అందుకే హీరో ఆకాశ్‌కు సినిమా ఛాన్స్‌లు తగ్గాయట

15 Aug, 2021 13:31 IST|Sakshi

‘ఆనందం’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన హీరో ఆకాశ్‌. అప్పటికే అతడు పలు సినిమాల్లో నటించినప్పటికి శ్రీనువైట్ల దర్శకత్వంలో​ వచ్చిన ఆనందం మూవీ ఆయనకు కమర్షియల్‌ హిట్‌ను అందించింది. ఈ మూవీతో జై ఆకాశ్‌కు ఒక్కసారిగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఇందులో హీరోయిన్‌తో గొడవ పడుతూ, తండ్రికి భయపడే కుమారుడిగా ఆకాశ్‌ లేడీ ఫ్యాన్స్‌ ఆకట్టుకున్నాడు. ఇందులో తన హేర్‌స్టైల్‌, స్టైలిష్‌ లుక్‌ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఆనందం మూవీ సమయంలో ఆకాశ్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వరుస సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ ఆకాశ్‌ హీరోగా ఎక్కువ కాలం రాణించలేకపోయాడు. అయితే దీనికి కారణం తనకు వచ్చిన స్టార్‌ స్టేటస్‌ను చూసుకుని దర్శక-నిర్మాతలను తన డిమాండ్‌లతో ఇబ్బంది పెట్టడమే అని సినీ వర్గాల అభిప్రాయం. 

జై ఆకాశ్‌ అసలు పేరు.. సతీష్‌ నాగేశ్వరన్‌. శ్రీలంక తమిళ కుటుంబం నుంచి 1981 మార్చి 18న కొలంబోలో జన్మించాడు. విద్యాభ్యాసమంతా శ్రీలంకలో చేశాడు. పై చదువుల కోసం లండన్‌ వెళ్లి అక్కడ స్థిరపడిన ఆకాశ్‌ సినిమాలపై ఆసక్తితో చెన్నై వచ్చాడు.  ఈ క్రమంలో ‘రోజా వనం’ అనే తమిళ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగులో సుమంత్‌ హీరో వచ్చిన ‘రామ్మా చిలకమ్మ’లో సైడ్‌ హీరోగా చేశాడు. ఆ వెంటనే ‘ఆనందం’ సినిమాలో మెయిన్‌ హీరోగా నటించే చాన్స్‌ వచ్చింది. ఇక ఆ తర్వాత తెలుగు, హిందీ, కన్నడ, తమిళ పరిశ్రమల్లో పలు సినిమాలు చేసి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా నంది అవార్డుతో పాటు పలు పురస్కారాలు అందుకున్న ఆకాశ్‌ ఎక్కువ కాలం హీరోగా రాణించలేకపోయాడు.

సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్స్‌ చేస్తూనే దర్శకుడిగా మారాడు. తమిళం, తెలుగులో పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలాగే స్వయంగా దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించాడు. ఈ క్రమంలో తమిళ హీరోయిన్‌ నిషాను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు అంత బాగానే ఉంది. కానీ తను నిర్మించిన చిత్రాలు అన్ని బాక్సాఫీసు వద్ద అంతగా రాణించలేదు. అలాగే తన యాటిట్యూడ్‌తో వచ్చిన సినిమా అవకాశాలు పోగొట్టుకోవడం, నటించిన సినిమాలు విడుదల కాకపోవడంతో నటుడిగా ఆకాశ్‌ కేరీర్‌ డౌన్‌ అయ్యింది. ఇక నిర్మాతగా తాను సంపాదించుకున్న ఆస్తులతో పాటు ఉన్న ఆస్తులను కూడా పోగొట్టుకున్నాడు. ఆర్థికంగా నష్టపోయాడు. అయితే ఒక్క సినిమా హిట్‌కే పెద్ద స్టార్‌నని  ఫీల్‌ అవుతూ డైరెక్టర్స్‌ దగ్గర గొంతెమ్మ కోరికలు కోరేవాడట.

సోనాలి బింద్రే, సిమ్రాన్‌ వంటి స్టార్‌ హీరోయిన్లు అయితేనే నటిస్తానని డిమాండ్‌ చేయడంతో ఆకాశ్‌కు అవకాశాలు వెనక్కిపోయేవట. దీంతో కొంతకాలం నటనకు దూరమై తెరపై కనుమరుగైన ఆకాశ్‌ ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్‌ తీసిన ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీ తనదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ తెరపైకి వచ్చాడు. తన సినిమాను పూరి దొంగలించారని, నష్టపరిహరంగా 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశాడు. అయితే దీనిపై పూరి ఇంతవరకు స్పందించలేదు. ఈ క్రమంలో ఆకాశ్‌ ఆర్థికంగా నష్టపోయాడని, డబ్బు, ఫేం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు నెటిజన్లు, పూరి అభిమానులు ఆకాశ్‌ను విమర్శించారు. దీంతో వాటిపై స్పందించిన ఆకాశ్‌..తనకు లండన్‌లో సొంతంగా 2, 3 పెట్రొల్‌ బంక్‌లు, సూపర్‌ మార్కెట్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అలాగే తెలుగు పరిశ్రమ తనని దారుణంగా మోసం చేసిందంటూ ఇండస్ట్రీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కాడు.

మరిన్ని వార్తలు