Bruce Willis: చికిత్స లేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న దిగ్గజ నటుడు బ్రూస్‌, ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే!

18 Feb, 2023 13:40 IST|Sakshi

చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీనటులు పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొందరు క్యాన్సర్‌ వంటి హెరిడిటి వ్యాధి బారిన పడితే మరికొందరు అసలు చికిత్సే లేని అరుదైన సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో స్టార్‌ హీరోయిన్‌ సమంత, నటి కల్పిక గణేశ్‌, అనుష్క శెట్టితో పాటు పలువురు నటీనటులు ఉన్నారు. తాజాగా మరో దిగ్గజ నటుడు కూడా ఈ జాబితాలో చేరాడు. హాలీవుడ్‌ అగ్ర నటుడుల్లో ఒకరైన బ్రూస్‌ విల్లీస్‌ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.

ఫ్రాంటోటెంపోరల్‌ డెమెన్షియా వ్యాధి బారిన పడినట్లు తాజాగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 67 ఏళ్ల వయసున్న బ్రూస్‌ విల్లీస్‌ గతేడాది అనారోగ్యం కారణంగా నటనకు బ్రేక్‌ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన ఆయన తాజాగా ఫ్రాంటోటెంపోరల్‌ డిమెన్షియా అనే మెదడు సంబంధిత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట. ఈ వ్యాధి బారిన పడినవారిలో పలు మానసికి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే దీనికి చికిత్స లేదని వైద్యులు చెబుతున్నారు.

కాగా ప్రస్తుతం బ్రూస్‌ మానసిక పరిస్థితి బాగానే ఉందని, భవిష్యత్తులో కూడా ఆయన ఆరోగ్యం ఇదే విధంగా కానసాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నామంటూ ఆయన కుటుంబ సభ్యులు ట్వీట్‌ చేశారు. దీంతో ఆయన కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ బ్రూస్‌ సహ నటీనటులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కాగా ‘డై హార్డ్’ సినిమాలతో బ్రూస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. మూన్‌లైటింగ్ అనే టీవీ షో ద్వారా ఆయన బాగా పాపులర్‌ అయ్యాడు. తన కెరీర్‌లో బ్రూస్ ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, రెండు ఎమ్మీ అవార్డులను గెలుపొందారు. 

ఇంతకి ఈ ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే
మెదడు కణాల్లో అసాధారణ రీతిలో ప్రోటీన్లు పేరుకుపోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా మెదడులోని ఫ్రాంటల్, టెంపోరల్ భాగాలు క్రమంగా కుచించుకుపోవడం ప్రారంభిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ.. రోగి ప్రవర్తనలో మార్పులు రావడం, చిరాకు, కోపం, భాషాపరమైన సమస్యలు తలెత్తడం, నడకలో సమతౌల్యం కోల్పోవడం, ఇతర మానసిక సమస్యలు తలెత్తుతాయి. 
 

మరిన్ని వార్తలు