Nani: 'టక్‌ జగదీష్‌' ఓటీటీలో ఎందుకు రిలీజ్‌ చేస్తున్నామంటే..

2 Sep, 2021 08:30 IST|Sakshi

Nani Tuck Jagadish: ‘‘టక్‌ జగదీష్‌’లో కొత్త ట్విస్ట్‌లు, కొత్త విశేషాలు ఉంటాయని నేను చెప్పను. మనం ఎలాంటి సినిమాలను అయితే చూస్తూ పెరిగామో, ఇప్పుడు ఎలాంటి సినిమాలను మిస్‌ అవుతున్నామో అలాంటి సినిమా ‘టక్‌ జగదీష్‌’. మన ఇల్లులాంటి సినిమా. ఇందులో అన్ని సెంటిమెంట్స్‌ ఉన్నాయి’’ అన్నారు నాని.  శివ నిర్వాణ దర్శకత్వంలో నాని, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ హీరో హీరోయిన్లుగా సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌లో విడుదల చేయనున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో నాని మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ బుధవారం విడుదలైంది కానీ ఆల్రెడీ ఇంతకు ముందే కొంతమంది చూశారు. చూసినవారికి కళ్లలో నీళ్లు తిరిగాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాలను శివ బాగా చూపిస్తారు. ‘టక్‌ జగదీష్‌’ ఆ విషయంలో నెక్ట్స్‌ లెవల్‌. సినిమాలను థియేటర్స్‌లో చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. సినిమాలను ఎంతగానో ప్రేమించే మేం కూడా మా సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్నామంటే అందుకు కారణం పరిస్థితులే. ప్రేక్షకులు మా ‘టక్‌ జగదీష్‌’ను ఆదరిస్తానే నమ్మకం ఉంది’’ అన్నారు. చదవండి : మరికాసేపట్లో ఈడీ విచారణకు హాజరుకానున్న ఛార్మీ

‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ‘టక్‌ జగదీష్‌’ విడుదల కావడం పట్ల కొందరు అభ్యంతరం చెబుతున్నారు. వారికి మీ సమాధానం? అనే ప్రశ్నకు... ‘‘వాళ్లంటే నాకు చాలా గౌరవం. వాళ్లున్న పరిస్థితుల్లో వాళ్లు అలా రియాక్ట్‌ అవ్వడంలో తప్పు లేదు. వారి కష్టాన్ని, పరిస్థితులను నేను అర్థం చేసుకోగలను. కాకపోతే జగదీష్‌నాయుడు (‘టక్‌ జగదీష్‌’ లో నాని పాత్ర), నేనూ వాళ్ల ఫ్యామిలీయే. నన్ను బయటివాడిగా చూడటం బాధ అనిపించింది. నా సినిమాను ఆపేస్తామని కూడా అన్నారట. నిజంగా బయట క్లిష్టమైన పరిస్థితులు లేనప్పుడు నా సినిమా థియేటర్స్‌లో విడుదల కాకపోతే అప్పుడు ఎవరో నన్ను బ్యాన్‌ చేయాలనుకోవడం కాదు.. నన్ను నేనే బ్యాన్‌ చేసుకుంటాను’’ అన్నారు నాని.

శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘థియేటర్లో మా సినిమా విడుదల కావడం లేదని తెలిసినప్పుడు కలిగిన బాధ నాకు, నానీకి మాత్రమే తెలుసు. థియేటర్లో విడుదల చేసి, ఏమైనా తేడా వస్తే మా (నాని, శివ నిర్వాణ) పారితోషికంలోంచి కట్‌ చేసుకోమని చెప్పాం కూడా. ఐదు నెలలు రిలీజ్‌ కోసం వెయిట్‌ చేశారు నిర్మాతలు. పరిస్థితులు ఇంకా మారడం లేదు. అందుకే ఓటీటీ రిలీజ్‌ నిర్ణయం తీసుకున్నారు’’ అన్నారు. నటులు ప్రవీణ్, తిరువీర్‌ పాల్గొన్నారు. 

చదవండి : టక్‌ జగదీష్‌ ట్రైలర్‌ వచ్చేసింది

మరిన్ని వార్తలు