక్షా జీవితం ఆధారంగా ‘శామ్‌బహదూర్‌’ అనే చిత్రం రూపొందుతోంది.

విక్కీ కౌశల్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తుండగా, ఇందిరాగాంధీ పాత్రని ఫాతిమా చేస్తున్నారు. అదేవిధంగా భారత మాజీ మహిళా క్రికెటర్‌ జులన్‌ గోస్వామి బయోపిక్‌ కూడా తెరపైకి రానుంది. ఆమె పాత్రలో అనుష్క శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘చెక్దా ఎక్స్‌ప్రెస్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ప్రోసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అభిషేక్‌ బెనర్జీ కథ, స్క్రీన్‌ ప్లే అందించారు. జులన్‌ గోస్వామి పాత్ర కోసం ఇంగ్లాండ్‌లో క్రికెట్‌కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు అనుష్కా శర్మ.  నెట్‌ఫ్లిక్స్‌లో ‘చెక్దా ఎక్స్‌ప్రెస్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే 2018లో వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత అనుష్కా శర్మ ఓకే చెప్పిన ప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం.

మరోవైపు రీసెంట్‌ టైమ్స్‌లో విభిన్నరకాలైన వంటకాలు వండారు హీరోయిన్‌ హ్యూమా ఖురేషీ. ఎందుకంటే ‘తర్లా’ బయోపిక్‌ కోసం. దివంగత చెఫ్, వంటల పుస్తకాల రచయిత, వ్యాఖ్యాత తర్లా దలాల్‌ జీవితం ‘తర్లా’గా రానుంది. ‘చిఛోరే’, ‘దంగల్‌’ లకు రచనా విభాగంలో పనిచేసిన పీయూష్‌ గుప్తా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హ్యూమా ఖురేషీ టైటిల్‌ రోల్‌ చేసిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. రిలీజ్‌పై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఇక బాలీవుడ్‌ ప్రముఖ యాక్టర్‌ నీనా గుప్తా బయోపిక్‌ తెరపైకి రానుంది. ‘నా బయోపిక్‌ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు’ అని రీసెంట్‌గా ఓ సందర్భంలో నీనా గుప్తా వెల్లడించారు.

ఆమె పాత్రలో ఎవరు నటిస్తారు? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా 2000 సంవత్సరం మార్చిలో హత్య చేయబడ్డారు హీరోయిన్‌ ప్రియా రాజ్‌ వంశ్‌. ఆమె జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలు వెండితెరపైకి రానున్నాయి. లీడ్‌ రోల్‌లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నటించనున్నారని సమాచారం. దివంగత దర్శక–నిర్మాత, నటుడు చేతన్‌ ఆనంద్, ప్రియా రాజ్‌ వంశ్‌ మధ్య నెలకొన్న సంఘటనలతో ఈ సినిమా ఉంటుందట. ప్రదీప్‌ సర్కార్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తారు. వీరే కాదు.. ఈ తరహా బయోపిక్స్‌లో నటించేందుకు మరికొందరు హీరోయిన్స్‌ రెడీ అవుతున్నారని టాక్‌.  

మరిన్ని వార్తలు