Heroines In Web Series: వెబ్‌ సిరీస్‌లలోకి అడుగు పెట్టిన హీరోయిన్లు వీళ్లే..

25 Dec, 2021 07:55 IST|Sakshi

Heroines Who Has Entry In Web Series: కరోనా కారణంగా స్టార్స్‌కి వెబ్‌ వరల్డ్‌ మంచి హబ్‌ అయింది. బిగ్‌స్క్రీన్‌పై తారలు కనిపించని లోటుని వెబ్‌ సిరీస్‌లు కొంతవరకు తీర్చాయి. ఈ ఏడాది కొందరు స్టార్‌ హీరోయిన్లు తొలిసారి ఓటీటీలో సందడి చేశారు. హబ్‌బ్బబ్బా.. వెబ్‌బ్బబ్బా.. మన తారలను చూసే అవకాశం దొరికిందబ్బా అంటూ అభిమానులు ఆనందపడ్డారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడినప్పుడు ఈ వెబ్‌ సిరీస్‌లే ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌. పైగా స్టార్స్‌ చేయడంవల్ల ఈ సిరీస్‌లు బోలెడంత క్రేజ్‌ కూడా తెచ్చుకోగలిగాయి. ఆ క్రేజ్‌ని స్టార్స్‌ బాగానే క్యాష్‌ చేసుకున్నారు. మరి.. వెబ్‌ ఉండగానే హౌస్‌ని చక్కబెట్టుకోవాలి కదా. అలా చక్కదిద్దుకున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా !

కాలేజీ అమ్మాయి, ఉద్యోగిని, భార్య.. ఇలా ఎన్నో రకాల పాత్రల్లో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించింది సమంత. ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లోనూ మెరిసింది. సిల్వర్‌ స్క్రీన్‌ సమంతలోని పాజిటివ్‌ యాంగిల్‌ని చూపిస్తే డిజిటల్‌ వరల్డ్‌ నెగెటివ్‌ యాంగిల్‌ని బయటికి తీసింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2’ వెబ్‌ సిరీస్‌లో నెగెటివ్‌ షేడ్‌లో కనిపించింది సమంత. వెబ్‌ ఎంట్రీతోనే ఎల్‌టీటీఈకి పనిచేసే రాజ్యలక్ష్మీ పాత్రను ధైర్యంగా ఒప్పుకున్నారామె. అయితే ఈ పాత్ర కొంచెం వివాదంగా మారింది. కానీ ‘ది ఫ్యామిలీమ్యాన్‌  సీజన్‌ 2’ స్ట్రీమింగ్‌ స్టార్ట్‌ అయ్యాక రాజ్యలక్ష్మీగా సమంత నటన అందర్నీ మెప్పించింది. సమంత పాత్రను చుట్టుముట్టిన వివాదాలు సిరీస్‌ విడుదలయ్యాక సమసిపోయి ప్రసంశలుగా మారాయి. 

ఇక మరో టాప్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘లైవ్‌ టెలీక్యాస్ట్‌’పై అప్పట్లో వెబ్‌ వ్యూయర్స్‌ ఆసక్తి కనబరిచారు. కానీ వీరి అంచనాలను ఈ సిరీస్‌ అందుకోలేకపోయింది. ఇందులో జెన్నీఫర్‌ మాథ్యూ పాత్రలో కనిపిస్తుంది కాజల్‌. హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ ‘లైవ్‌ టెలీకాస్ట్‌’కు సరైన వ్యూయర్‌షిప్‌ లభించలేదు. ఈ వెబ్‌ సిరీస్‌ ఎగ్జిక్యూషన్‌లో ఏవో పొరపాట్లు చోటు చేసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నట్లుగా కాజల్‌ ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తెలిపింది. మరో స్టార్‌ తమన్నా అయితే ఈ ఏడాది రెండు వెబ్‌ సిరీస్‌లు ‘లెవన్త్‌ అవర్‌’, ‘నవంబరు స్టోరీస్‌’ చేసింది. కేవలం వెబ్‌ సిరీస్‌ల్లో మాత్రమే కాదు.. తెలుగు బుల్లితెరపై తొలిసారి హోస్ట్‌గా కనిపించింది తమన్నా. ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న ‘మాస్టర్‌ చెఫ్‌’ షోకు తమన్నా హోస్ట్‌గా కనిపించింది. అయితే అనుకోని కారణాల వల్ల తమన్నా ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. 

అలాగే తెలుగు వెబ్‌ సిరీస్‌ ‘త్రీ రోజెస్‌’తో ఈ ఏడాది వెబ్‌లోకి తొంగిచూశారు పాయల్‌ రాజ్‌పుత్, పూర్ణ, ఈషా రెబ్బా. ఇదే ఏడాది వచ్చిన ‘పిట్టకథలు’ ఆంథాలజీలోనూ ఈషా రెబ్బా మెరిసింది. ఇక ఇదే ‘పిట్టకథలు’లోని ఓ కథలో కనిపించిన అమలా పాల్‌ ఆ తర్వాత తెలుగు వెబ్‌ సిరీస్‌ ‘కుడి ఎడమైతే’తో ఆకట్టుకుంది. ఇదే ఆంథాలజీలో మెరిసిన టాప్‌ హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ ఇటీవల ఓ హిందీ వెబ్‌ సిరీస్‌కు సైన్‌ చేసిందట. కాగా మణిరత్నం నిర్మించిన ఆంథాలజీ ‘నవరస’లో ఓ రోల్‌ చేసింది అంజలి. వీరితోపాటు మరికొందరు హీరోయిన్లు వెబ్‌ వరల్డ్‌లోకి అడుగుపెట్టారు.

సమంత, కాజల్, తమన్నాల కన్నా కాస్త లేట్‌గా వెబ్‌లోకి ఎంటరయింది త్రిష. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ‘బ్రిందా’కు సైన్‌ చేసింది. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోంది. ఇక ఆల్రెడీ ఒకేసారి రెండు వెబ్‌ సిరీస్‌లను పూర్తి చేసిన మరో హీరోయిన్‌ రాశీ ఖన్నా. అజయ్‌ దేవగన్‌ ‘రుద్ర’, షాహిద్‌ కపూర్‌ ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) వెబ్‌ సిరీస్‌లలో తన వంతు షూటింగ్‌ను రాశీ ఖన్నా పూర్తి చేసింది. హిందీ వెబ్‌ వరల్డ్‌లో హీరోయిన్‌ రెజీనా చేసిన తొలి సిరీస్‌ ‘రాకెట్‌ బాయ్స్‌’. ఇందులో మృణాళినీ సారాభాయ్‌గా కనిపిస్తుంది రెజీనా. ఇటు ‘సన్నీ’ వెబ్‌ సిరీస్‌లోనూ రెజీనా ఓ లీడ్‌ చేసింది. హీరో నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్న ‘మీట్‌ క్యూట్‌’ ఆంథాలజీలో అదా శర్మ, ఆకాంక్షా సింగ్, రుహానీ శర్మ నటిస్తున్నారు.  

ఇదీ చదవండి: మాస్ సాంగ్‌తో 'బంగార్రాజు' షూటింగ్‌ పూర్తి.. నాగార్జున ట్వీట్‌

మరిన్ని వార్తలు