ఇండస్ట్రీలో నెంబర్‌ 1 అవుతాడనుకున్నారు.. కానీ..

9 Jan, 2021 11:17 IST|Sakshi

ముంబై: హృతిక్‌ రోషన్‌  జనవరి10న 48వ ఏట అడుగుపెట్టనున్నాడు. అతను ఫీల్డ్‌లోకి వచ్చి 20 ఏళ్లు గడిచిపోయాయి. ‘కహో నా ప్యార్‌ హై’ (2000) విడుదలైనప్పుడు హృతిక్‌ కాబోయే సూపర్‌ హీరో అని అందరూ అనుకున్నారు. అంటే సల్మాన్‌ఖాన్, షారుక్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌ల కంటే పెద్ద స్టార్‌ అయ్యి ఇండస్ట్రీ నంబర్‌ 1 అవుతాడని భావించారు. కాని అలా జరగలేదు. అలా జరక్కుండా కూడా ఉండలేదు. హృతిక్‌ పెద్ద స్టార్‌గా ఉన్నప్పటికీ టాప్‌ 5లో ఒకడిగా మాత్రమే నిలిచాడు. రణ్‌వీర్‌ సింగ్, రణ్‌బీర్‌ కపూర్‌లాంటి ఈ తరం హీరోలు ఉన్న హృతిక్‌ సినిమా ఓపెనింగ్స్‌ భారీగా ఉంటాయి. తన కెరీర్‌లో నటనను, యాక్షన్‌ను బేలెన్స్‌ చేసుకుంటూ లేడీ ఫ్యాన్స్‌తో పాటు యూత్‌ను కూడా‌ తనను ఫాలో అయ్యేలా చేసుకున్నాడు. ‘కోయీ మిల్‌ గయా’తో పిల్లల్ని, ‘ధూమ్‌ 2’, ‘జోధా అక్బర్‌’ (2008), ‘జిందగీ నా మిలేగి దొబారా’ (2011) సినిమాలు హృతిక్‌ రోషన్‌ భుజాలు ఎంత విశాలమైనవో అవి ఎంతెంత పెద్ద సినిమాలు మోయగలవో నిరూపించాయి. 

అన్నింటి కంటే విశేషం ఏమిటంటే ‘క్రిష్‌’ పేరుతో హృతిక్‌ రోషన్‌ ఒక ఇండియన్‌ సూపర్‌ హీరోను ఇవ్వడం. ‘కోయి మిల్‌ గయా’తో మొదలైన ఈ ఫ్రాంచిస్‌ క్రిష్‌ 2, క్రిష్‌ 3 సినిమాల ఘన విజయంతో కొనసాగింది. దుర్మార్గులను దుష్టులను తన సూపర్‌ పవర్స్‌తో సంహరించే క్రిష్‌గా హృతిక్‌ రోషన్‌ పెద్ద ఇమేజ్‌నే తెచ్చుకున్నాడు. తండ్రి రాకేష్‌ రోషన్‌ ఈ సినిమాలకు రూపుకల్పన చేసి కొడుకు కెరీర్‌కు పెద్ద సాయం చేశాడు. 2021లో ‘క్రిష్‌ 4’ ఇస్తానని వాగ్దానం చేశాడు రాకేష్‌ రోషన్‌. ‘అభిమానుల డిమాండ్‌ మేరకు క్రిష్‌ 4 తీస్తున్నాం’ అని కొంత కాలంగా రాకేష్‌ రోషన్‌ చెబుతూ ఉన్నాడు. ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ ఈ ఒక్క సినిమా కోసం పని చేస్తున్నాడని చెప్పాలి. 2019లో హృతిక్‌ నటించిన ‘సూపర్‌ 30’, ‘వార్‌’ సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఈ సినిమాలక క్రేజ్‌కె క్రిష్‌ క్రేజ్‌ కలిపితే పెద్ద ఫలితం ఉంటుందని తండ్రీ కొడుకులు భావిస్తున్నట్టున్నారు. 

క్రిష్‌లో హృతిక్‌ రోషన్‌ సూపర్‌ విలన్‌గా, హీరోగా ద్విపాత్రాభినయం పోషిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్‌ 3లో వివేక్‌ ఓబెరాయ్‌ విలన్‌గా నటించాడు. ఈసారి హృతిక్‌ రోషన్‌నే చూడాల్సి రావచ్చు. ఇక హృతిక్‌ రోషన్‌ వ్యక్తిగత జీవితం కూడా మెల్లిమెల్లిగా గాడిలో పడుతోంది. భార్య సుశానే ఖాన్‌తో 2014లో విడాకులు తీసుకోవడం హృతిక్‌ను మానసికంగా బాగా దెబ్బ తీసింది. ఇద్దరు కొడుకులతో ఆమె వెళ్లిపోయింది. హృతిక్‌ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కానీ లాక్‌డౌన్‌లో హృతిక్‌ వద్ద సుశానే ఖాన్‌ ఉండటంతో రాబోయే కాలంలో అతని వ్యక్తిగత జీవితం, వృత్తిజీవితం తిరిగి వస్తుందని ఆయన అభిమానులు, సన్నిహితులు ఆశిస్తున్నాయి. ఇక అది జరగాలని ఆశిద్దాం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు