HIT 2 Review: ‘హిట్ 2’ రివ్యూ

2 Dec, 2022 12:28 IST|Sakshi
Rating:  

టైటిల్‌: హిట్ 2: ద సెకండ్ కేసు
నటీనటులు: అడివి శేష్‌, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్‌, రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్‌ మాగంటి తదితరులు
నిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమా 
నిర్మాతలు: నాని,  ప్రశాంతి త్రిపిర్‌నేని
దర్శకత్వం: శైలేష్ కొలను 
నేపథ్య సంగీతం: జాన్ స్టీవార్ట్ ఏడూరి
స్వరాలు : ఎం.ఎం. శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ:  ఎస్.మణికందన్
ఎడిటర్: . గ్యారీ బి.హెచ్
విడుదల తేది: డిసెంబర్‌ 2, 2022

నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్‌’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో.. ఆ ఫ్రాంచైజీలో వరుస సినిమాలు తీయాలని నాని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు హిట్ సెకండ్ కేస్ పార్ట్‌ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో అడివి శేష్ హీరోగా నటించాడు.  ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘హిట్‌ 2’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

హిట్‌-2 కథేంటంటే..
కేడీ అలియాస్‌ కృష్ణదేవ్‌  వైజాగ్‌ ఎస్పీ. మర్డర్‌ కేసులను ఈజీగా సాల్వ్‌ చేస్తుంటాడు. ఆర్య(మీనాక్షి చౌదరి) అతని ప్రియురాలు. వీరిద్దరు సహజీవనం కొనసాగిస్తుంటారు. ఓ రోజు నగరంలో సంజన అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. తల, మొండెం, కాళ్లు, చేతులు వేరు వేరుగా చేసి అతి కిరాతంగా చంపేస్తాడు ఓ సీరియల్‌ కిల్లర్‌. అయితే అక్కడ ఉన్న వాటిలో తల మాత్రమే సంజనాది అని, మిగతా భాగాలన్ని మరో ముగ్గురు అమ్మాయిలవి అని ఫోరెన్సిక్‌ టెస్ట్‌లో తెలుస్తుంది. ఈ కేసును కేడీ ఎలా చేధించాడు? ఆయనకు ఎదురైన సమస్యలేంటి?  సీరియల్‌ కిల్లర్‌ ఆర్యని కూడా చంపేందుకు ఎందుకు ప్రయత్నించాడు? వరుసగా యువతులనే చంపడానికి కారణమేంటి? విచారణ క్రమంలో రామ్‌దాస్‌ (హర్షవర్థన్‌) గురించి తెలుసుకున్నది ఏంటి?  చివరకు ఆ సిరియల్‌ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడం కత్తిమీద సాము లాంటింది. ఒక్కసారి ట్విస్ట్‌ తెలిస్తే.. సినిమాపై ఆసక్తి పోతుంది. అలా అని ట్విస్ట్‌ చెప్పకుండా ఉంటే ఎంగేజ్‌ చేద్దామంటే.. కథనం ఆసక్తికరంగా సాగాలి. ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాలి. అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉండాలి.  అలా అయితే ఆ సినిమా విజయం సాధిస్తుంది. హిట్‌ విషయంలో దర్శకుడు కైలాష్‌  అదే పని చేశాడు. హత్య చేసింది ఎవరనేది చివరివరకు చెప్పకుండా సస్పెన్స్‌ కొనసాగించాడు.  

కానీ హిట్‌ 2లో హత్య చేసింది సీరియల్‌ కిల్లర్‌ అనే ముందే చెప్పారు.  అతను ఎవరు?  ఎందుకు అమ్మాయిలనే చంపుతున్నారనేది సస్పెన్స్‌గా పెట్టారు. ఫస్టాఫ్‌ అంతా  సింపుల్‌గా కొనసాగుతుంది. కేడీ, ఆర్యల రొమాన్స్‌.. మధ్యలో కేసు విచారణ.. ఈక్రమంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా సింపుల్‌గా ఉంటుంది. సెకండాఫ్‌ నుంచి కథ పరుగులు తీస్తుంది.

సీరియల్‌ కిల్లర్‌ గురించి ఆరా తీయడం.. ఈ క్రమంలో అతని ఫ్లాష్‌బ్యాక్‌ తెలియడం.. చివరకు మంచి వాడు అనుకున్న వ్యక్తే కిల్లర్‌ అని తెలియడం..ఇలా సెకండాఫ్‌ సాగుతుంది. ఈ మధ్య కాలంలో సినిమాలతో పాటు వెబ్‌ సీరీస్‌లు కూడా ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లోనే తెరకెక్కుతున్నాయి. అందుకే హిట్‌-2 ప్రేక్షకులను పెద్దగా సస్పెన్స్‌కు గురి చేయదు. 

కేడీ పాత్రలో అడివి శేష్‌ ఒదిగిపోయాడు. ఆయనకు థ్రిల్లర్‌ జానర్స్‌ కొట్టిన పిండి కాబట్టి.. ఈజీగా నటించేశాడు. రొమాన్స్‌ సీన్లలో కూడా బాగా నటించాడు. ఇక ఆర్య పాత్రకి మీనాక్షి చౌదరి న్యాయం చేసింది. మిగితా పాత్రల విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్‌గా శ్రీనాథ్ మాగంటి మరో మంచి పాత్రలో ఆకట్టుకొన్నాడు. పాత్ర నిడివి తక్కువైనా కీలక  సన్నివేశాల్లో తన ప్రజెన్స్‌ను చూపించుకొన్నాడు. వర్షగా కోమలి ప్రసాద్ సినిమా చివరి వరకు మెప్పిస్తుంది. ప్రత్యేక పాత్రలో కలర్‌ ఫోటో హీరో సుహాన్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు., శ్రీకాంత్ అయ్యంగార్, తణికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. నేపథ్య సంగీతం బాగుంది. కెమెరామెన్‌, ఎడిటర్‌ల పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు