‘పాగల్‌’స్టోరీ రివీల్‌ చేసిన విశ్వక్‌ సేన్‌.. అమ్మ సెంటిమెంట్‌ అదుర్స్‌

12 Aug, 2021 09:14 IST|Sakshi

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పాగల్‌’.నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. విశ్వక్‌సేన్‌కు జోడీగా . నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. భూమిక, సిమ్రన్‌ చౌదరి, మేఘాలేఖ, రాహుల్‌ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్ట్‌ 14న థియేటర్లలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. ‘పాగల్‌’స్టోరీ ఏంటో చెప్పేశాడు. 

‘ఈ సినిమా కథ మీకు చెప్తా.. ప్రేమ్ అనే బాలుడికి తన తల్లి తప్ప వేరే వాళ్లు ఎవరూ ఉండరు. ఆమే వాడికి అన్నీ. ఒకరోజు వాడు రాత్రి మొత్తం మేల్కొని అమ్మ పెయింటింగ్ వేస్తాడు. ‘ఎందుకు నాన్నా రాత్రి మొత్తం నా బొమ్మనే వేస్తూ ఉన్నావ్’ అని ఆ తల్లి అడిగితే.. ‘నీ అంత బాగా నన్ను ఎవరూ చూసుకోరు కదమ్మా’ అని అంటాడు. కానీ ఆ తల్లికి తెలుసు.. మరో రెండునెలల్లో ఆమె చనిపోతున్నట్టు. అందుకే ఆమె ఆ కొడుకుతో చెప్తుందీ.. మనం ఎవర్ని ప్రేమించినా తిరిగి ప్రేమిస్తారు.. నువ్ అన్ కండిషనల్‌గా ప్రేమించు అని చెప్తుంది. అలా చెప్పిన కొన్నిరోజుల తరువాత ఆ తల్లి చనిపోతుంది.

అప్పుడు వాడు ఒంటరి వాడు అవుతాడు. తల్లి ఉండదు. ఆ టైంలో వాడికి తన తల్లి చెప్పింది మాత్రమే గుర్తుకువస్తుంది. నువ్ అందర్నీ ప్రేమించు.. ఎక్కడో చోట నేను దొరుకుతా అని చెప్పిన మాటను గుర్తించుకుని వాడు.. తన తల్లి ప్రేమను వెతుక్కుంటూ మొదలుపెట్టిన జర్నీనే ఈ పాగల్. ఆ తరువాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా’అని విశ్వక్‌ సేన్‌ చెప్పాడు.

మరిన్ని వార్తలు