ట్రాజెడీ కింగ్స్‌ లవ్‌

20 Sep, 2020 09:31 IST|Sakshi

ఇప్పుడు ఖాన్‌ల త్రయం ఎలాగో 60ల్లో  దిలీప్‌ కుమార్, మనోజ్‌ కుమార్, రాజేంద్ర కుమార్‌.. త్రయం పాపులర్‌.  ఇది రాజేంద్ర కుమార్‌ ప్రేమ కథ.  అతని చాలా సినిమాలు 25 వారాలపాటు ప్రేక్షకులను  అలరించడం వల్ల ‘జూబ్లీ కుమార్‌’ గానూ ఫేమస్‌ అయ్యాడు.  సెకండ్‌ ట్రాజెడీ కింగ్‌ (ఫస్ట్‌ .. దిలీప్‌ కుమార్‌) అనీ పిలిచేవారు.  ఆ ప్రేమ నాయిక సైరా బాను. 

1960ల నాటి సంగతి.. 
దిలీప్‌ కుమార్‌ను చూడ్డం కోసం ముంబైలో ‘మొఘల్‌ ఎ ఆజం’ ప్రీమియర్‌కు హాజరైంది ఒక పదహారేళ్లమ్మాయి. అప్పుడే లండన్‌ నుంచి వచ్చింది స్కూల్‌ చదువు ముగించుకొని. ఆ షోకి దిలీప్‌ కుమార్‌ రాకపోయేసరికి చాలా నిరాశపడింది. తర్వాత యేడాదికి తనూ హీరోయిన్‌ అయింది ‘జంగ్లీ’ సినిమాతో.. షమ్మీకపూర్‌ పక్కన. ఆమే సైరా బాను. ‘మొఘల్‌ ఎ ఆజం’ ప్రీమియర్‌ ప్రస్తావనకు తర్వాత ఆమె జీవితంలోని మలుపుకి సంబంధం ఉంది.
ఫిదా
సైరా బాను సినిమాల్లోకి రాకముందే రాజేంద్ర కుమార్‌ స్టార్‌. ఆ తరం ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు. ‘జంగ్లీ’ హిట్‌తో సైరా బానుకు స్టార్స్‌ పక్కన నటించే అవకాశాలు క్యూ కట్టాయి. అందులో రాజేంద్ర కుమార్‌ హీరోగా ‘ఆయీ మిలన్‌ కీ బేలా’ కూడా ఉంది. సైన్‌ చేసింది సైరా. ఆ సెట్స్‌లో ఆమెను చూసిన రాజేంద్ర కుమార్‌ గుండె లయ తప్పింది. సైరా కళ్లల్లోని అమాయకత్వం అతణ్ణి పిచ్చివాణ్ణి చేసింది.  ‘తుమ్హే క్యా దూ మై దిల్‌ కె సివా (నా హృదయాన్ని తప్ప నీకేం ఇవ్వ గలను)’ అంటూ సాగే ‘ఆయీ మిలన్‌ కీ బేలా’లోని పాటలో సైరా  కోసం జీవించాడు. ఫిమేల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న అంతటి హీరో తనకు ఫిదా కావడంతో రాజేంద్ర కుమార్‌ పట్ల ఆమెకూ ఆకర్షణ మొదలైంది.

సినిమా పూర్తయ్యేటప్పటికి ప్రేమలో పడిపోయారిద్దరూ. ఆ మూవీ బాక్సాఫీస్‌ హిట్‌. దాంతో ఈ ఇద్దరి కలయికలోనే ‘ఝుక్‌ గయా ఆస్‌మాన్‌’ ప్రారంభమైంది. ఇందులోని ‘కౌన్‌ హై జో సప్‌నో మే ఆయా (నా కలలోకి వచ్చినదెవరు)’ పాటలో తన కళ్లల్లో సైరాను కొలువుంచుకొనే అభినయించాడు రాజేంద్ర కుమార్‌. ఈ సినిమా కూడా హిట్‌ అయ్యి ఆ జంటకు సూపర్‌ క్రేజ్‌ ఏర్పడింది. తెర మీది కెమిస్ట్రీతో పాటు వీళ్లిద్దరి ప్రేమాయణమూ బాలీవుడ్‌ నోట షికారు చేసింది. అయితే రాజేంద్ర కుమార్‌ అప్పటికే పిల్లల తండ్రి. అదేమీ అడ్డంకిగా భావించని సైరా అతణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంది. సైరా ప్రేమ కోసం భార్యా,పిల్లలనూ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు రాజేంద్ర కుమార్‌. 

నో...
ఈ విషయం సైరా  తల్లి నసీమ్‌ బానుకు తెలిసింది. నిజానికి రాజేంద్ర కుమార్‌ అంటే నసీమ్‌ కుటుంబానికి అపారమైన గౌరవం. అభ్యంతరమల్లా అతను వివాహితుడు, పర మతస్థుడవడమే. రాజేంద్ర కుమార్‌ను చాలా ఆప్యాయంగా పలకరించేది నసీమ్‌. అతనూ అంతే. సైరా గురించి చాలా చనువు తీసుకుని మాట్లాడేవాడుట నసీమ్‌తో. ‘సైరా చాలా మంచి పిల్ల. ఆమెను అర్థం చేసుకునే చక్కటి భాగస్వామి దొరకాలి’ అంటూ. రచ్చ కాకుండానే సైరాను ఆ ఆకర్షణలోంచి తప్పించాలనుకుంది నసీమ్‌.. దిలీప్‌ కుమార్‌ అంటే తన కూతురికి ఉన్న ఫ్యాన్‌ క్రష్‌ను ఉపయోగించుకుని.  

బర్త్‌డే పార్టీ
చాన్స్‌ రానే వచ్చింది  సైరా బాను బర్త్‌డే రూపంలో. పార్టీ అనౌన్స్‌ చేసి దిలీప్‌ కుమార్‌ను అతిథిగా ఆహ్వానించింది నసీమ్‌. పుట్టిన రోజు పార్టీలో తన అభిమాన హీరో కనిపించడంతో ‘దిలీప్‌ సాబ్‌’ అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సైరా. దిలీప్‌ కుమార్‌ కూడా సైరాను చూసి ముగ్ధుడయ్యాడు. ఆ క్షణం దిలీప్‌ కుమార్‌ కళ్లల్లో మెరిసిన మెరుపు నసీమ్‌ దృష్టిని దాటిపోలేదు. సమయం చిక్కగానే అతణ్ణి అడిగింది.. ‘మీరంటే సైరాకు పిచ్చి.. చిన్నప్పటి నుంచీ. నా కూతురిని పెళ్లి చేసుకుంటారా?’ అని. అప్పటికే వహీదా రెహ్మాన్‌తో డేటింగ్‌లో ఉన్నాడు దిలీప్‌ కుమార్‌. అయినా నసీమ్‌ ప్రతిపాదనను సమ్మతించాడు రెండో ఆలోచన లేకుండానే. సైరా నిఖా దిలీప్‌ కుమార్‌తో పక్కా కావడంతో సైలెంట్‌గా ఆమె జీవితంలోంచి తప్పుకున్నాడు రాజేంద్ర కుమార్‌. అలా తనకన్నా ఇరవై రెండేళ్లు పెద్దవాడైన దిలీప్‌ కుమార్‌కు జీవిత భాగస్వామి అయింది సైరా బాను. పెళ్లయిన తర్వాత విడుదలైన సైరా బాను చిత్రం ‘అమన్‌’. అందులో హీరో రాజేంద్ర కుమార్‌. అదీ హిట్టే. 

‘సైరా.. నిన్ను పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను. నీకు ఇష్టమేనా?’ అని దిలీప్‌ కుమార్‌ అడిగిన వెంటనే ‘ఇలా ఇప్పటి వరకు ఎంత ఎంతమంది అమ్మాయిలను అడిగి ఉంటారు?’ అని అతణ్ణి ప్రశ్నించిందట సైరా బాను. అలా జవాబిచ్చిన ఆమే తర్వాత ‘నా జీవితంలో అల్లాను రెండే రెండు కోరికలు కోరాను. మా అమ్మలా ఫేమస్‌ కావాలని, దిలీప్‌ కుమార్‌లాంటి భర్త దొరకాలని. అల్లా రెండిటినీ నెరవేర్చాడు. దిలీప్‌ సాబ్‌.. నా కొహినూర్‌’ అని చెప్పింది ఒక ఇంటర్వ్యూలో.  
∙∙ 
‘సైరా, నేను ఒకరినొకరం చాలా ఇష్టపడ్డాం.  నేను కోరుకున్నట్టుగా ఆమెకు మంచి భర్తే దొరికాడు. తను సంతోషంగా ఉంది. ఇంతకుమించి నాకింకేం కావాలి!!’
– రాజేంద్ర కుమార్‌ (సీమా సోనిక్‌ ఆలిమ్‌ చంద్‌ రాసిన రాజేంద్ర కుమార్‌ బయోగ్రఫీ ‘జూబ్లీ కుమార్‌’ నుంచి).

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు