హీరో మహేశ్‌ బాబు ఇంట్లో విషాదం.. రమేశ్‌బాబు కన్నుమూత

9 Jan, 2022 09:19 IST|Sakshi

కొంతకాలంగా కాలేయ వ్యాధితో అస్వస్థత 

పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి ఆస్పత్రికి తరలింపు 

అప్పటికే మృతిచెందినట్లు వైద్యుల ధ్రువీకరణ 

‘బజారు రౌడీ’, ‘అన్నాచెల్లెలు’.. రమేశ్‌ కెరీర్‌లో సూపర్‌హిట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్‌బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతికి తరలించారు. అయితే అప్పటికే (రాత్రి 10గం. ప్రాంతంలో) రమేశ్‌బాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  

చిన్నప్పటి సీతారామరాజుగా తెరంగేట్రం.. 
1965, అక్టోబర్‌ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరలకు మొదటి సంతానంగా జన్మించారు రమేశ్‌బాబు. తండ్రి çకృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’(1974) సినిమాలో చిన్నప్పటి సీతారామరాజుగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కృష్ణ ఓ లీడ్‌ రోల్‌లో నటించి, నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’లో చిన్నప్పటి ఎన్టీఆర్‌గా కనిపించారు. ‘దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాల్‌’వంటి చిత్రాల్లో బాల నటుడిగా అలరించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘నీడ’లో తొలిసారిగా టీనేజ్‌ ప్రధాన పాత్ర చేశారు. రమేశ్‌ సోదరుడు మహేశ్‌బాబుకు బాలనటుడిగా ఇదే తొలి చిత్రం. దాసరి ‘పాలు నీళ్లు’లోనూ రమేశ్‌ ప్రధాన పాత్రలో కనిపించారు.

వి. మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్‌’(1987)తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్‌ టైగర్, కృష్ణగారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, అన్నాచెల్లెలు, ఆయుధం’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు. ‘బజారు రౌడీ’, ‘అన్నాచెల్లెలు’చిత్రాలు రమేశ్‌ కెరీర్‌లో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 1997లో ఎన్‌. శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ఎన్‌కౌంటర్‌’రమేశ్‌బాబుకి చివరి చిత్రం. ఆ తర్వాత 1999లో వచ్చిన హిందీ చిత్రం ‘సూర్యవంశమ్‌’(తెలుగు ‘సూర్యవంశం’చిత్రానికి రీమేక్‌) చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా చేశారు. తర్వాత తండ్రి పేరుతో కృష్ణ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించి, సోదరుడు మహేశ్‌బాబు హీరోగా ‘అర్జున్‌’(2004) చిత్రంతో పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. ఆ తర్వాత మహేశ్‌తోనే ‘అతిథి’సినిమాను నిర్మించారు. మహేశ్‌ ‘దూకుడు’, ‘ఆగడు’చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. రమేశ్‌కు భార్య మృదుల, కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి ఉన్నారు. రమేశ్‌ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

తండ్రి, సోదరుడితో... 
తండ్రి కృష్ణతో ‘కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, ఆయుధం, ఎన్‌కౌంటర్‌’చిత్రాల్లో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు రమేశ్‌. తమ్ముడు మహేశ్‌తో ‘బజారు రౌడీ, ‘ముగ్గురు కొడుకులు’చిత్రాల్లో నటించారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు