ఆ రంగువల్ల నా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది : రాశీ ఖన్నా

18 Mar, 2022 08:10 IST|Sakshi

హోలీ.. రంగోలీ అంటూ జాలీ జాలీగా రంగులతో ఆడుకునే సమయం ఆసన్నమైంది. రంగుల పండగ వేళ జీవితం కలర్‌ఫుల్‌గా ఉండాలని కోరుకుంటూ పండగ చేసుకుంటుంటారు. మరి.. పండగ వేళ అందాల తారలు రాశీ ఖన్నా, నేహా శెట్టి ఏమంటున్నారో చదువుదాం.

ఫస్ట్‌ టైమ్‌ మీరెప్పుడు హోలీ జరుపుకున్నారో గుర్తుందా?  
రాశీ ఖన్నా: చిన్నప్పుడు హోలీ పండగ సమయంలో నేను రూర్కీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లేదాన్ని. ఎందుకంటే మా కజిన్స్‌ చాలామంది అక్కడున్నారు. చాలా సందడిగా ఉండేది. హోలీ అంటే రంగులతో ఆడుకోవడం మాత్రమే కాదు.. స్వీట్లు తినడం, ఇంకా అత్తయ్య చేసే స్పెషల్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ లాగించడం.. ఇవన్నీ జీవితాంతం నాకు గుర్తుండిపోయే మంచి జ్ఞాపకాలు. ఎక్కువమంది కలిసి జరుపుకున్నందున ఓ పెద్ద ఫ్యామిలీ పండగలా అనిపించేది.

నేహా శెట్టి: చిన్నప్పుడు నాకు హోలీ అంటే భయంగా ఉండేది. ఎందుకంటే రంగు పొడి నా కళ్లల్లో పడిపోతుందని భయపడుతుండేదాన్ని. దాంతో నా ఫ్రెండ్స్‌ అందరూ నన్ను ఆటపట్టించేవాళ్లు. ముఖ్యంగా నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు బాగా ఏడిపించారు. దాంతో మొత్తం రంగులన్నింటినీ నా ఒంటి మీద చల్లుకున్నాను. చాలా సరదాగా అనిపించింది.

హోలీ అంటే రంగుల పండగ.. మీకు నచ్చే రంగు? 
రాశీ ఖన్నా: పసుపు రంగుని చాలా ఇష్టపడతాను. ఆ రంగు నాకు సూర్యుణ్ణి గుర్తుకు తెస్తుంది. చాలా ప్రకాశవంతమైన రంగు. ఆనందానికి ప్రతీకలా అనిపిస్తుంది. అలాగే ఓ దృఢమైన నమ్మకాన్ని కలిగించే రంగులా భావిస్తాను.

నేహా శెట్టి: నాకు నీలం రంగు ఇష్టం. అయితే ఆ రంగు ఎందుకు ఇష్టమో నేనెప్పుడూ ఆలోచించలేదు. నా ఆలోచనలు ఆకాశాన్ని దాటి, సముద్రం అంత లోతుగా ఉంటాయి కాబట్టే ఆ కలర్‌ అంటే ఇష్టమేమో! ఆకాశం, సముద్రం నుంచే నీలం రంగు వచ్చిందని నా ఫీలింగ్‌.

మీ లైఫ్‌లో ఇప్పటివరకూ ఉన్న కలర్‌ఫుల్‌ మూమెంట్స్‌ షేర్‌ చేసుకుంటారా? 
రాశీ ఖన్నా: నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ కలర్‌ఫుల్‌ మూమెంట్స్‌ చాలా ఉన్నాయి. సెలవుల్లో ఎలానూ సందడి సందడిగా ఉంటుంది. అవి కాకుండా పుట్టినరోజులు, పండగలు, కుటుంబంలో జరిగే వేడుకలు, ప్లాన్‌ చేసుకుని కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలవడం.. ఇవన్నీ నాకు కలర్‌ఫుల్‌ మూమెంట్సే.

నేహా శెట్టి: ఒక్కో భావోద్వేగానికి ఒక్కో షేడ్‌ ఉంటుంది. మనందరి జీవితం కూడా ఒక ఎమోషనల్‌ రైడ్‌ ద్వారానే సాగుతుంది. అందుకే జీవితమే ఒక కలర్‌ఫుల్‌ జర్నీ అంటాను

మనసు బాగా లేనప్పుడు మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోవడానికి ఎలాంటి రంగు దుస్తులు ధరిస్తారు? 
రాశీ ఖన్నా: ఎరుపు రంగు. రెడ్‌ కలర్‌ డ్రెస్‌ ధరించినప్పుడల్లా నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. అది మాత్రమే కాదు.. ఆ కలర్‌ వల్ల నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయినట్లుగా అనిపిస్తుంది. సో.. నా డల్‌ మూడ్‌ అప్పుడు రెడ్‌ కలర్‌ డ్రెస్‌ మంచి ఆప్షన్‌లా భావిస్తాను.

నేహా శెట్టి: నీలం రంగు ఇష్టం.

రంగు లతో ఆడటం ఇష్టమేనా?  
రాశీ ఖన్నా: ఇష్టమే కానీ నేచురల్‌ కలర్స్‌తో ఆడతాను. కొన్ని బ్యాడ్‌ కలర్స్‌ ముఖం మీద, శరీరం మీద బాగా మరకలు పడేలా చేస్తాయి. అవి ఓ పట్టాన వదలవు. హోలీ ఆడినంతసేపూ బాగానే ఉంటుంది కానీ అవి వదిలించుకునేటప్పుడు మాత్రం కష్టంగా ఉంటుంది. అందుకే నేచురల్‌ కలర్స్‌ వాడతాను.

నేహా శెట్టి: హోలీ కలర్స్‌కి పెద్ద ఫ్యాన్‌ని కాదు. కానీ ఈ పండగ తెచ్చే ఎనర్జీ అంటే ఇష్టం. 

హోలీ సందర్భంగా ఏదైనా సందేశం...  ?
రాశీ ఖన్నా: బ్యాడ్‌ కలర్స్‌ వాడకండి. వాటివల్ల చర్మం పాడవుతుంది. హోలీ ఆడేముందు ఒంటికి నూనె రాసుకోండి. ముఖానికి సన్‌ స్క్రీన్‌ లోషన్‌ రాసుకోండి. అప్పుడు రంగులను తేలికగా వదిలించు కోవచ్చు.

నేహా శెట్టి: సింథటిక్‌ కలర్స్‌కి దూరంగా ఉండండి. ఆర్గానిక్‌ కలర్స్‌ వాడండి. సేఫ్‌గా ఉండండి. హోలీని ఎంజాయ్‌ చేయండి. 

మరిన్ని వార్తలు