భార్య ఉండగా హీరోయిన్‌తో హృతిక్‌ రోషన్‌ ప్రేమాయణం!

20 Jun, 2021 08:20 IST|Sakshi

‘ఆయన గొప్ప నటుడు.. మంచి మనసున్న మనిషి. మహా అందగాడు. ఏ అమ్మాౖయెనా అతనితో ఇట్టే ప్రేమలో పడిపోతుంది’ అని చెప్పింది బార్బరా మోరీ.. హృతిక్‌ రోషన్‌ గురించి. ఆమె మెక్సికో దేశస్తురాలు.  ‘కైట్స్‌’ అనే హిందీ సినిమాలో నటించింది హృతిక్‌ రోషన్‌ సరసన. ఈ ఉపోద్ఘాతంతో అర్థమైపోయి ఉంటుంది ఈ వారం మొహబ్బతే కథానాయిక, నాయకులెవరో!

‘కైట్స్‌’ సినిమా.. హృతిక్‌ రోషన్‌ వాళ్ల హోమ్‌ ప్రొడక్షన్‌. దర్శకుడు అనురాగ్‌ బసు. ప్రధాన నాయికగా బార్బరా మోరీ. మరో హీరోయిన్‌ కంగనా రౌనత్‌. అసలు విషయంలోకి వస్తే.. కైట్స్‌ సినిమా కోసం బార్బరా మోరీ ముంబై వచ్చింది. ఆమెకు కొత్త అయిన ఈ దేశంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత సహజంగానే హృతిక్‌ రోషన్‌ కుటుంబం తీసుకుంది. అద్దెకు సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ నుంచి రాకపోకలకు వాహనాన్ని ఏర్పాటు చేయడం వరకు అన్నీ హృతిక్‌ రోషనే దగ్గరుండి చూసుకున్నాడు. వాటన్నిటినీ నోట్‌ చేసుకుంది మీడియా. 

షూటింగ్‌ మొదలైంది...
సినిమా కంటే ముందే మొదలైన హృతిక్‌ రోషన్, బార్బరా స్నేహం ఆన్‌ సెట్స్‌లోనూ  కొనసాగింది. కైట్స్‌ చాలా వరకు అమెరికా, మెక్సికో దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్‌ ప్యాకప్‌ అయ్యాక  కబుర్లు, వాహ్యాళి, లాంగ్‌ డ్రైవ్‌లతో కాలక్షేపం చేసేవారిద్దరూ. వీటన్నిటినీ ఫొటో జర్నలిస్ట్‌లు రికార్డ్‌ చేశారు. ఒక్కొక్కటిగా ప్రచురించాయి పత్రికలు. కైట్స్‌ కన్నా వాళ్ల ప్రేమ కథే ముందు విడుదలైంది. సుజైన్‌ ఖాన్‌ కూడా ఆ ప్రేమ చిత్రం వార్తలు విన్నది. బాధ పడింది. భర్త బార్బరాతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడన్న వదంతుల గురించి.

 

హృతిక్‌ ఆమెకు చిన్ననాటి స్నేహితుడు. ఇష్టపడి.. రెండు కుటుంబాలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల అన్యోన్య దాంపత్యం బాలీవుడ్‌లో చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి జంట మధ్య  బార్బర చిచ్చు పెడుతోందనే వ్యాఖ్యానాలూ సుజైన్‌కు చేరాయి. ఆ బాధనే హృతిక్‌తో పంచుకుంది. భరోసా ఇచ్చాడు అతను. వాళ్ల కాపురం గురించి పత్రికల వాళ్లు గుచ్చిగుచ్చి అడిగినప్పుడు ‘రబ్బిష్‌. మీడియా క్రియేట్‌ చేసే ఈ రూమర్స్‌తోనే ఇద్దరం అప్‌సెట్‌ అవుతున్నాం తప్ప మా మధ్య ఎలాంటి గొడవలూ లేవు. ఎవరో చిచ్చు పెడితే బ్రేక్‌ అయిపోయేంత బలహీనం కాదు మా బంధం. చాలా స్ట్రాంగ్‌ ’ అని సమాధానమిచ్చింది సుజైన్‌.

సినిమా సంగతికొస్తే..
కైట్స్‌ రిలీజ్‌ అయింది. పెద్దగా ఆడకపోయినా బార్బరా, హృతిక్‌ ఆన్‌ కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చింది.  ఆ కెమిస్ట్రీ వాళ్ల  జీవితంలోనూ కొనసాగింది. నిజంగానే ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. హృతిక్‌ చాలాసార్లు మీడియా ముఖంగా బార్బరాను స్తుతించాడు. ‘బార్బరా నన్ను అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ అర్థం చేసుకోలేదు. రియల్‌ ఫ్రెండ్‌ అంటే తనే’ అంటూ. ఈ డాట్స్‌ అన్నిటినీ కలుపుకొంటూ ఆ ప్రేమ కథను మరింత చిక్కగా అల్లింది మీడియా. సాక్ష్యాలుగా బార్బరా వాడే వేనిటీ వ్యాన్‌ను చూపించింది. అత్యంత విలాస వంతమైన ఆ వాహనాన్ని హృతిక్‌ రోషనే కానుకగా ఇచ్చాడని.. దాని ధర దాదాపుగా రెండు కోట్లుంటుందనీ రాసింది.

అంతేకాదు బార్బరా కోసం తీసుకున్న సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ అద్దెనూ హృతికే చెల్లించేవాడనీ చెప్పింది. బార్బరా ముంబైలో ఉన్నప్పుడు రాకేష్‌ రోషన్‌ వాళ్లింట్లో ఏ చిన్న ఫంక్షన్‌ జరిగినా  హాజరయ్యేదనీ యాడ్‌ చేసింది. ఈ వివరాల్లో కొన్నిటినీ హృతిక్‌ ప్రవర్తనతో సరిపోల్చుకున్నట్టుంది సుజైన్‌. నిజాన్ని గ్రహించినట్టుంది. మొత్తం విషయం అర్థమైంది. ‘ఇక మనం కలసి ఉండడం కుదరదు’ అని తనిల్లు అనుకున్న ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది పిల్లలను తీసుకొని. ఇరువైపు పెద్దలు వాళ్లిద్దరి మధ్య సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ సయోధ్య కుదరలేదు. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే.. 
బార్బరా మోరీ, హృతిక్‌ రోషన్‌ల మధ్య ఉన్న ప్రేమా నిలువ లేదు. కైట్స్‌ సమయంలో సుజైన్‌.. బార్బరాకూ మంచి స్నేహితురాలైంది. తన వల్ల ఆమె బాధ పడిందని, చక్కటి జంట విడిపోయిందనే అపరాధ భావం బహుశా బార్బరాను వెంటాడి ఉండొచ్చు.. అందుకే హృతిక్‌తో తెగతెంపులు చేసుకొని ఉంటుంది. తను దూరమైతే హృతిక్‌ మళ్లీ సుజైన్‌కు దగ్గరవుతాడని బార్బరా అనుకొని ఉండొచ్చు అంటారు హృతిక్‌ సన్నిహితులు. కానీ ఆ ఆలుమగల మధ్య స్పర్థలకు బార్బర మాత్రమే కారణం కాదు.. బార్బరా కూడా ఒక కారణం అంటారు. వాళ్లన్నట్టుగానే బార్బరా వెళ్లిపోయినా హృతిక్, సుజైన్‌ మళ్లీ కలవలేదు. మంచి స్నేహితులుగా, పిల్లలకు ఏ లోటూ రానివ్వని తల్లిదండ్రులగా కొనసాగుతున్నారు అంతే!
- ఎస్సార్‌

చదవండి: తెరవెనుక మహేశ్‌, ప్రభాస్‌ అలా ఉంటారు : సుబ్బరాజు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు