Hidimba Review: ‘హిడింబ’ మూవీ రివ్యూ

20 Jul, 2023 08:51 IST|Sakshi
Rating:  

టైటిల్‌: హిడింబ
నటీనటులు: అశ్విన్‌ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్‌ స్వరూప్‌, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్‌, రఘు కుంచె తదితరులు
నిర్మాత: గంగపట్నం శ్రీధర్‌
సమర్పణ: అనిల్‌ సుంకర
దర్శకత్వం: అనిల్‌ కన్నెగంటి
విడుదల తేది: జులై 20, 2023

కథేంటంటే..
హైదరాబాద్‌లో వరుగా అమ్మాయిలు కిడ్నాప్‌కు గురవుతుంటారు. దాదాపు 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్‌ ఆద్య(నందితా శ్వేతా)ను నగరానికి రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అభయ్‌(అశ్విన్‌ బాబు)తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కాలాబండలోని బోయ(రాజీవ్‌ పిళ్ళై) అనే కరుడుగట్టిన రౌడీ గురించి తెలుస్తుంది. ఆభయ్‌ రిస్క్‌ చేసి మరీ కాలాబండలో బందీగా ఉన్న అమ్మాయిలను విడిపిస్తాడు. అయినప్పటికీ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. మరి అమ్మాయిలను కిడ్నాప్‌ చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? రెడ్‌ డ్రెస్‌ వేసుకున్న యువతులను మాత్రమే ఎందుకు కిడ్నాప్‌ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్‌ దీవుల్లో ఉన్న గిరిజన తెగ హిడింబాలకు సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
ఎలాంటి కథ అయినా ప్రేక్షకులకు అర్థమయ్యేలా, వారు ఆ కథలో ప్రయాణించేలా చేస్తేనే ఆ చిత్రాన్ని ఆదరిస్తారు. లేదంటే ఎంత గొప్ప కథ అయినా, ఎంత క్రియేటివ్‌గా చూపించినా వారికి అర్థం కాకపోతే అంతే సంగతి. ‘హిడింబ’లో ఆ పొరపాటే జరిగింది. వాస్తవానికి ఈ మూవీ కాన్సెప్ట్‌ చాలా కొత్తది. తెలుగు తెరపై ఇంతవరకు రానటువంటి కథను చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దర్శకుడి తప్పిదమే లేదా ఎడిటింగ్‌ లోపమో తెలియదు కానీ ఈ చిత్రం ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తుంది. నాన్‌ లినియర్‌ స్క్రీన్‌ప్లేతో(ఒక సీన్‌ వర్తమానంలో నడుస్తుంటే..మరొక సీన్‌ గతంలో సాగుతుంటుంది) కాస్త డిఫరెంట్‌గా ఈ కథను చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులను థ్రిల్‌ చేయడానికి దర్శకుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడేమో కానీ అది వర్కౌట్‌ కాకపోవడమే కాకుండా ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తుంది.  

నగరంలో వరుస కిడ్నాపులు జరగడం, ఆ కేసును ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో వాళ్లకు కొన్ని సవాళ్లు  ఎదురు కావడం, చివరకు ఆ కేసును చేధించడం ఇలా రెగ్యులర్‌ ఇన్వెస్టిగేషన్‌ తరహాలో ఫస్టాఫ్‌ సాగుతుంది. కాలబండాలో బోయ ముఠాలో హీరో చేసే ఫైట్‌ సీన్‌ ఆకట్టకుంటుంది. అలాగే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్‌ సాంగ్‌ చూడడానికి బాగుంటుంది కానీ సాఫీగా సాగుతున్న కథకి అడ్డంకిగా అనిపిస్తుంది.

ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లో ఉంటుంది. హిడింబ తెగకు సంబంధించిన నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది. నగరంలో జరుగుతున్న కిడ్నాపులకు, హిడింబ తెగకు సంబంధం ఉండడం.. చివర్లో వచ్చే ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ప్రేక్షకులను ధ్రిల​్‌కు గురిచేస్తుంది. అయితే దర్శకుడు చాలా చోట్ల సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నాడు. పోలీసులు పెద్దగా కష్టపడకుండానే కిడ్నాప్‌కు సంబంధించిన క్లూలు లభించడం, నగరం దాటి వెళ్లొద్దని ఆద్యకు డీజీపీ చెప్పినా.. ఆమె కేరళ వెళ్లడం, ఇలా చెప్పుకుంటూ చాలా సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. స్క్రీన్‌ప్లే మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. 

ఎవరెలా చేశారంటే.. 
పోలీసు అధికారి అభయ్‌ పాత్రకు అశ్విన్‌ బాబు న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలో అశ్విన్‌ చాలా మెరుగుపరుచుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌ స్టార్‌ హీరోలకు తగ్గకుండా చేశాడు. క్లైమాక్స్‌లో అతని నటన అద్భుతంగా ఉంటుంది. ఐపీఎస్‌ అధికారి ఆద్యగా నందితా శ్వేతా తనదైన నటనతో మెప్పించింది. హీరోతో సమానమైన పాత్ర తనది. మకరంద్‌ దేశ్‌ పాండే పాత్ర ఈ సినిమాకు చాలా ప్లస్‌. ఆ పాత్రలో ఆయనను తప్పా మరొకరిని ఊహించుకోలేం.  రఘు కుంచె, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం వికాస్‌ బాడిస సంగీతం. తనదైన బీజీఎంతో ప్రేక్షకులను భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది.  నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2/5)
మరిన్ని వార్తలు