Hi Nanna Review: ‘హాయ్‌ నాన్న’ మూవీ రివ్యూ

7 Dec, 2023 07:41 IST|Sakshi
Rating:  

టైటిల్‌: హాయ్‌ నాన్న 
నటీనటులు: నాని, మృనాల్‌ ఠాకూర్‌, బీబీ కియారా ఖన్నా, అంగద్ బేడీ, జయరామ్‌, ప్రియదర్శి, విరాజ్‌ అశ్విన్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత: మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల
రచన-దర్శకత్వం: శౌర్యువ్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: సాను జాన్‌ వర్గీస్‌
ఎడిటర్‌: ప్రవీణ్‌ ఆంథోనీ
విడుదల తేది: డిసెంబర్‌ 7, 2023

కథేంటంటే..
ముంబైకి చెందిన విరాజ్‌(నాని) ఓ ఫ్యాషన్‌ ఫోటోగ్రాఫర్‌. తనకు కూతురు మహి(బేబీ కియారా ఖన్నా)అంటే ప్రాణం. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడతున్న మహికి అన్నీ తానై చూసుకుంటాడు. సింగిల్‌ పేరెంట్‌గా ఉన్నప్పటికీ కూతురుకి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్త పడతాడు. ప్రతి రోజు రాత్రి కూతురికి సరదాగా కథలు చెప్పడం విరాజ్‌కి అలావాటు. ఆ కథల్లోని హీరో పాత్రని నాన్నతో పోల్చుకోవడం మహికి అలవాటు. ఓ సారి అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్‌ ఫస్ట్‌ వస్తే చెప్తానని ప్రామిస్‌ చేస్తాడు నాన్న విరాజ్‌. అమ్మ కథ కోసం నెలంతా కష్టపడి చదివి క్లాస్‌ ఫస్ట్‌ వస్తుంది. తర్వాత కథ చెప్పమని నాన్నని అడిగితే.. చిరాకు పడతాడు. దీంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది.

రోడ్డుపై ప్రమాదం నుంచి కాపాడిన యష్ణతో మహికి స్నేహం కుదురుతుంది. ఇద్దరూ ఓ కాఫీ షాప్‌లోకి వెళ్లి విరాజ్‌కి కాల్‌ చేస్తాడు. విరాజ్‌ కూడా అక్కడికి రాగానే అమ్మ కథ చెప్పమని అడుగుతారు. కూతురు మారం చేయడంతో అమ్మ కథను చెబుతాడు. ఈ కథలో అమ్మ వర్షని యష్ణగా ఊహించుకుంటుంది మహి. అసలు వర్ష ఎవరు? విరాజ్‌-వర్షల లవ్‌స్టోరీ ఏంటి? విరాజ్‌ సింగిల్‌ పేరెంట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? వర్షకి యష్ణకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? డాక్టర్ అరవింద్‌ (అంగద్ బేడీ)తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న యష్ణ..విరాజ్‌తో ప్రేమలో ఎలా పడింది? ఆ ప్రేమ నిలబడిందా? అరుదైన వ్యాధిని మహి జయించిందా? లేదా? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్‌లో ‘హాయ్‌ నాన్న’సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
అమ్మ గురించి నాన్న తన కూతురుకి చెప్పే గొప్ప ప్రేమ కథ ఇది.  ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం..గొడవపడి విడిపోవడం..చివరకు కలిసిపోవడం.. ఇలాంటి కథాంశంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘ఖుషి’ నేపథ్యం కూడా ఇదే. కానీ హాయ్‌ నాన్నలో ప్రత్యేకత ఏంటంటే.. లవ్‌స్టోరీలోని ట్విస్టులు కొత్తగా ఉంటాయి.  అమ్మ పాత్రని దర్శకుడు మలిచిన తీరు సినిమాను నిలబెట్టింది. హీరో హీరోయిన్ల మానసిక సంఘర్షణ హృదయాలను హత్తుకుంటాయి.

తండ్రి కూతుళ్ల బాండింగ్‌ని తొలి సీన్‌లోనే చూపిస్తూ చాలా ఎమోషనల్‌గా కథను ప్రారంభించాడు దర్శకుడు. మహి తన తల్లిగా యష్ణని ఊహించుకున్నప్పటి నుంచి  ప్రేమకథ మొదలవుతుంది. విరాజ్‌, వర్షల పరిచయం.. ప్రేమ.. పెళ్లి...ఇవన్నీ రొటీన్‌గా అనిపిస్తున్నాయి. కథనం నెమ్మదిగా సాగడం కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఒక్కసారి ట్విస్ట్‌ రివీల్‌ అయ్యాక.. గుండె బరువెక్కుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ ద్వితియార్థంపై ఆసక్తి పెంచుతుంది. 

సెకండాఫ్‌లో భావోద్వేగాలు మరింత బలంగా రాసుకున్నాడు దర్శకుడు. కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపించినా.. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు. సన్నీవేశాలతో కాకుండా సంభాషణలతో కూడా ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురి చేశాడు. ‘నువ్వు నిజమైన అమ్మకి కాదు’ అని చిన్నారి చెప్పడం..  ‘ఎక్కడ తప్పు చేశాను.. నా ప్రేమ సరిపోవడం లేదా’ అని హీరో కూతురితో అనడం..  ‘నేను దాచుకున్న నిజం నా కూతురుకి చెప్పావు.. నువ్వు దాచిన నిజం నీ కూతురుతో చెప్పనా?’అని హీరోయిన్‌ తల్లితో నాని అనడం.. ప్రతిదీ గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్‌లో జయరామ్‌ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది.  కథనం నిదానంగా సాగినప్పటికీ.. కొన్ని ట్విస్టులు.. ప్రధాన పాత్రలు పండించిన భావోద్వేగాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 

ఎవరెలా చేశారంటే..
నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన సహజ నటనతో ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు.  ఈ చిత్రంలోని విరాజ్‌ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బాధ్యతగల తండ్రిగా, ప్రియుడిగా, భర్తగా..ఇలా పలు వేరియేషన్స్‌ ఉన్న పాత్ర తనది. చిన్నారితో కలిసి ఆయన పండించిన భావోద్వేగాలు సినిమాకు హైలెట్‌. ‘సీతారామం’ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. యష్ణగా, కథలో వర్షగా రెండూ పాత్రల్లోనూ చక్కగా నటించింది.  ఎమోషనల్‌ సన్నీవేశాల్లో జీవించేసింది.

ఇక ఈ చిత్రంలో మహి పాత్రను పోషించిన చిన్నారి కియార ఖన్నా నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెరపై ముద్దు ముద్దుగా కనిపిస్తూనే తనదైన నటనతో ఏడిపించేసింది.  హీరో స్నేహితుడిగా ప్రియదర్శి తన పాత్ర పరిధిమేర నటించాడు. జయరామ్‌ రొటీన్‌ తండ్రి పాత్రలో కనిపించినా..క్లైమాక్స్‌లో అతనిచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. 

అంగద్ బేడీ ఒకటి రెండు సన్నీవేశాల్లో కనిపించినా.. ఎమోషనల్‌గా కనెక్ట్‌  అవుతారు. నాజర్‌, విరాజ్‌ అశ్విన్‌తో పాటు మిలిగిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.  సాంకేతికపరంగా సినిమా చాలా బాగుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. పాటలు పర్వాలేదు. వర్గీస్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ చాలా రిచ్‌గా చూపించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3/5)
>
మరిన్ని వార్తలు