నవ్విస్తూ...భయపెడుతూ..

7 Jan, 2024 01:39 IST|Sakshi
శ్రీనివాస్‌ రెడ్డి, కోన వెంకట్, అంజలి, శివ తుర్లపాటి

అంజలి టైటిల్‌ రోల్‌ చేసిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్‌. శ్రీనివాస్‌ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రచయిత–నిర్మాత కోన వెంకట్‌ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంతా ఒక ఎత్తైతే.. క్లైమాక్స్‌ మరో రేంజ్‌లో ఉంటుంది. ‘గీతాంజలి’ని ఫ్రాంచైజీగా చేస్తూ, కోనగారు ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశారు.

కోనగారి కామెడీ ట్రాక్, ఈ సినిమాను ఆయన డిజైన్‌ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు శివగారికి ఈ సినిమాతో పెద్ద బ్రేక్‌ వస్తుంది’’ అన్నారు. ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’’ని అమెరికాలో చేద్దామనుకున్నాం. కొన్ని ్రపాక్టికల్‌ కారణాల వల్ల ఊటీ బ్యాక్‌డ్రాప్‌కి మార్చాం. ప్రేక్షకులు వారి అంచనాలకు మించి ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు కోన వెంకట్‌. ‘‘ప్రేక్షకులను భయపెడుతూ, నవ్విస్తూ ఎంజాయ్‌ చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్‌ రెడ్డి. ‘‘బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘గీతాంజలి’కి సీక్వెల్‌ చేసే అవకాశాన్ని కల్పించిన కోనగారికి, ఎంవీవీగారికి థాంక్స్‌’’ అన్నారు శివ తుర్లపాటి. నటుడు రవికృష్ణ, ఎడిటర్‌ చోటా కె. ప్రసాద్, సినిమాటోగ్రాఫర్‌ సుజాత సిద్ధార్థ్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ లక్కరాజు మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు