రాజకీయాల్లోకి రాను అని చెప్పను, కానీ..: సిద్దార్థ్‌

8 Oct, 2021 21:12 IST|Sakshi

ఇకపై తెలుగు ప్రేక్షకులను వదిలిపెట్టి వెళ్లను

మా ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తున్నా: సిద్దార్థ్‌

శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం'. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా  హీరో సిద్దార్థ్ మీడియాతో ముచ్చటించారు. సిద్దార్థ్‌ ఏమన్నాడో ఆయన మాటల్లోనే..

► మహా సముద్రం క్లైమాక్స్ షూట్‌లో చిన్న గాయమైంది. దానికే అజయ్ భూపతి  సర్జరీ అని చెప్పేశాడు. దీంతో మా అమ్మానాన్నలు తెగ  కంగారు పడిపోయి.. ఫోన్లు  చేశారు. ఆ వెంటనే అజయ్ భూపతికి ఫోన్ చేసి అలా చెప్పావ్ ఏంటి? అని అడిగాను. మీరే కదా ట్రీట్మెంట్ అని చెప్పారు అని అన్నాడు. ట్రీట్మెంట్‌కు, సర్జరీకి చాలా తేడా ఉందని అన్నాను. అది చిన్న గాయం మాత్ర‌మే సర్జరీలాంటిదేమీ జరగలేదు.

► అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన‌ ఆర్‌ఎక్స్‌ 100 సినిమా చూశాను. ఎంత పర్‌ఫెక్షన్‌తో తీశాడో.. రామ్ గోపాల్ వర్మ శిష్యుడనిపించుకున్నాడు. అతడు మహాసముద్రం కథ చెబితుంటే.. రెండో సినిమా దర్శకుడిలా అనిపించలేదు. వెంటనే ఓకే చెప్పాను. ఇది ట్రెండ్ సెట్టర్ సినిమా. శర్వానంద్ అద్భుతమైన నటుడు. మేం ఇద్దరం కలిసి ఓ  సినిమా చేస్తున్నామంటే ఎవరికి తగిన కారణాలు వారికి ఉంటాయి. నేను, శర్వాతో ఒక్కసారి చర్చలు కూడా పెట్టుకోలేదు. మాకు  స్క్రిప్ట్ మీద అంత నమ్మకం ఉంది. అజయ్ భూపతి ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ట్రైలర్ బాగుంది కానీ కథ ఏంటి అర్థం కావడం లేదు అని చూసిన ప్రతీ ఒక్కరూ అంటున్నారు.  అదే మా సక్సెస్.

► ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు  సిద్దు అంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనే ఇమేజ్ ఇచ్చారు. కానీ ఈ సినిమాతో కొత్త రకమైన ఇమేజ్ వస్తుంది. 2003లో బాయ్స్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా మారలేదు. అప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. మధ్యలో వచ్చింది బ్రేక్‌లాంటిది కాదు. కానీ నాలో నేను వెతుక్కునే క్రమంలో బ్రేక్ వచ్చింది. నన్ను స్టార్‌ను చేసింది తెలుగు వాళ్లే. అయితే ప్రతీ భాషల్లో నాకు ఓ ఐకానిక్ చిత్రం ఉంది. తమిళంలో బాయ్స్, హిందీలో రంగ్ దే బసంతి ఇలా ఉన్నాయి. అయితే నేను ప్రతీ చోటా తెలుగు నటుడిని అని చెప్పుకునేవాడిని. దాంతో అక్కడి వారు హర్ట్ అయ్యేవారు. కానీ నేను తెలుగు స్టార్‌ని, ఇండియన్ నటుడిని. అందుకే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాను. ఇకపై తెలుగు ప్రేక్షకులను వదిలిపెట్టి వెళ్లను. 

► నేను బయటి నుంచి వచ్చాను. అలా బయటి నుంచి వచ్చిన వారి కోసం నేను ప్రొడక్షన్ కంపెనీ పెట్టాను. కొత్త వారిని ఎంకరేజ్ చేద్దామని అనుకున్నాను. తెలుగులో కూడా కొంత మంది యంగ్ దర్శకులతో సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాను. ఎంబీఏ చదివి మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాను. శంకర్ గారి సినిమాతో హీరో అయ్యాను. అయితే నేను సంపాదించిన వాటిల్లోంచి నిర్మించాను. నేను నిర్మించిన ప్రతీ ఒక్కటి కూడా లాభాలను తెచ్చిపెట్టింది. అలా ప్రాఫిట్ రాకపోతే మా నాన్న కూడా ఊరుకోరు.

► నేను ‘మా’లో లైఫ్ టైం మెంబర్‌ను. ఆహూతి గారు ఉన్న సమయంలోనే మెంబ‌ర్‌షిప్ తీసుకున్నాను. ‘మా’ ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తున్నాను. అన్నీ కూడా ఫాలో అవుతున్నాను. నేను కచ్చితంగా అందరి మాటలు విని.. నా మనసులో ఏమనిపిస్తుందో.. వారికే ఓటు వేస్తాను. ఎప్పుడూ నిజం మాట్లాడాలి. నిజాయితీగా ఉండాలని అనుకుంటాను. దాని వల్ల ఎలాంటి పరిణామాలు వచ్చినా ఎదుర్కోవాలి. నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. రాజకీయాల్లోకి రాను అని చెప్పను. కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

మరిన్ని వార్తలు