‘డీ గ్లామరస్‌’ హీరోయిన్లు.. దేనికైనా రెడీ

31 Dec, 2021 05:10 IST|Sakshi

హీరోయిన్‌  అంటే అమాయకంగా ఉండి..  హీరో ఏడిపిస్తే ఉడుక్కుని.. నాలుగు పాటల్లో స్టెప్పులేసి... ఎండ్‌ కార్డులో గ్రూపు ఫొటోలో కనిపించే రోజులు పోయాయి. ‘గ్లామరస్‌ హీరోయిన్‌’ అనిపించుకున్న నాయికలు ‘డీ గ్లామరస్‌’గా కనిపిస్తున్న రోజులు ఇవి. క్యారెక్టర్‌ కోసం క్యారెక్టర్‌కి తగినట్లుగా కనబడుతున్నారు. 2021లో తెరపై నాయికల క్యారెక్టర్‌ కనబడింది.

ఆ క్యారెక్టర్స్‌ని చూద్దాం.
‘పరేశానురా.. పరేశానురా.. ప్రేమన్నదే పరేశానురా’.. అంటూ ‘ధృవ’లో మెరుపు తీగలా కనిపించిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని చూసి యూత్‌ పరేశాన్‌ అయ్యారు. కెరీర్‌ ఆరంభించిన ఏడేళ్లల్లో రకుల్‌ చేసినవన్నీ గ్లామరస్‌ రోల్సే కాబట్టి ‘గ్లామరస్‌ హీరోయిన్‌’ అనే స్టాంప్‌ బలంగా పడిపోయింది. అయితే అందుకు భిన్నంగా ‘కొండపొలం’లో గొర్రెల కాపరి ఓబులమ్మగా కనిపించారామె. ఈ అమ్మాయి ఎప్పుడూ గ్లామర్‌ పాత్రలే చేస్తుందేంటి? అనే ముద్రను ఓబులమ్మ చెరిపేయగలుగుతుందని  రకుల్‌ నమ్మారు.

ఆ నమ్మకం నిజమైంది. రకుల్‌ కంటే సీనియర్‌ అయిన ప్రియమణి ఖాతాలో కూడా గ్లామరస్‌ క్యారెక్టర్లు చాలానే ఉన్నాయి. అయితే ‘నారప్ప’లో సుందరమ్మగా నల్లని మేకప్‌తో ఆకట్టుకున్నారు ప్రియమణి. మరోవైపు హీరోయిన్‌గా దూసుకెళుతున్న రష్మికా మందన్నా కూడా గ్లామర్‌ ఇమేజ్‌కి దూరంగా వెళ్లడానికి వెనకాడలేదు. ఇటీవల రిలీజైన ‘పుష్ప’లో ‘సామీ.. సామీ’ అంటూ అసలు సిసలైన పల్లె పిల్లలా కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచారీ బ్యూటీ.

 గ్లామర్‌ ఇమేజ్‌ ఉన్న స్టార్‌ హీరోయిన్లకు రచయితలు డీ–గ్లామరస్‌ రోల్స్‌ రాయడం, ఆ పాత్రలను సవాల్‌గా తీసుకుని నాయికలు ఒప్పుకోవడం అనేది మంచి మార్పు. మంచి మార్పు ఎప్పుడూ ఆహ్వానించదగ్గదే. 2022లోనూ తారల ‘క్యారెక్టర్‌ కనబడే’ పాత్రలు మరిన్ని వస్తున్నాయి.

2022లోనూ...
2021లో ‘నారప్ప’లో సుందరమ్మగా కనిపించిన ప్రియమణి ‘విరాటపర్వం’లో నక్సలైట్‌గా కనిపించనున్నారు. అడవిలో ఉండేవాళ్లు ఎలా ఉంటారు? కమిలిపోయిన చర్మంతో, ఎర్రబారిన జుత్తుతో.. ఈ సినిమాలో ప్రియమణి ఇలానే కనిపించనున్నారు. ఇదే సినిమాలో మరో సీనియర్‌ తార, దాదాపు డీ–గ్లామరస్‌ రోల్స్‌ చేసే నందితా దాస్‌ కూడా నక్సలైట్‌గా కనిపించనున్నారు. ఇక నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్‌ అంటే సాయిపల్లవి డేట్స్‌ ఉన్నాయేమో కనుక్కోండి అంటుంది ఇండస్ట్రీ.

సాయిపల్లవి మీద గ్లామరస్‌ హీరోయిన్‌ అనే ముద్ర లేదు. అయితే ఇప్పటివరకూ కనిపించినదానికన్నా కాస్త డిఫరెంట్‌గా ‘విరాటపర్వం’లో కనిపించనున్నారామె. నిజానికి 2021లోనే ‘విరాటపర్వం’ విడుదల కావాలి. కానీ కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. ఇక నటనకు అవకాశం ఉన్న పాత్ర, ఫుల్‌ ట్రెడిషనల్‌గా కనిపించే పాత్ర అంటే మహానటికి ఫోన్‌ వెళుతుంది. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో అంత అద్భుతంగా ఒదిగిపోయారు కీర్తీ సురేష్‌. కీర్తికి గ్లామరస్‌ హీరోయిన్‌ ట్యాగ్‌ లేదు. అయితే ఇప్పటివరకూ కనిపించని విధంగా తమిళ సినిమా ‘సాని కాయిదమ్‌’లో కనిపించనున్నారామె. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది.
 

మరిన్ని వార్తలు