విశాఖలో ఆటా పాటా

30 Nov, 2020 06:37 IST|Sakshi

ఋషి, శిల్పతేజు అనుపోజు, శివ కార్తీక్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘హనీ ట్రాప్‌’. పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో భరద్వాజ్‌ సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌ వి.వి.వామన రావు నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ సందర్భంగా వి.వి. వామన రావు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా కథని సమకూర్చాను. ఋషి, శిల్ప తేజులపై కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలతో పాటు ఎమోషనల్‌ సన్నివేశాలను చిత్రీకరించాం. విశాఖ షెడ్యూల్‌ నేటితో పూర్తవుతుంది.

కథ డిమాండ్‌ మేరకు సునీల్‌గారు అద్భుతమైన లొకేషన్స్‌లో తెరకెక్కిస్తున్నారు. మేము అనుకున్న దానికన్నా సినిమా బాగా వస్తోంది’’ అన్నారు. పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘ఇది ఒక సోషల్‌ థ్రిల్లర్‌ మూవీ. యువతకి నచ్చే అంశాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. భీమిలి, అరకు లాంటి అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. వామనరావుగారు  కథకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు పొందుతారు. డిసెంబర్‌ నుండి హైదరాబాద్‌లో జరిగే రెండో షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తి అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి, కెమెరా: ఎస్‌ వి శివరాం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా