నిన్నెంతగా ఆరాధిస్తానో తెలుసా: తాప్సీ

3 Aug, 2020 15:41 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ తాప్సీ పన్ను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తనకేం మాట్లాడాలో తెలియడం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా సంతోషం పంచుకున్నారు. అసలు విషయమేమిటంటే.. తాప్సీ శనివారం 33వ వసంతంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. ‘‘ నీ అభిమాని నుంచి.. పుట్టినరోజు శుభాకాంక్షలు తాప్సీ. ఈ సంవత్సరం ఎంతో ఎంతో బాగుండాలి. బిగ్‌ హగ్‌’’అంటూ బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ హృతిక్‌ రోషన్‌ ప్రత్యేకంగా విష్‌ చేశాడు. ఇందుకు స్పందించిన తాప్పీ.. ‘‘ఈ మెసేజ్‌ చూసి నేను నిశ్ఛేష్టురాలైపోయాను. అసలు ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. నా గత బర్త్‌డే గిఫ్ట్‌ ఇది. నేను మిమ్మల్ని ఎంతగా ఆరాధిస్తానో తెలుసు కదా. థాంక్యూ’’అంటూ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు.(కంగనా వ్యాఖ్యలపై స్పందించిన తాప్సీ)

అయితే వీరిరువురి మధ్య సంభాషణపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే తాప్సీకి హృతిక్‌ అభిమాని అయిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కంగనా- హృతిక్‌ల మధ్య గతంలో నడిచిన ప్రేమ వ్యవహారం వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్‌తో వెండితెరకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తొలుత గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన ఆమె... విభిన్న పాత్రలు ఎంచుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంటున్నారు. పింక్‌, బేబీ, నామ్‌ షబానా, ముల్క్‌, బద్లా, సాంధ్‌ కీ ఆంఖ్‌, థప్పడ్‌ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

మరిన్ని వార్తలు