Salman Khan Defamation Case: సల్మాన్ ఖాన్ పరువు నష్టం కేసు.. తీర్పు రిజర్వ్‌లో ఉంచిన న్యాయస్థానం

12 Oct, 2022 17:31 IST|Sakshi

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో  ముంబై సిటీ సివిల్ తీర్పును సవాల్‌ చేస్తూ సల్మాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ముంబైలోని పన్వేల్‌లో ఉన్న సల్మాన్ ఫామ్‌హౌస్‌లో సినీనటుల శవాలు ఖననం చేశారంటూ ఎన్‌ఆర్‌ఐ కేతన్ కక్కడ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల పరువునష్టం దావా వేశారు బాలీవుడ్ హీరో.  

కేతన్ కక్కడ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలను తొలగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మార్చిలో సల్మాన్ ఖాన్ ముంబై సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సల్మాన్ ఖాన్ పిటిషన్‌పై  మంగళవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.  

విచారణ సందర్భంగా సల్మాన్ ఖాన్ తరఫున న్యాయవాదులు హైకోర్టు ధర్మాసనానికి వాదనలు వినిపించారు. కక్కడ్‌ అప్‌లోడ్ చేసిన వీడియోలు పరువునష్టం కలిగించడమే కాదు.. ‍అవమానకరంగా ఉన్నాయని తెలిపారు. ఇవీ మతపరమైన ఘర్షణలు రెచ్చగొట్టేలా ఉన్నాయని న్యాయస్థానానికి వివరించారు. దీనిపై కక్కడ్ తరఫున వాదిస్తూ పన్వేల్‌లోని  భూమి కోసం పోరాటాన్ని విరమించుకోవాలని ఒత్తిడి పెంచేందుకే సల్మాన్ ఖాన్ పరువు నష్టం కేసు దాఖలు చేశారని ధర్మాసనానికి తెలిపారు. కాగా.. సల్మాన్‌కు పన్వేల్‌లో 100 ఎకరాల పొలం ఉండగా.. దాని పక్కనే కేతన్‌ కక్కడ్‌ చెందిన ఆస్తులు ఉన్నాయి.   

మరిన్ని వార్తలు