యాంటీ కోవిడ్ డ్రగ్స్ సెలబ్రిటీల వద్ద ఎలా ఉన్నాయి : హైకోర్టు

28 May, 2021 18:01 IST|Sakshi

ముంబై : కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న ఎంతోమందికి సహాయం చేస్తున్న బాలీవుడ్‌ సినీ నటుడు సోనూసూద్‌కు ముంబై ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఎంతో మందికి సోనూసూద్‌ సహా పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సేవా కార్యక్రమాలపై జస్టిస్ అమ్జాద్ సయీద్, గిరీష్ కులకర్ణిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోవిడ్ డ్రగ్స్‌పై కేంద్రానికి మాత్రమే అథారిటీ ఉందని, అలాంటప్పుడు సెలబ్రిటీలకు కోవిడ్‌ మందులు, ఇంజెక‌్షన్లు ఎలా వస్తున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న వారి ఆలోచన మంచిదే కానీ, సెలబ్రిటీలకు ఈ స్థాయిలో కోవిడ్‌ డ్రగ్స్‌ ఎలా అందుబాటులో ఉంటున్నాయంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఇందులో  ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందా? అఫీషియల్‌గానే వీరు మందులు సమకూరుస్తున్నారా అన్న విషయాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మరోవైపు రెమిడిసివర్‌ సహా మరికొన్ని కంపెనీలు కేవలం కేంద్రానికే మందులు చేస్తున్నాయని, సెలబ్రిటీలకు సరఫరా చేయడం లేదని కేంద్రం తరుపు న్యాయవాది కోర్టుకు తెలపగా, మరి కేంద్రానికి తెలియకుండా వారి వద్దకు మందులు ఎలా వచ్చాయని ముంబై హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై లోతుగా విచారణ జరిపించాలని పేర్కొంది. కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన ప్రభుత్వం ఇప్పటికే సోనూసూద్‌ సహా, ముంబై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ, ఇతర సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

చదవండి :ప్రముఖ తెలుగు యాంకర్‌పై సోనూసూద్‌ ప్రశంసలు.. కారణమిదే..
హైదరాబాద్‌వాసికి నటుడు సోనూసూద్‌ సాయం

మరిన్ని వార్తలు