ఈఐఏ–2020తో మానవాళికి ముప్పు

30 Jul, 2020 07:20 IST|Sakshi

సినిమా: ఈఐఏతో మానవాళికి ముప్పు తప్పదని సూర్య, కార్తీ అభిప్రాయపడ్డారు. వివరాలు.. కేంద్ర ప్రభుత్వం  ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ ఎసెస్‌మెంట్‌–2020 డ్రాప్ట్‌ (ఈఐఏ) విధి విధానాన్ని తీసుకురానున్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇది భవిష్యత్‌లో మానవాళికి తీవ్ర ప్రమాదకరంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే విషయాన్ని యువ నటుడు కార్తీ తెలిపారు. నటుడు ఉళవన్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి రైతులకు, వ్యవసాయానికి పలు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈఐఏ–2020 డ్రాప్ట్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మంగళవారం తన ఉళవన్‌ ఫౌండేషన్‌ తరఫున ప్రకటన విడుదల చేశారు.

ఈఐఏ–2020 మన దేశ పర్యావరణానికి ముప్పు కలిగించేలా ఉందన్నారు. ప్రకృతి వనరులను తొలగిస్తూ, వాటిని అభివృద్ధిగా భావించడం భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మార్చే ప్రయత్నమే అవుతుందని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా చట్టాన్ని అమలు పరచాలనుకోవడమే భయానికి గురి చేస్తోందన్నారు. మనకు ఏర్పడే ముప్పు గురించి మనమే మాట్లాడక పోవడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ అంశంపై అనుభవజ్ఞులు, మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని కార్తీ కోరారు. కార్తీ సోదరుడు, హీరో సూర్య సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన బుధవారం తన ట్విట్టర్‌లో పేర్కొంటూ అభిప్రాయాలను వ్యక్తం చేయడం కంటే అసలు మౌనంగా ఉండటం చాలా ప్రమాదకరమన్నారు. అందుకే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మౌనాన్ని వీడుదామని సూర్య పేర్కొన్నారు. నటుడు సూర్య, కార్తీలకు వారి అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. పలువురు స్వాగతిస్తున్నారు.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు