సినిమా షూటింగ్‌లో దారుణం: గుర్రాన్ని చంపేసి... గుట్టుగా పూడ్చేసి 

3 Sep, 2021 08:41 IST|Sakshi

షూటింగ్‌లో పాల్గొన్న వారి సమాచారంతో పెటా ఫిర్యాదు

సినిమా నిర్మాత, గుర్రం యజమానిపై  కేసు  

సాక్షి, హైదరాబాద్‌: యుద్ధం సీన్‌ను భారీగా తీయాలన్న అత్యాశ ఓ గుర్రం ప్రాణం తీసేసింది. సినిమా షూటింగ్‌లో జంతువులను ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిబంధనలు ఉన్నా.. నిర్వాహకుల నిర్లక్ష్యం  ఆ మూగజీవి ప్రాణాన్ని తీసింది. అయితే, గుర్రం చనిపోతే కేసు అవుతుందన్న భయమో... లేక గుర్రమే కదా అన్న నిర్లక్ష్యమోగానీ... గుట్టుచప్పుడు కాకుండా గుర్రాన్ని పూడ్చేసి చేతులు దులుపుకున్నారు సినిమా నిర్వాహకులు. కానీ, షూటింగ్‌లో పాల్గొన్న వారిచ్చిన సమాచారంతో పెటా ప్రతినిధులు  పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాద్‌ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో గత నెల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే సినిమా షూటింగ్‌ జరిగింది. ఈ సినిమాలో యుద్ధం సీన్‌ కోసం 40–50 గుర్రాలను వినియోగించారు. హైదరాబాద్‌కే చెందిన ఓ గుర్రాల యజమాని దగ్గరి నుంచి గుర్రాలను తెప్పించుకున్న నిర్వాహకులు వాటితో ఏకధాటిగా షూటింగ్‌ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ సమూహంలోని ఓ గుర్రం షూటింగ్‌ జరుగుతుండగానే డీహైడ్రేషన్‌ కారణంగా గత నెల 11న చనిపోయింది.

చనిపోయిన గుర్రాన్ని సినిమా నిర్వాహకులు గుంత తీసి పూడ్చేసి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయారు. ఆనోటా ఈనోటా గుర్రం మృత్యువాత పడ్డ విషయం పెటా ప్రతినిధులకు తెలిసింది. దీంతో గత నెల 18న అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌కు వెళ్లి పిటిషన్‌ ఇచ్చారు. పెటా పిటిషన్‌ ఆధారంగా చిత్ర నిర్మాత, గుర్రం యజమానిపై కేసు దర్యాప్తు చేసి విచారణ చేస్తున్నారు. స్థానిక పశువైద్యుడి సహకారంతో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు చనిపోయిన గుర్రానికి పోస్టుమార్టం నిర్వహించారు.

చదవండి: Sidharth Shukla: బిగ్‌బాస్‌ విజేత సిద్ధార్థ్‌ శుక్లా హఠాన్మరణం 

మరిన్ని వార్తలు