Hero Movie Review: మహేశ్‌బాబు మేనల్లుడి ‘హీరో’ మూవీ ఎలా ఉందంటే..

15 Jan, 2022 13:54 IST|Sakshi
Rating:  

టైటిల్‌: హీరో
నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య తదితరులు
నిర్మాత : పద్మావతి గల్లా
దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య టి
సంగీతం : జిబ్రాన్‌
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్

టాలీవుడ్‌లోకి వారసుల ఎంట్రీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలుగా గుర్తింపు పొందిన కొంత మంది హీరోలు..తమ వారసులను సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. మహేశ్‌బాబు మేనల్లుడు, కృష్ణ మనవడు గల్లా అశోక్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘హీరో’.ఈ మూవీ సంక్రాంతి కానుకగా శనివారం (జనవరి 15)న విడుదలైంది. ‘హీరో’మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

‘హీరో’కథేంటంటే..?
మధ్యతరగతి కుటుంబానికి చెందిన అర్జున్‌(అశోక్‌) చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని కలలు కంటారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. అదే క్రమంలో తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని పక్క ప్లాట్‌లోకి వచ్చిన పశువుల వైధ్యురాలు సుబ్బు అలియాస్‌ సుభద్ర(నిధి అగర్వాల్‌)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమాయాణం సాఫీగా సాగుతున్న క్రమంలో అర్జున్‌కు ఒక కొరియర్‌ వస్తుంది. అందులో ఓ గన్‌ ఉంటుంది. ఆ తర్వాత అర్జున్‌ లైఫ్‌ టర్న్‌ తీసుకుంటుంది. అనుకోకుండా ఓ క్రైమ్‌ కేసులో ఇరుక్కుంటాడు. ఇంతకీ గన్‌ ఎక్కడ నుంచి వచ్చింది? క్రైమ్‌ కేసు నుంచి అర్జున్‌ ఎలా తప్పించుకున్నాడు? సుబ్బు తండ్రి(జగపతిబాబు)తో ఆ గన్‌కు ఉన్న సంబంధం ఏంటి? సుబ్బు ప్రేమను అర్జున్‌ ఎలా దక్కించుకున్నాడు? హీరో అవ్వాలనే అర్జున్‌ కోరిక నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ. 

ఎవరెలా చేశారంటే..
అశోక్‌ గల్లాకి ఇది తొలి సినిమా. కానీ ఆ విషయంలో తెరపై ఎక్కడా కనిపించలేదు. అర్జున్‌ పాత్రలో అశోక్‌ ఒదిగిపోయాడు. కామెడీ టైమింగ్‌ బాగుంది. ఫైట్‌ సీన్స్‌తో పాటు డాన్స్‌ కూడా అదరగొట్టేశాడు. ఇక సుబ్బుగా నిధి అగర్వాల్‌ మరోసారి తెరపై తనదైన అందాలతో అలరించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అశోక్‌ , నిధిల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఇక హరో స్నేహితుడు, రాప్‌ సింగర్‌గా సత్య తనదైన కామెడీతో నవ్వించాడు. హీరోయిన్‌ తండ్రిగా జగపతి బాబు నటన ఆటకుంటుంది. చాలా సీరియస్‌గా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు.. క్లైమాక్స్‌లో మాత్రం నవ్వించాడు. హీరో తండ్రిగా నరేశ్‌ తనదైన నటనతో మెప్పించాడు. ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్‌ సలీమ్‌ భాయ్‌ పాత్రలో రవికిషన్‌ జీవించేశాడు. క్లైమాక్స్‌లో సినిమా హీరోగా బ్రహ్మజీ అయితే ఫుల్‌గా నవ్విస్తాడు. కోట శ్రీనివాసరావుతో పాటు  మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..?
శమంతకమణి, భలేమంచి రోజు, దేవదాస్‌ చిత్రాలలో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీరామ్‌ ఆదిత్య.. ఈ సారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘హీరో’ని తెరకెక్కించాడు. ఓ కామెడీ కథకి ముంబై మాఫియా లింకులు కలిపి ఫన్‌ క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. ఫస్టాఫ్‌ అంతా రోటీన్‌గా సాగినప్పటికీ.. ప్రేక్షకుడికి మాత్రం బోర్‌ కొట్టించకుండా కామెడీతో మెప్పించాడు దర్శకుడు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ అక్కడ కూడా కథ రోటీన్‌ కామెడీతో సాగడం సినిమాకు కాస్త మైనస్‌. జగపతి బాబు ప్లాష్‌ బ్యాక్‌ ఓ రేంజ్‌లో ఉంటుందని ఊహించుకున్న ప్రేక్షకుడికి.. ఆయన్ని కామెడీ పీస్‌గా చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కామెడీ పండించడంలో భాగంగానే జగపతిబాబుని అలా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

ఇక క్లైమాక్స్‌లో బ్రహ్మాజీ ఎంట్రీ అయితే అదిరిపోయింది. సినిమా హీరోగా బ్రహ్మాజీ పండించిన కామెడీ.. నవ్వులు పూయిస్తుంది. స్క్రీన్‌ప్లే బాగుంది. రోటీన్‌ కథనే.. డీసెంట్‌ కామెడీతో కాస్త డిఫరెంట్‌గా చూపించాడు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే..  జిబ్రాన్ సంగీతం ఆకట్టుకుంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ జుంబారే పాటతో పాటు రాప్‌ సాంగ్‌ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది.ఈ సినిమాకి నిర్మాణ విలువలు మంచి హైలైట్ అని చెప్పొచ్చు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా మొత్తాన్ని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. మొత్తంగా కొన్ని లాజిక్స్‌ని పక్కనపెట్టి చూస్తే ఈ సంక్రాంతికి ‘హీరో’ ఎంటర్‌టైన్‌ చేస్తాడు.

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు