వినాయక చవితికి థియేటర్లో సందడి చేసే భారీ చిత్రాలివే!

12 Aug, 2021 16:36 IST|Sakshi

క‌రోనా ప్రభావం సినీ ప‌రిశ్ర‌మ‌పై ఎంత‌గా పడిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గతేడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 9 నెల‌ల పాటు సినీ ప‌రిశ్ర‌మ‌తో పాటు థియేట‌ర్లు మూత పడ్డాయి. ఆ తర్వాత పాక్షికంగా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రజలు బిగ్‌స్క్రిన్‌పై సినిమా చూసేందుకు భయపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటికి ప్రతి పండగలసందర్భంగా విడుదలయ్యే సినిమాల సందడి లేకుండా పోయింది. దీంతో ఓటీటీలోనే సినిమాలు చూడ్సాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే థియేటర్లు మెల్లిగా తెరుచుకుంటున్నాయి. వరసగా సినిమాలు థియేటర్లో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత మళ్లీ పండగ కళ తెచ్చేందుకు పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. 

నాని ట‌క్ జ‌గ‌దీష్‌, నాగ చైతన్య లవ్ స్టోరీ, రానా విరాట పర్వం, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, నాగశౌర్య వరుడు కావలెను, గోపిచంద్ సీటీమార్ వంటి సినిమాలు వినాయక చవితి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. అక్టోబర్‌లో ఆర్ఆర్ఆర్ వంటి భారీ బ‌డ్జెట్ చిత్రం ఉన్న నేప‌థ్యంలో ఆ లోపే ఈ హీరోలు త‌మ సినిమాల‌ను విడుద‌ల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని స‌మాచారం. కాగా ఇటీవల టక్‌ జగదీశ్‌, సీటీమార్‌, లవ్‌స్టోరీతో పాటు మరిన్ని చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఇటీవల సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు అయోమంలో పడ్డారు.

ఈ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలన్ని కూడా థియేటర్లోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే జూలై 30న విడుద‌లైన తిమ్మ‌ర‌సు చిత్రం మంచి విజ‌యం సాధించ‌గా, రీసెంట్‌గా విడుద‌లైన ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా మంచి వసూళ్లు సాధించింది. కరోనా నిబంధనల మేరకు 50 శాతం ఆక్యూపెన్సీతో ప్రస్తుతం థియేటర్లు ఓపెన్‌ కాగా, వినాయ‌క చ‌వితికి వంద శాతం ఆక్యుపెన్సీతో క‌ళ‌క‌ళ‌లాడ‌నున్నాయి. ఈ క్ర‌మంలో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ నెలలో పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

మరిన్ని వార్తలు