Hunt Review: ‘హంట్‌’ మూవీ రివ్యూ

26 Jan, 2023 14:42 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : హంట్‌
నటీనటులు: సుధీర్‌బాబు, శ్రీకాంత్‌, భరత్‌, చిత్ర శుక్లా తదితరులు
నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్‌
నిర్మాత: వీ ఆనంద్‌ ప్రసాద్‌
దర్శకుడు: మహేశ్‌
సంగీతం: జిబ్రాన్‌
సినిమాటోగ్రఫి: అరుల్ విన్సెంట్‌
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
విడుదల తేది: జనవరి 26, 2023

కథేంటంటే..
ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు అర్జున్‌ ప్రసాద్‌(సుధీర్‌ బాబు), మోహన్‌ భార్గవ్‌(శ్రీకాంత్‌), ఆర్యన్‌దేవ్‌(భరత్‌)ల చుట్టు ఈ కథ సాగుతుంది. ఈ ముగ్గురు మంచి స్నేహితులు. ఏ కేసునైనా ఇట్టే సాల్వ్‌ చేస్తారు. వీరిలో ఆర్యన్‌ దేవ్‌ దారుణ హత్యకు గురవుతాడు. ఈ కేసును అర్జున్‌ ప్రసాద్‌ విచారిస్తాడు. తన స్నేహితుడిని చంపిదెవరో తెలుసుకునే క్రమంలో అర్జున్‌కు యాక్సిడెంట్‌ అవుతుంది. ఈ ప్రమాదం కారణంగా ఆయన గతం మర్చిపోతాడు. ఈ విషయాన్ని దాచి మళ్లీ ఆ కేసును విచారించే బాధ్యతను అర్జున్‌కే అప్పగిస్తాడు కమిషనర్‌ మోహన్‌ భార్గవ్‌. గతం మర్చిపోయిన అర్జున్‌ ఈ కేసును ఎలా చేధించాడు? ఈక్రమంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులేంటి? ఇంతకి ఆర్యన్‌ దేవ్‌ని హత్యచేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు చివరకు అర్జున్ ఏం చేశాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
హంట్‌  ఓ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. గతం మర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్‌..తన గతం తెలుసుకొని ఓ మర్డర్‌ కేసును ఎలా ఛేదించాడు అనేదే ఈ సినిమా కథ. క్లైమాక్స్‌లో వచ్చే ఒక ట్విస్ట్‌.. అందరికి షాకివ్వడమే కాకుండా అప్పటి వరకు సినిమాపై ఉన్న ఒపీనియన్‌ని మార్చేస్తుంది. ఆ ఒక్క పాయింట్‌ మాత్రమే కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్‌కి ఒప్పుకొని సినిమాను తీసిన సుధీర్‌ బాబుని కచ్చితంగా అభినందించాల్సిందే. కానీ ఈ సినిమా కథనం మాత్రం ఆసక్తికరంగా సాగదు.

మర్డర్‌ కేసు ఇన్వెస్టిగేషన్‌ నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్‌. సినిమా ప్రారంభం అయిన కొన్ని క్షణాలకే అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. స్టార్టింగ్‌ కాస్త ఇంట్రెస్టింగ్‌గా కథనం సాగుతుంది. కానీ ఓ 15 నిమిషాల తర్వాత రొటీన్‌ సన్నివేశాలు..స్లో నెరేషన్‌ ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారుతుంది. దర్శకత్వం లోపం వల్ల కొన్ని థ్రిల్లింగ్‌ సీన్స్‌ మిస్‌ అయ్యాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. సెకండాఫ్‌లో కథలో వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్‌ తర్వాత వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ మాత్రం ఆడియన్స్‌కి గట్టి షాకిస్తుంది.  

ఎవరెలా చేశారంటే.. 
అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు ఒదిగిపోయాడు. గతం మర్చిపోయిన పోలీసు అధికారిగా ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌, యాక్షన్‌ సీన్‌ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో సుధీర్ బాబు నటన అందరినీ మెప్పిస్తుంది. మోహన్‌ భార్గవ్‌ పాత్రకి శ్రీకాంత్‌ న్యాయం చేశాడు. కాస్త సీరియస్‌గా ఉండే పాత్ర తనది. భరత్‌ చాలా గ్యాప్‌ తర్వాత తెలుగు తెరపై మెరిశాడు. ఏసీపీ ఆర్యన్‌ దేవ్‌గా ఆయన ఉన్నంతలో చక్కగా నటించారు. కథంతా అతని పాత్ర చుట్టే తిరుగుతుంది. మైమ్ గోపీ, కబీర్ సింగ్ దుల్హన్, మంజుల, సంజయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక విషయాలకొస్తే.. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయింది.  అరుల్ విన్సెంట్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు